ఒక్కటి… ఒక్కరోజైనా సరే, ఈసారి బిగ్‌బాస్ సీజన్ ప్రేక్షకులకు నచ్చలేదు… టాస్కులు, ఎలిమినేషన్లు, సర్‌ప్రయిజులు, కంటెస్టెంట్ల ఎంపిక, గేమ్స్, శిక్షలు, సీక్రెట్ రూమ్స్, లేటరల్ ఎంట్రీలు, జోక్స్, డ్రామాలు, లవ్ ట్రాకులు… ఏ విషయమైనా సరే… ఈ సీజన్ బిగ్‌బాస్ చరిత్రలోనే పరమచెత్త… ఏ భాషలోని బిగ్‌బాస్ రేటింగ్స్ తీసుకున్నా సరే, ఈసారి బిగ్‌బాస్ సీజన్ సాధిస్తున్న దరిద్రపు బిచ్చపు రేటింగ్స్ ఇంకే భాషలోనూ లేనట్టున్నాయి… దాని గురించి పదే పదే చెప్పుకోవడం కూడా వేస్టే…
ఒక్కటి మాత్రం కదిలించింది… మొత్తం సీజన్‌లో ఇదొక్కటే ఆకట్టుకుంది… సున్నిత మనస్కులైతే కన్నీళ్లు పెట్టిస్తుంది… ఇదొక్కటే…! ఇందులో టీవీ నటి కీర్తి భట్ ఉంది కదా… ఈసారి ఫ్యామిలీ వీక్… ప్రతి కంటెస్టెంట్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా వచ్చి, కలిసి, మాట్లాడటానికి బిగ్‌బాస్ అవకాశం ఇస్తుంది… ఇదే అదునుగా కాస్త ఎమోషన్ పండించి, తమ రేటింగ్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తారు కంటెస్టెంట్లు… ఆఫ్టరాల్ అంతా గేమే కదా…
అందరికీ అన్నలున్నారు, అమ్మలున్నారు, అయ్యలున్నారు, భార్యలో, భర్తలో… ఎవరో ‘నా అనేవాళ్లు’ ఉన్నారు… చివరకు శ్రీహాన్ వంటి వాళ్లకు భార్యో, ప్రియురాలో తెలియని సిరి ఉంది, ఆమె పెంచుకున్న కొడుకు ఉన్నాడు… రేవంత్ ఇంటికి ఓ కొత్త అతిథి రావాల్సి ఉంది… కానీ కీర్తి… అందరూ తమ కుటుంబసభ్యులతో మాట్లాడుతుంటే, ఆ అనుబంధాలు చూస్తూ కన్నీరు పెట్టుకున్న కేరక్టర్… ఆ సీన్లు ఈ సీజన్ పట్ల ఎంతోకొంత సదభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి… నిజంగానే ఆమెకు ఎవరూ లేరు… ఆమె కథ మనం గతంలోనే చెప్పుకున్నాం…
Ads
చివరకు విధి ఎంతగా ఆమెతో క్రూరంగా ఆడుకున్నాడు అంటే… కుటుంబాన్ని తీసుకుపోయాడు, బిడ్డల్ని పెంచుకుంటే వాళ్లనూ తీసుకుపోయాడు… తనకు బిడ్డలు కలగకుండా చేశాడు… ఎవరూ లేరు అంటే నిజంగానే ఆమెకు ఎవరూ లేరు… లేనితనం అంటే ఆ లేమిని అనుభవించేవారికి తెలుసు, ఆ నొప్పి ఏమిటో, ఆ కన్నీటి ఉప్పదనం ఏమిటో తెలుసు… ఎవరూ లేనితనం బయటి నుంచి చూసేవాళ్లకు అర్థం కాదు, అది అనుభవించేవాళ్లకు తప్ప… అందుకే ఆమె అందరినీ చూస్తోంది… ఏడుస్తోంది… బ్రదర్ అని పిలిచే రోహిత్‌ను కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది…
నాకెవరూ లేరే అనే ఆ బాధను కొంతైనా తగ్గించడానికి టీవీల్లో ఆమె సహనటుడు ఆది అలియాస్ మహేష్ రావడం నచ్చింది… అందుకే చెప్పింది ఈసారి బిగ్‌బాస్ మొత్తానికి ఇదొక్కటే నచ్చింది అని… ఇద్దరూ మంచి డాన్సర్లు, టీవీల్లో కూడా వాళ్ల కెమెస్ట్రీ బాగుంటుంది… ‘నువ్వు అనాథవు కావు, మేమున్నాం… అది చెప్పడానికే వచ్చాను’ అని ఆమెను ఊరడిస్తుంటే ఆ సీన్ భలే పండింది… ఎవరికి ఎవరు..? కానీ మనం గతంలో చెప్పుకున్నట్టు ఏడుస్తుంది కానీ ఆమె డౌన్ కాలేదు…
దేవుడిని తిడుతూ కూర్చోలేదు… వీసమెత్తు నిరాశావాదాన్ని దగ్గరకు రానివ్వలేదు… ఇప్పటికీ ఆమె ఒంట్లో ఎన్ని ప్లేట్లు, ఎన్ని స్క్రూలు ఉన్నాయో ఆమెకే తెలియదు.,. బంధుగణం పెట్టిన బాధల పచ్చిగాయాలు సలుపుతూనే ఉంటాయి… అయితేనేం, జీవితంతో… కాదు, తనను అడ్డగోలుగా ముంచిన ఆ విధితోనే పోరాడుతోంది… ఆదీ నచ్చావోయ్… బాగా…!! కంపోజ్ చేస్తుంటేనే కంటికి ఏదో మసక… లీనమైతే ఇదుగో ఇలాగే, ఇదే తడి…!!
Share this Article