Abdul Rajahussain ………… వంశీ కొత్త పుస్తకం-2…. వంశీకి “ఏవో కొన్ని గుర్తొస్తున్నాయి “… ఇంతకీ చిరంజీవి కళ్ళలో నీళ్ళెందుకు..? ఆ రోజు… ‘మంచుపల్లకి’ క్లైమాక్స్ సీన్ ను చిరంజీవి మీద తీయాలి.. చిరంజీవిని పిలుద్దామని రూమ్ కు వెళితే ఆయన కళ్ళ నిండా నీళ్ళు, ఆయన తల మీద చెయ్యేసి నిమురుతున్నాడు స్టిల్ కెమెరా రాజేంద్ర ప్రసాద్….! “ప్రాబ్లమ్స్ అందరికీ వుంటాయి..ఊరుకుందురూ” అంటూ ఓదారుస్తున్నాడు రాజేంద్రప్రసాద్..!
ఏం జరిగింది…? ఏం జరిగింది ? యూనిట్ అంతా ఒకటే కంగారు… అసలు ఆరోజు తీయాల్సిన సీన్ ఏమిటంటే… ‘హాస్పిటల్ బెడ్ మీద సుహాసిని చనిపోతే.. “గీతా” అంటూ అరుస్తూ కిందపడిపోతాడు చిరంజీవి… గీతా అని చాలా భయానకంగా అరుస్తూ ఏడ్చే చిరంజీవి సోలో షాట్ అది.. సెట్లో జనమంతా చాలా సైలెంట్ గా వున్నారు.. లైట్ మెన్ కూడా ఎలాంటి చప్పుళ్ళు , అరుపులూ లేకుండా పనిచేస్తున్నారు. “షాట్ రెడీ ” చెప్పాడు రఘు.
పక్క గదిలో వున్న చిరంజీవిని పిలవడానికి వంశీ వెళ్ళాడు.. అప్పుడు చిరంజీవి కళ్ళనిండా ఒకటే నీళ్ళు. రాజేంద్రప్రసాద్ చిరంజీవి తలనిమురుతూ…. “ప్రాబ్లమ్స్ అందరికీ వుంటాయి..ఊరుకుందురూ” అంటూ ఓదారుస్తున్నాడు… అయినా వినకుండా ఏడుస్తున్న చిరంజీవి తెల్ల
Ads
చొక్కా తడిసిపోయింది. ఇదంతా చూస్తున్న వంశీకి మాట పడిపోయింది. అసలేమైందో అర్ధం కాలేదు…. వాళ్ళతో పాటు వంశీ కూడా ఏడవాల్సిన పరిస్థితి. అడుగు ముందుకు పడటంలేదు..అడుగు వెనక్కీ పడటం లేదు..
చిరంజీవి యేం మాట్లాడటం లేదని తెగ రెచ్చిపోతున్నాడు స్టిల్ ప్రసాద్…! అలా కొన్ని క్షణాలు జరిగేందుకు ఆ స్టిల్లోడ్ని ఓ తోపుతోసి,.. “సీనంతా ఈ ఒక్క షాటు మీద ఉందట. నేనిక్కడ సపరేటుగా కూర్చొని రిహార్సల్స్ చేసుకుంటుంటే నువ్వేంట్రా ! కాకిగోల? బయటకు పో అర్జంటుగా… అంటూ స్టిల్ ప్రసాద్ను వారించారు చిరంజీవి… అక్కడే వున్న వంశీని చూసి…. “షాట్ రెడీనా సార్” .! అన్నారు …
ఓసి.. ఇదంతా రిహార్సలా.! అందరూ ఊపిరి పీల్చుకున్నారు..!! సినిమా పూర్తయింది… ప్రసాద్ స్టూడియోలో డబ్బింగ్… మొదలైంది. డబ్బింగ్ ఆర్టిస్ట్ దుర్గా గారు సుహాసినికి డబ్బింగ్ చెబుతోంది.. కానీ.. అనుకున్న ఎఫెక్ట్ రావటం లేదు… వంశీ అనుకున్న ఫీల్ మిస్సవుతోంది.. ఆ దుర్గా మంచి ఆర్టిస్టే కానీ, ఆవిడ వాయిస్ మేచ్ అవ్వడం లేదు.. మారుద్దాం ! అన్నారు వంశీ.! మరెవరు బాగుంటారంటావ్ ? సరిత…
అమ్మో! ఆమె రెమ్యునరేషన్ పదివేలు తీసుకుంటుంది.. అంటూనే సత్యం గారెళ్ళి ఆమెతో మాటాడి వచ్చారు.. ఆ మర్నాడే సరిత వచ్చి, డబ్బింగ్ చెప్పి, గీత క్యారెక్టర్ కు ప్రాణం పోసింది.. ఇంతకూ ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? అని అడిగింది సరిత.. నేనేనండీ.. చెప్పాడు వంశీ. ఇంత చిన్నపిల్లాడు డైరెక్టరా? ఆశ్చర్యంగా అంది సరిత..!!
