నిజం… నమస్తే తెలంగాణ ఎప్పుడోసారి చుక్క తెగి రాలిపడ్డట్టుగా… ఓ మంచి కథనాన్ని ప్రజెంట్ చేస్తుంది… మోడీ ప్రభుత్వం గంజాయిని నిషిద్ధ, నార్కొటిక్స్ జాబితా నుంచి తొలగించే ఆలోచనలో ఉందనే ఓ స్టోరీ ఇంట్రస్టింగుగా ఉంది… నిజానికి గంజాయి, వీడ్, మారిజువానా పేరు ఏదైతేనేం..? తరతరాలుగా మన జాతి మత్తుపదార్థం అది… ఈరోజుకూ ఉత్తరాదిలోని అనేక ప్రాంతాల్లో శుభ కార్యాల్లో భంగ్ వాడకం సహజం… హోళీ వంటి సందర్భాల్లోనైతే స్వీట్లు, తాంబూలాలు, లస్సీలు… ఏదోరకంగా భంగ్ కలుపుకుని మహిళలతోసహా గం‘జాయ్’ చేస్తారు… గంజాయి పొగ చాలా మందికి అలవాటు కూడా…
ఎవడో అమెరికాలో ఏ ప్రయోజనం కోసమో గంజాయిని ప్రమాదకర మత్తుపదార్థంగా ముద్రవేశాడు… ఆ కథ మరోసారి చెప్పుకుందాం… ఇంకేం…? ప్రభుత్వం దీని సాగును నిషేధించింది… దీని ఔషధ విలువలనూ కాలరాచింది… దాన్ని చూసి అనేక దేశాలూ అదే పనిచేశాయి… నిజానికి గంజాయి నాటు సారా, చీప్ లిక్కర్, గుట్కాలు, బీడీలు, సిగరెట్లు, చీప్ డ్రగ్స్‌తో పోలిస్తే తక్కువ ప్రమాదకరం… కానీ వినేవాడెవడు..?
Ads
1985లో మన దేశం కూడా దీన్ని నార్కొటిక్స్ జాబితాలోకి చేర్చేసి… సాగును, నిల్వను, వాడకాన్ని, రవాణాను తీవ్ర నేరాలుగా గుర్తించింది… వాస్తవంగా గంజాయి ఎక్సయిజు, పోలీసులు, లాయర్లకు బాగా డబ్బు మత్తు కలిగించే మత్తుపదార్థం… అంతకుమించి సాగు ఏమీ తగ్గదు… కొన్నిచోట్ల బ్రోకర్లే నాణ్యమైన విత్తనాలు ఇచ్చి మరీ సాగు చేయించి, పొలం దగ్గరే డబ్బు చెల్లించి, మద్దతు ధర ముట్టజెప్పి మరీ తీసుకెళ్తారు…
ఇప్పుడు గోవాలో బీజేపీ సర్కారు గంజాయి మీద ఆంక్షలు తొలగించింది, మోడీ సర్కారు దేశంలోనే దీనిపై ఆంక్షలు తీసేయబోతున్నదీ అనేది నమస్తే తెలంగాణ కథనం… ‘యూఎన్ కమిషన్ ఆన్ నార్కొటిక్స్ డ్రగ్స్’పై ఒత్తిడి తెచ్చి, ఈ నిషేధాలన్నీ తొలగించేలా చేయడానికి ఇండియా మాత్రమే కాదు, మరో 20, 30 దేశాలు ప్రయత్నిస్తున్నాయి…
అయితే కేవలం దీనివల్ల డబ్బు వస్తుందనే కాదు… దాన్ని గుడ్డిగా వ్యతిరేకించాల్సిన పనిలేదు… వీథి చివర పాన్ షాపు, పక్క వీథిలో వైన్స్, చాటుమాటుగా దొరికే డ్రగ్స్… వీటికన్నా గంజాయి ఎక్కువ అనారోగ్యకారకం ఏమీ కాదు… పైగా ఔషధాల్లో సరిగ్గా వాడుకుంటే అనేక సమస్యలకు… ప్రత్యేకించి మానసిక వ్యాధులకు మంచి మందు… అయ్యో, అయ్యో, ఇంత ఘోరమా… గంజాయిని చట్టబద్ధం చేస్తారా..? ఇంత దుర్మార్గమా..? అని ఏడ్చి మొత్తుకునే గొంతులు మళ్లీ వినిపిస్తాయి… అందులోనూ మోడీ ప్రభుత్వం చేస్తున్నదీ అంటే అవి మరింత హైపిచ్‌లో కేకలు వేస్తాయి… దానికి రెడీగా ఉండాలి..!!
Share this Article