అసలు సినిమా సాహిత్యం అంటే పల్లీబఠానీ, చాట్ మసాలా… ఏవో నాలుగు పిచ్చి పదాలను ఏదో దిక్కుమాలిన ట్యూన్లో ఇరికించి… ఢమఢమ సంగీత పరికరాలను మోగిస్తే చాలు… దానికి తెర మీద హీరోహీరోయిన్లు నాలుగు గెంతులు గెంతి, పిల్లి మొగ్గలు వేసిపోతారు… అంతా అని కాదు… 90 శాతం ఇంతే… అందులో ప్రమాణాలు, విలువలు, ప్రయోగాలు, తొక్కాతోలు చూస్తే… కనిపించేది డొల్ల… అయితే కొందరిలో ఓ దురభిప్రాయం ఉంది… వీలైనంత సంక్లిష్ట, గంభీర, అర్థం కాని పదాలతో పాట రాస్తే తమ ప్రతిభను చాటుకున్నట్టు ఉంటుందని…!
అంతకుమించిన అమాయకత్వం, మూర్ఖత్వం వేరే ఉండవు… సిట్యుయేషన్, దర్శకుడి టేస్ట్, నిర్మాత ఒత్తిడి, సంగీత దర్శకుడి తెలివి… చాలా అంశాలుంటయ్… అంతేతప్ప పాండిత్యప్రకర్ష సినిమా సాహిత్యంలో ఇమడదు… అలా చేయాలని ప్రయత్నిస్తే, భంగపడి… చివరకు సాగరసంగమం సినిమాలో కమల్‌హాసన్‌లాగా ఏడుస్తూ, వినాయకుడి ముందు విషాదనృత్యం అభినయించాల్సిందే…
Ads
అయినా సరే, కొందరు ఇప్పటికీ, ఈరోజుకూ ఆ ఫీల్ మాత్రం వదలరు… గంభీర పదాలు, సంక్లిష్ట పదబంధాలు వాడితే ఏదో లోతైన భావన, మార్మికార్థం ధ్వనిస్తాయనేది వాళ్ల తలతిక్క భావన… ఒక పాట గుర్తుచేసుకుందాం… రాసింది దేవులపల్లి… ఇక తెలుసుగా… సంగీత దర్శకత్వం ఎస్.రాజేశ్వరరావు… ఎప్పుడో యాభై ఏళ్ల క్రితం సినిమా… పేరు, బంగారు పంజరం… పగలైతే దొరవేరా అనేది పాట… వాణిశ్రీ, శోభన్‌బాబు అభినయం… పాడింది జానకి…
పగలైతే దొరవేరా
రాతిరి నా రాజువురా
రాతిరి నా రాజువురా…
పక్కనా నువ్వుంటే ప్రతిరాత్రి పున్నమి రా
పక్కనా నువ్వుంటే ప్రతిరాత్రి పున్నమి రా
పగలైతే దొరవేరా
రాతిరి నా రాజువురా
రాతిరి నా రాజువురా…
——-
పగలైతే నాలో నీ సొగసంతా దాగేరా
పగలైతే నాలో నీ సొగసంతా దాగేరా
రేయైతే వెన్నెలగా బయలంత నిండేరా..
రాతిరి నా రాజువురా
రాతిరి నా రాజువురా…
—–
నే కొలిచే దొరవైనా…నను వలచే నా రాజువే
నే కొలిచే దొరవైనా…నను వలచే నా రాజువే
కలకాలం ఈలాగే నిలిచే నీ దాననే
పక్కనా నీవుంటే..ప్రతిరాత్రి పున్నమి రా
ప్రతిరాత్రి..ఈ…ఈ.. పున్నమి రా…
—–
పగలైతే దొరవేరా…
రాతిరి నా రాజువురా…
రాతిరి నా…. రాజువురా…
ఇదీ ఆ పాట… దొర, రాజు, పగలు, రాత్రి, పున్నమి, వెన్నెల… ఈ పదాలతోనే పాటంతా రాసేశాడు… మళ్లీ మధురమైన భావ వ్యక్తీకరణ… పగలు ఎన్నెన్నో బాధ్యతల్లో దొరతనం వెలగబెట్టినా… రాత్రయితే మాత్రం నువ్వు నా రాజువురా అని ప్రేమగా, అధికారంతో హత్తుకుంటుంది కథానాయిక… పక్కన నువ్వుంటే ప్రతి రాత్రీ పున్నమిరా అనీ కవ్విస్తుంది… పగలు నా సొగసు, నా ప్రేమను నేను దాచుకున్నా సరే, రాత్రి కాగానే మొత్తం వెన్నెలలా పరుచుకుంటాయనీ… అందుకే నువ్వు నా రాజువురా అని తమకంతో అల్లుకుపోతుంది… లలితమైన, సరళమైన పదాలతో పాటలు రాయడం ఓ కళ… అందరికీ అది చేతకాదు… అలా రాయించుకోవడం కూడా చేతకాదు చాలామందికి… మరేటి చేస్తం…?!
Share this Article