అలా షూటింగ్ డబ్బింగ్,రీ రికార్డింగ్, మ్యూజిక్, మిక్సింగ్ అన్నీ అయిపోయాయి.. ఫస్ట్ కాపీ రెడీ అయి వచ్చేసింది. సాయంత్రం మేళా ధియేటర్లో ఫస్ట్ ప్రొజెక్షన్… క్రాంతి కుమార్, చారు హాసన్ ఇంకా మరికొందరు… అన్నట్టు ఈ సినిమా చారు హాసన్ తమిళ సినిమాకు రీమేక్. పైగా సుహాసిని హీరోయిన్.. అందుకే చారుహాసన్ ఆసక్తిగా వచ్చారు. ఒరిజినల్ కు,రీమేక్‌కు తేడా ఏమైనా వుందా! ఈ కుర్రాడు ఎలా తీశాడు? ఇదీ చారు హాసన్ ఆసక్తి...
ప్రొజెక్షన్ అయిపోయింది.. చారుహాసన్ ఏం మాట్లాడ కుండా వెళ్ళిపోయారు.. వంశీకి తలతిరిగింది… నోటి మాటరాలేదు.. మరుసటిరోజు ఇదే సినిమా ప్రొజెక్షన్ ను ఏర్పాటు చేసి, తన వాళ్ళందర్ని పిలిచుకున్నారు చారుహాసన్. వంశీ అయిష్టంగానే అక్కడికి వెళ్ళాడు.. సినిమా అయిపోయింది…. వాణీగణపతి వెక్కి వెక్కి ఏడుస్తూ బయటకొస్తోంది. సుహాసిని ఆమెను ఓదారుస్తోంది.. అక్కడే వున్న వంశీని చూపిస్తూ.. ఈయనే డైరెక్టర్ అంటూ పరిచయం చేసింది.
గీతా అంటూ… చాలా గొప్పగా చేశాడు చిరంజీవి” అంటూ వాణీగణపతి వెళ్ళిపోయింది.. వంశీ వాళ్ళను సాగనంపి వస్తుంటే చీకట్లో వెక్కి వెక్కి ఏడుస్తూ బాలు గారి చెల్లెలు వసంత కనబడింది. “గీతా ” అంటూ గొప్పగా చేశాడు చిరంజీవి ” అంటూ వెళ్ళిపోయింది.. సురేష్ మహల్ ప్రివ్యూ ధియేటర్లో విశ్వనాథ్ గారు సినిమా చూసి, శిష్యుడు వంశీని మెచ్చుకున్నారు… ఆయనక్కూడా చివర్లో గీతా అంటూ చిరంజీవి చేసిన పెర్ఫార్మెన్స్ బాగా నచ్చింది…
ఆ మరుసటి రోజు రామానాయుడు షో వేయించుకొని చూశారు. సురేష్ పిక్చర్ పేర ఈ సినిమాను తీసుకున్నారు.. నవంబర్ 19 ఉదయం ఆటతో రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు.. ఇంటర్వెల్ అయింది.పాజిటివ్ టాక్… ఇంటర్వెల్ తర్వాత సినిమా మొదలైంది.. క్లైమాక్స్ ను జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో అని వంశీ తెగ మధన పడుతున్నాడు. ఆ సీన్ రానే వచ్చింది ... చిరంజీవి గీతా అంటూ ఏడుస్తుంటే… జనం రివర్స్ అయిపోయి.. గీతా అంటూ అరుస్తున్నారు.. నలుగుర్ని చావగొట్టే చిరంజీవి ఇలా… ఏడ్వడమేంటి? జనాల్లో భయంకరమైన కేకలు..
కుర్రకారు పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నారు… మేటినీ టైముకి క్లైమాక్స్ బాగా లేదన్న టాక్ వచ్చింది. దీంతో ధియేటర్లలో చిరంజీవి “గీతా ” అనే షాట్ కట్ చేసి వేయడం మొదలుపెట్టారు.. మద్రాసు ప్రివ్యూ ల్లో మహామహులు గొప్పగా మెచ్చుకున్న ఈ మంచుపల్లకి సినిమా విజయవాడ శైలజ ధియేటర్లో 50 రోజులు ఆడింది కానీ..మళ్ళీ వంశీకి సినిమా ఇవ్వడానికి ఎవరూ …… ముందుకు రాలేదు…
సత్యం గారు వంశీకి నెల నెలా ఇచ్చే 650 రూపాయలు కూడా ఆపేశారు… అలా డీలాపడి, డైలమాలో వున్న వంశీకి.. ఏడిద నాగేశ్వరరావు నుంచి ఫోన్ వచ్చింది.. “సినిమా చేయాలి,.కథేమన్నా వుంటే పట్టుకు రా!” అన్నారు ఏడిద నాగేశ్వరరావు.. ఇంకేం… గాడ్రేజ్ మంచం కింద దుమ్ము పట్టి వున్న ‘కోకిల ‘ నవలను తీసుకొని, తన ‘సితార’ ఏమైనా మారుతుందేమోనని బయలు దేరారు వంశీ..!! (వంశీ రాసుకున్న… ఏవో కొన్ని గుర్తొస్తున్నాయి అనే పుస్తకంలోని కంటెంటును బట్టి రజాహుసేన్ గారు రాసుకొచ్చిన కథనం)
Share this Article