నిన్న రాత్రి నుంచీ మహాఉబలాటంగా ఉంది… ఉత్సుకత కూడా ఉంది… ఆ జీ20 అఖిల పక్ష సమావేశం వద్ద ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ పెట్టిన సీక్రెట్ స్పై హియర్ బగ్స్ సమయానికి సరిగ్గా పనిచేస్తాయో లేదో… కొందరు నేతల చొక్కా గుండీలకు అమర్చిన నానో కెమెరాలు ఎలా పనిచేస్తాయో ఏమో… ఈమధ్య పెద్దగా సెన్సేషనల్ కవరేజీ ఏదీ పత్రికలో గానీ, ఆ టీవీ చానెల్‌లో గానీ కనిపించలేదు… చాన్నాళ్లకు మరి ఇప్పుడైనా…
మరి ఇప్పుడేమో చంద్రబాబు మొహం చూశాడు మోడీ… బక్కచిక్కారు, బాగున్నారా అనీ మాట్లాడాడు… భేటీలో చంద్రబాబు చెప్పిన 25 ఏళ్ల ఫ్యూచర్ డిజిటల్ ఇండియా ప్లాన్ విని మోడీ నిర్ఘాంతపోయి, ఇలాంటి నేతనా నేను దూరం చేసుకుంటున్నదీ అని ఒకింత చింతాక్రాంతుడైన సందర్భం… చంద్రబాబుతోపాటు జగన్ కూడా వెళ్లాడు భేటీకి… కేసీయార్ డుమ్మా కొట్టాడు ఊహించినట్టుగానే… ప్రతిపక్ష నాయకులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ మంత్రులు, ముఖ్యమంత్రులు… ఇంతటి ప్రాధాన్య భేటీ దగ్గర ఆంధ్రజ్యోతి మార్క్ సమాచార సేకరణకు ఏర్పాట్లు అన్నీ సరిగ్గా జరిగాయో లేదో అనే టెన్షన్ కూడా ఉంది నిన్నటి నుంచీ…
అంతేకాదు… నిన్న రాత్రి నుంచే ఆ టీవీ5 వాడు ఊదరగొడుతున్నాడు… చంద్రబాబుకు ఎదురేగి స్వాగతం చెప్పారు కేంద్రమంత్రులు అట, బరువు తగ్గినట్టున్నారు, బాగా తిరుగుతున్నారట కదా, ఫీడ్ బ్యాక్ వస్తోంది అని చెప్పాడట మోడీ… మీరు కూడా కాస్త బరువు తగ్గినట్టున్నారు అని చంద్రబాబు ప్రతిమర్యాద కనబరిచాడట కదా… ఇద్దరూ తమ బరువుమర్యాదల గురించి చాలా మర్యాదగా మాట్లాడుకున్న తీరును టీవీ5 వాయించేస్తోంది… నిజానికి ఇలాంటి విషయాల్లో ఛాంపియన్ ఏబీఎన్, ఆంధ్రజ్యోతి… నడుమ కొత్తగా ఈ టీవీ5 వాడి పైత్యం ఏమిటట…? అందుకని ఆంధ్రజ్యోతి ఏం రాయబోతోంది..? అని మహా ఉత్కంఠగా ఉంది… స్కూప్ తాత లాంటి వార్త ఏదైనా రాస్తుందా…!!
Ads
ఎస్… ఉదయమే మనసు తేటపడింది… జై ఆంధ్రజ్యోతి… తిరుగులేదు దాని కవరేజీకి… స్పైజర్నలిజంలో కొత్త ఎత్తులకు ఎక్కుతూనే ఉంది… కానీ అదరూ ఊహించినట్టుగా కాదు, చంద్రబాబు-మోడీ ఏం మాట్లాడుకున్నారనేది వదిలేసింది… అదంతా టీవీ5 ఎంగిలి చేసిన వార్త… అందుకని కాంతార సినిమా క్లైమాక్స్ వంటి సన్నివేశానికి… మాంచి అఖండ మార్క్ పంచ్ డైలాగుల్ని పేర్చింది… స్పయింగ్ బగ్స్ రికార్డు చేసిన ప్రతి మాటను పరిశీలించింది… వీడియోల్లో మోడీ మూడ్, జగన్ మూడ్ విశ్లేషించుకుంది… ఓ కథ వదిలింది పాఠకులపైకి…
ఏమోయ్ జగనూ… నీ సొంత చెల్లెలి మీద తెలంగాణ ప్రభుత్వం అంత నీచంగా వ్యవహరిస్తే స్పందించలేదేం..? నాకే బాధనిపించింది… పెట్రోల్ పాకెట్లు, రాళ్లు, కట్టెలతో ఆమె వాహనాల మీద దాడులు చేస్తే, ఆమె నిరసనకు దిగితే, ఆమె ఉన్న కారుతోసహా టోయింగ్ వెహికిల్‌తో ఈడ్చుకువెళ్తే నీకు ఏమీ అనిపించలేదా..? అని జాలిగా, ఒకింత కోపంగా జగన్‌ను అడిగాడట… బిత్తరపోయిన జగన్, బిక్కచచ్చిపోయి ఏమీ బదులు చెప్పలేక నవ్వుతూ ఉండిపోయాడట… ఈ కథ కాస్త కొత్తగా ఉంది…
స్పైజర్నలిజం అంటే ఆంధ్రజ్యోతే… ఆ రిస్కీ ప్రయాస ఎవరి వల్లా కాదు… ఇప్పుడు కూడా కాలేదు… అన్నీ పులిహోర, దధ్యోదనం ముచ్చట్లు ఏవో రాసుకున్నారు తప్పితే అసలు దమ్‌కాబిర్యానీ వార్త అంటే ఇదీ… సింపుల్… అబ్బే, జగన్‌ను నేను అలా అడగలేదు అని మోడీని ఖండించమనండి… పోనీ, మోడీ నన్ను ఏమీ అడగలేదు అని జగన్‌ను మీడియా ముందుకొచ్చి వివరణ ఇవ్వమనండి…
మహా అయితే సకలశాఖామంత్రి, ప్రభుత్వ సలహాదార్ల సంఘం అధ్యక్షుడు సజ్జల రామకృష్టారెడ్డి ఏమైనా స్పందించి, అదేమీ లేదు అంటాడేమో… అవును గానీ జగనూ… నీ సొంత చెల్లెలి మీద తెలంగాణ ప్రభుత్వ దౌర్జన్యం పట్ల ఎందుకు స్పందించలేదు..? కేసీయార్ అంటే నీకూ భయమేనా..? మాట్లాడితే నువ్వు హైదరాబాద్ వెళ్లినప్పుడు నీ కారుకూ టోయింగ్ తప్పదని అనుకున్నావా..? మోడీ ప్రశ్నల్లో అసలు మార్మిక భావన అదేనా..?!
Share this Article