మల్లెమాల తీస్తున్న ఏదో సినిమా… జమున, జయలలిత ఇద్దరూ ఉన్నారు… జయలలిత కాస్త ఇంట్రావర్ట్… తన షూటింగ్ పార్ట్ అయిపోగానే ఏదో ఇంగ్లిషు పుస్తకం చదువుతూ ఓ పక్కన కూర్చునేది… యవ్వనంలో అబ్బురపరిచే అందం… మంచి ఇంగ్లిషు పరిజ్ఞానం… వేరే తారలకు తనంటే ఓరకమైన ఈర్ష్య… జమున షూటింగ్ స్పాట్‌కు వెళ్లగానే ఓరోజు అప్పటికే అక్కడికి వచ్చి షూటింగ్‌కు రెడీగా ఉన్న జయలలిత లేచి నిలబడలేదు, విష్ చేయలేదు… జమునకు చర్రుమంది… తనకూ ఇగోయిస్టు అనే పేరుందిగా…
జమున కోపంగా చూస్తూ ‘‘నేను నీకన్నా సీనియర్‌ను, విష్ చేయాలనే జ్ఞానం లేదా..?’’ అనేసింది మొహం పట్టుకుని… జయలలిత కాజువల్‌గా ‘‘నాకలాంటి ఫార్మాలిటీస్ ఏమీ లేవు’’ అనేసింది… జమునకు మరింత మండిపోయింది… తరువాత ఏదో సీన్‌లో జయలలిత పార్ట్ అయిపోయింది… వెంటనే జమున ‘‘నాకన్నా ఎక్కువ ఏడుస్తున్నావ్ పాత్రలో, నువ్వు అంత గట్టిగా ఏడిస్తే నా డైలాగ్ ఏమైపోవాలి..?’’ అని అడిగింది… ‘‘నీ ఏడుపు నువ్వు ఏడువు… నాకన్నా ఎక్కువ ఏడువు, నేనేమైనా వద్దన్నానా..?’’ అని జయలలిత తన పుస్తకపఠనంలో మునిగిపోయింది… దటీజ్ జయలలిత…
ఇదంతా మల్లెమాల ‘ఇదీ నా కథ’ పేరిట రాసుకున్న బయోగ్రఫీలోనిదే… తరువాత జమున అగ్గిమీద గుగ్గిలమై షూటింగ్ వదిలేసి వెళ్లిపోతుంటే… మల్లెమాల కాసేపు నచ్చజెప్పి, వినకపోతే ఇక ‘ఆర్టిస్టును మార్చుకోవాల్సి ఉంటుంది, నీ ఇష్టం’ అని బెదిరిస్తే తప్ప జమున మళ్లీ తొవ్వలోకి రాలేదు… నిజానికి ఆమె జీవితమంతా ఇలాంటి ఘటనలు బోలెడు… ఆమె ఇంట్రావర్టుగా ఉండటం సినిమాల్లో, రాజకీయాల్లో చాలామంది అహాన్ని దెబ్బతీసింది… నిజానికి ఆమె అహం కాదు, ఇతరుల అహమే ఆమెనూ నష్టపరిచింది… కాదు, ఆమెను ఓ బండరాయిగా మార్చింది… ఎవరికీ అర్థం కాని ఓ స్వరూపంగా మారిపోయింది ఆమె… సీన్ కట్ చేస్తే…
Ads
ఆమె బాగా ఆరాధించిందని ప్రచారంలో ఉన్న ఎంజీఆర్ కూడా ఆమె పట్ల ప్రేమతో ఏమీ లేడు… తనది అవసరార్థం ప్రేమ… సినిమా పరిశ్రమలో కనిపించే స్వార్థపూరిత, అవకాశవాద ప్రేమ… ఒక దశలో ఆమెను దూరం పెట్టాడు, తనను ముంచేస్తుందని భయపడ్డాడు… కొందరిని ఎగేశాడు… వాళ్లల్లో ముఖ్యులు నెడుంజెళియన్, వీరప్పన్… వీరిలో నెడుంజెళియన్ ఒక దశలో తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా చేశాడు… ఎంజీఆర్ తరువాత జయలలితను అడ్డుకోవడానికి వాళ్లు చేయని నీచప్రయత్నం, భ్రష్ట ప్రచారం అంటూ లేదు… జయలలితకు వచ్చే పేరు, పాపులారిటీతో కలిగిన ఈర్ష్య కూడా ఓ కారణం…
ఎంజీఆర్ భార్య జానకిని జయలలిత మీద పగ (కనిపించని పగ) తీర్చుకోవడం కోసం వాడుకున్నారు… జానకే అసలైన ఎంజీఆర్ వారసురాలు అనే ప్రచారఘట్టానికి వాళ్లే నాయకులు… బహిరంగంగా, ప్రెస్‌మీట్లలో వీరప్పన్ అయితే ఆమెను అసలు పేరుతో గాకుండా ‘ఫోర్త్ రేట్ లేడీ’ అని వ్యాఖ్యానించేవాడు… ‘ఆమె వంటి ఓ దుష్టశక్తిని నిర్మూలించాల్సిన నైతిక బాధ్యత నాది’ అని వాగేవాడు… నెడుంజెళియన్, వీరప్పన్ వర్గం డీఎంకే శ్రేణులతో లాలూచీపడి జయలలితపై క్షుద్రప్రచారాన్ని చేయించేవాళ్లు…
జయలలితను ‘లగ్జరీ టాక్సీ’, ‘ప్యాసింజర్ రైలు’, దెబ్బతిన్న ‘టౌన్ బస్’ అని పిలవాలని డిఎంకె నాయకులను కోరారు… ఆ స్థితిలో ఆమె మరింత బండబారిపోయింది… ఆమె గుణం కొంత, పరిస్థితులు కొంత, చేదు అనుభవాలు కొంత, రాజకీయాల నీచస్థాయి కొంత ఆమెను పలుసార్లు జ్ఞానశూన్యురాలిగా కూడా చిత్రించాయి… ప్రత్యేకించి వాజపేయి ప్రభుత్వాన్ని పడగొట్టడం ఆమె మూర్ఖపు అహానికి ఓ ప్రబల నిదర్శనం… సరే, ఇలాంటివి ఎన్ని చెప్పుకున్నా జయలలిత అంటే ఓ యూనిక్ కేరక్టర్… చివరకు శశికళ వంటి క్షుద్ర సాహచర్యం, అనామకపు మరణంలోనూ…!!
Share this Article