ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 ఇవే నాకు ప్రత్యర్థులు… వాటితోనే పోరాడుతున్నాను… వాటితోనే నా యుద్దం… రాక్షసులు, మారీచులు అంటూ జగన్ ఎప్పుడూ ఆడిపోసుకుంటూ ఉంటాడు కదా… కొన్నిసార్లు తనే వాటికి తనను ఎగతాళి చేయడానికి చాన్స్ ఇస్తాడు… జనం నవ్వుకునేలా చేస్తాడు… ఏమీ లేకపోయినా జగన్ మీద ఏదో ఒకటి రాసే ఆంధ్రజ్యోతి, ఆ ఏదో దొరికాక ఎందుకు ఊరుకుంటుంది..? నవ్వీ నవ్వీ, మీరూ నవ్వండి అని జనానికి చెబుతూ బొంబాట్ చేసింది ఓ వార్తను… బట్, విచిత్ర పాత్రికేయంలో…
జగన్ మదనపల్లెలో ఓ మీటింగు పెట్టి విద్యాదీవెన నిధుల విడుదలకు ఎప్పటిలాగే బటన్ నొక్కాడు… అక్కడ మాట్లాడుతూ నాకు టీవీ చానెళ్లు తోడుగా లేవు, పేపర్ల అండ కూడా లేదు… ఎవరితోనూ పొత్తు లేదు…, దేవుడిని, ప్రజలను మాత్రమే నమ్ముకున్నాను… చెడిపోయిన రాజకీయ వ్యవస్థతో యుద్ధం చేస్తున్నా… ఇలా చెబుతూ పోయాడు… నిజంగానే వింటుంటే కాస్త నవ్వొచ్చేదే… నాకు టీవీ చానెళ్లు తోడుగా లేవు, పేపర్ల అండ కూడా లేదు అనే మాటలేమిటి అసలు..?
ఇక్కడే ఆంధ్రజ్యోతికి దొరికిపోయాడు… అదసలే ఆంధ్రజ్యోతి… రకరకాల పాత్రికేయ విద్యలతో జగన్‌ను తిట్టిపోస్తుంది, వెక్కిరిస్తుంది… ఇప్పుడు ఏకంగా మరో విద్య ప్రదర్శించింది… ఈ దిగువన క్లిప్పింగు ఓసారి చదవండి…
Ads
సాధారణంగా దినపత్రికల్లో స్పాట్ రిపోర్టింగ్‌లో ఎగతాళి చేయడాలు, తిట్టిపోయడాలు, పకపకా నవ్వడాలు గట్రా ఉండవు… అక్కడ ఏం జరిగిందో అది రిపోర్ట్ చేస్తారు… ఎడిట్ పేజీ వ్యాసాల్లోనో, ఎడిటోరియల్స్‌లోనో తమ ఒపీనియన్ వ్యక్తం చేస్తుంటారు… అది జ్యోతి కాబట్టి, అతను జగన్ కాబట్టి ఇప్పుడేం చేశారంటే… స్పాట్ వార్తకు పైనే పకపకా నవ్వుతూ ఓ ఇంట్రో రాశారు… నవ్వండహో అని పాఠకులకు పిలుపునిచ్చారు… ప్రతి అక్షరంలో హేళన… హెడ్డింగులు సరే, డెక్కులు సరే, అప్పర్ డెక్కులు సరే, ఇంట్రోలు సరే… ఈ విచిత్ర పాత్రికేయ ప్రక్రియకు ఏం పేరు పెట్టాలో… ఈ అప్పర్ ఇంట్రో తరువాత స్పాట్ వార్త ఇలా కనిపిస్తుంది…
నిజంగానే టీవీ చానెళ్లు తోడుగా లేకపోవడం ఏమిటి..? పేపర్ల అండ లేదనడం ఏమిటి..? సాక్షి లేదా..? సాక్షి తను అనుకున్నంతగా పనికిరావడం లేదా..? చివరకు ఓనర్‌కు కూడా చేదు అయిపోయాయా సాక్షి పత్రిక, సాక్షి టీవీ… యెల్లోమీడియాగా పేరు తెచ్చుకున్న జ్యోతి, ఈనాడు, టీవీ5 ఎలాగూ చంద్రబాబు భజనలో తరిస్తాయి కాబట్టి జగన్‌తో ఆడుకుంటున్నయ్… సహజమే… అది ఆజన్మ వైరం… అనగా జన్యువైరం… అనగా సామాజికవర్గ వైరం…
నిజంగానే ఆంధ్రజ్యోతి అడుగుతున్నట్టు… మా మూడూ వ్యతిరేకమే, మరి మిగతా చానెళ్లు, మీడియా ఎవరి వైపు..? ఒకవేళ అవి కూడా వ్యతిరేకంగా ఉన్నాయనేదే జగన్ అభిప్రాయం అయితే కారణాలేమిటి..? ఆ ఆత్మమథనం జరగాలి కదా… ఆ సోయి ఉండాలి కదా… ఎన్టీవీ, టెన్ టీవీ, టీవీ9 ఎట్సెట్రా చానెళ్ల వాటాదారుల్లో అధికులతో జగన్‌కు సత్సంబంధాలే ఉన్నాయి కదా… మరి అవెందుకు తోడుగా లేవు… జ్యోతి, ఈనాడు, సాక్షి తప్ప వేరే పెద్ద పేపర్లు ఏమీ లేవు… జనంలో ఎక్కువ రీచ్ ఉన్నవి ఇవే… ఎలాగూ ఈనాడు, జ్యోతి వ్యతిరేకమే… ఇక పేపర్ల అండ లేదనే వ్యాఖ్యానాలు దేనికి..? అసలు ఇవి కాదు గానీ… చెడిపోయిన రాజకీయ వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాను అనే వ్యాఖ్య మాత్రం భలే నవ్వు తెప్పించింది…!! జగన్ సార్… ఫర్ ఏ ఛేంజ్… నీ స్క్రిప్టు రైౌటర్‌ను మార్చి చూడొచ్చు కదా కొన్నాళ్లు…!!
Share this Article