‘‘నేను ఈమధ్యే మాతో కలిసి పనిచేసే చాలామంది మహిళలు, అమ్మాయిలతో మాట్లాడుతుంటే వాళ్ల ఆలోచన విధానాల్లో వచ్చిన మార్పు చూసి ఆశ్చర్యపోయాను… లేడీస్ ఎప్పుడైతే ఫైనాన్షియల్‌గా సెల్ఫ్ రిలయెన్స్ సాధించారో వాళ్లలో పెళ్లిళ్లంటే బాగా విముఖత పెరిగిపోయింది… పెళ్లే ఎందుకు మేడం, పిల్లలు కావాలంటే ఫర్టిలిటీ సెంటర్లు లేవా..? సరోగసీ చాన్స్ లేదా..? ఐవీఎఫ్ లేదా..? నా సొంత పిల్లలు కావాలంటే నా అండాల్నే భద్రపరుచుకుంటాం, అవసరమున్నప్పుడు వాడుకుంటాం అని వాళ్లు మాట్లాడుతుంటే ఎంతటి బలమైన మార్పు కనిపిస్తోంది సొసైటీలో అనిపించింది…’’
….. బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో నటి రాధిక వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇవి… షోలో ముగ్గురు అతిథులకు మూడు ప్రశ్నలు వేశాడు బాలయ్య… ఒకటేమో కిరణ్‌కుమార్‌రెడ్డికి… మూడు రాజధానులు అవసరమా అనేది ప్రశ్న… పాలన రన్ చేయాలంటే అన్ని వ్యవస్థలూ ఒకేచోట ఉంటే బెటరని ఆయన అభిప్రాయపడ్డాడు… ఒకరకంగా మూడు రాజధానులు అనే కాన్సెప్టుకు వ్యతిరేకంగా స్పందించాడు… జాతీయ పార్టీల అవసరం ఎంత..? అని సురేష్‌రెడ్డిని అడిగాడు… ఇన్నేళ్లు జాతీయ పార్టీల అవసరం కనిపించింది… కానీ ప్రాంతాల అభివృద్ధిలో సమతూకం కనిపించడం లేదు… గతంలో భిన్నత్వంలో ఏకత్వం మన సూత్రం… కానీ ఇప్పుడు భిన్నత్వమే ఏకత్వం… సో, ఇప్పుడు తను టీఆర్ఎస్‌లో ఉన్నాడు కాబట్టి సమర్థన తప్పలేదు తనకు…
రాధికను అడిగిన ప్రశ్న… పిల్లల్ని కనాలంటే పెళ్లే కావాలా..? దానికి ఆమె బదులిస్తూ… సోషల్ ఇంజనీరింగ్ మారుతోంది… ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చే కొద్దీ మహిళ, మగాడు నడుమ సమీకరణం మారుతోంది… రెండువారాల క్రితం కొందరు గరల్స్‌తో మాట్లాడుతూ ఉంటే… ‘‘పిల్లలే కావాలనుకుంటే మగాడే ఎందుకు మేడం అంటున్నారు… వాళ్ల మైండ్ సెట్ మారిపోయింది, గతానికి భిన్నమైన ఆలోచనలు మహిళల్లో సాగుతున్నయ్’’ అని చెబుతూ పోయింది ఆమె…
Ads
దానికి కొనసాగింపుగా బాలయ్య కూడా… ‘‘అవును, నేనూ మాట్లాడుతుంటాను కదా… ఆడపిల్లలు ఇలాగే ఆలోచిస్తున్నారు… పెళ్లి, పిల్లలు అనేవి కీలకమైన డెసిషన్లు… అవి సరైనవి తీసుకోవాలంటే చదువు కావాలి, కొలువు కావాలి… తరువాత పెళ్లి, పిల్లలు అవసరమా లేదా అనేది ఆలోచిస్తాం అంటున్నారు…’’
నిజంగానే సొసైటీలో మార్పు వస్తోంది… పెళ్లిళ్లను తమ స్వేచ్ఛను బంధించే ఓ అనవసర చట్రంలా భావిస్తున్నారు చాలామంది… అత్తామామల ఆంక్షలు, అనుమానాలు, భర్త పెత్తనం, తన సంపాదన మీద తన స్వేచ్ఛను కోల్పోవడం, అదనంగా ఇంటి చాకిరీ, పిల్లలు పుడితే అదనపు చాకిరీ… ఇలాగే ఆలోచిస్తున్నారు… నిజమే, సింగిల్ మదర్స్‌గా ఉండిపోవడానికి ఈతరం స్త్రీ పెద్దగా వెనకాడటం లేదు… విడాకుల కేసుల తరువాత మళ్లీ పెళ్లి అనే బంధాల్లోకి వెళ్లడానికి సంకోచిస్తున్నారు… కాకపోతే నీనాగుప్తా తరహాలో పెళ్లిగాకుండానే పిల్లల్ని కని, అలాగే బతికేస్తున్న కేసులు కనిపించడం లేదు… వస్తాయేమో…
(సంతానానికి సంభోగం అక్కర్లేకపోవచ్చు, కానీ మగాడు అవసరమే కదా… మగాడు అంటూ ఉంటేనే కదా, వీర్యం, దానం, అండంతో ఫలదీకరణ… ఒకవేళ క్లోనింగ్ ప్రక్రియకు ప్రభుత్వాల ఆమోదం, సొసైటీ ఆమోదం వచ్చేసి, మహిళ తన దేహంలోని కణంతోనే పిల్లల్ని క్లోనింగ్ చేయించుకుంటే తప్ప… అప్పుడిక మగాడి అవసరం నిజంగానే మహిళకు లేదు…)
నిజానికి మగాళ్లలోనూ ఈ ధోరణి కనిపిస్తోంది… పెళ్లి బంధాన్ని కాపాడుకోవడం, పెళ్లాల్ని కాపాడుకోవడం, పిల్లలు పుడితే అదనపు ఖర్చు… ఇద్దరు పనిచేస్తే తప్ప సంసారం గడవని పరిస్థితి… బొటాబొటీ జీతాలు, జీవితాలు… పెరుగుతున్న ఖర్చులు… గృహహింస తప్పుడు కేసులు సరేసరి.., పాత ప్రియులతో కలిసి, భర్తలను హతమారుస్తున్న కేసులూ విపరీతంగా పెరిగాయి…
ఎలాగూ 30 దాటితే గానీ పెళ్లిళ్లు జరగడం లేదు… 40, 45 దాటితే లైఫులో పెద్ద మజా కూడా ఉండటం లేదు… సో, పెళ్లి అవసరమా అనే ధోరణి పెరుగుతోంది… అలాగని పెళ్లిళ్లు ఇక అక్కర్లేదు అని సింగిల్ ఫాదర్స్‌గా పిల్లల్ని ‘సరోగసీ’ ద్వారా కని బతుకుతున్న కేసులేమీ లేవు… ఈ చర్చకు అన్‌స్టాపబుల్ సరైన ప్లాట్‌ఫామ్ కాదు గనుక దాన్ని సత్వరం ముగించేశారు… కానీ ఎన్‌లైటెన్ సొసైటీలో ఈ డిబేట్ బలంగానే సాగుతోందని రాధిక, బాలయ్యల మాటలు మనకు చెబుతున్నాయి..!!
Share this Article