ఎన్నోసార్లు చెప్పుకున్నదే… కథ పాతదైతేనేం, కొత్తగా చెప్పు… లేదా కొత్త కథ చెప్పు… హిట్-2 సినిమాలోని కథలాంటివి ప్రపంచవ్యాప్తంగా బోలెడు సినిమాల్లో వచ్చాయి… సైకో కిల్లర్ కథలు అత్యంత పురాతన సబ్జెక్టు… పైగా ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్ థ్రిల్లర్ అనేది ఎప్పుడూ చూసే జానరే… టీవీల్లో, వెబ్ సీరీస్‌లో కూడా ఇలాంటి కథలు బోలెడు… అదేదో హిందీ చానెల్‌లో డిటెక్టివ్ సీరీస్ చాలా ఫేమస్ కూడా…
ఇవన్నీ చూసినప్పుడు హిట్-2 ఓ సాదాసీదా ప్రయత్నమే అనిపిస్తుంది… పైగా ఏడు కేసులకు ఏడు సినిమాలు తీస్తారట… ఇప్పుడు వచ్చింది రెండో కేసు మాత్రమే… నిజానికి ఇలాంటివి కొందరు ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకుంటాయి… వాళ్లను కూడా సస్పెన్స్‌లో సినిమా చివరివరకు ఉంచగలిగితేనే సినిమా హిట్ అవుతుంది… లేకపోతే ఫట్…
ఓ కూల్ పోలీస్… క్రైమ్ డిటెక్షన్‌లో దిట్ట… అలా అలా తేల్చేస్తుంటాడు… వెటకారం ఎక్కువ… కానీ సంజన అనే లేడీ మర్డర్ కేసు తనకు సవాళ్లు విసురుతుంది… దర్యాప్తు చేస్తుంటే సంజన మృతదేహం ఆమె ఒక్కరిదే కాదని, మరికొందరు మహిళల అవయవాలతో అసెంబుల్ చేశారనీ తేలుతుంది… దర్యాప్తు గాడి తప్పుతుంటే పై అధికారులతో విభేదాలు, చివరకు సస్పెన్షన్ గట్రా కథనంలో కాస్త పంచ్ కోసం అన్నమాట…
Ads
చివరకు కిల్లర్ ఎవరో తేలుతుంది… ఐనా సరే, చివరివరకూ ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడంలో దర్శకుడు సక్సెసయ్యాడు… నిజానికి శేషు ఈ సినిమాకు బలమైన ఆధారం… ఒంటి చేత్తో సినిమాను మోశాడు… మీనాక్షి ఉందంటే ఉంది… శేషుకు లిప్ లాకులు ఇవ్వడానికి, రొమాంటిక్ సీన్లు పండించడానికి… అంతే… మధ్యమధ్య ప్రెస్‌మీట్లు విసుగు తెప్పించే యవ్వారం…
శేషు గతంలో ఇండస్ట్రీలో ఏం కష్టాలు పడ్డాడో, ఎలా నిలదొక్కుకున్నాడో ఈమధ్య పలు చాట్ షోలలో, ఇంటర్వ్యూలలో చెప్పుకుంటున్నాడు… గతం గతః … ఇప్పుడు బలంగానే నిలబడ్డాడు… ఈ సినిమా బిజినెస్ కూడా శేషు సెంట్రిక్‌గా జరిగిందే… పాటలు, బీజీఎం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగు బాగున్నాయనలేం… అలాగని సినిమాకు మైనస్ అనీ చెప్పలేం… ఇవన్నీ ఎలా ఉన్నా సరే, సినిమాకు కొన్ని అనుకూలాంశాలున్నాయి…
ప్రస్తుతం తెలుగు సినిమా మార్కెట్‌లో పెద్ద సినిమాలు ఏవీ లేవు… ఉన్నంతలో ఈ సినిమాయే బెటర్ ఇక… కాంతార, గాలోడు, మసూద, యశోద తదితర సినిమాలు నడవాల్సినంత నడిచాయి… ఏదైనా కొత్త సినిమా చూడాలీ అనుకుంటే ప్రేక్షకుడికి ఇదే చాయిస్… సినిమా నిడివి కూడా తక్కువ… బోర్ లేదు… కాకపోతే సినిమాలో వావ్ అనిపించే సీన్లు ఏమీ ఉండవ్… క్లైమాక్స్ చాలామందికి నచ్చకపోవచ్చు… ఐతేనేం… శేషుకు మరో ‘హిట్’…!!
Share this Article