మొన్నటి అయిదో తారీఖున ఇండొనేషియా కొన్ని కీలక చట్టాల్ని చేసింది… పెళ్లిళ్లు గాకుండా శృంగారం, అనగా వివాహేతర శృంగారం నిషేదం… సహజీవనాలపై సంపూర్ణ నిషేధం… దేశ అధ్యక్షుడిని ఏ రీతిలో ఎవరు అవమానించే వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు… రాజ్యానికి వ్యతిరేకంగా అభిప్రాయాల వ్యక్తీకరణ నిషేధం… ఈ కొత్త చట్టాల్ని తీసుకొచ్చేసింది… వివాహేతర శృంగార సంబంధాలు, సహజీవనాలకు సంబంధించి నిందితుల తరఫు వ్యక్తులే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది… అంటే భార్యలు లేదా భర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు…
ఇది మరో నైతిక పోలీసింగ్ తప్ప మరొకటి కాదనీ, ప్రజల జీవనంలోకి ప్రభుత్వం మరీ ఇంతగా జొచ్చుకురావడం సామాజిక మార్పుల్ని అడ్డుకోవడమేననీ అప్పుడే విమర్శలు ప్రారంభమయ్యాయి… ఈ కొత్త చట్టాలు ఇండొనేషియన్లకే కాదు, ఆ దేశంలో బతికే విదేశీయులకూ వర్తిస్తాయి… ఇండొనేషియా ముస్లిం ప్రాబల్యదేశం… బాలి నగరం వరల్డ్ ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్ అయినా సరే ఎప్పటి నుంచో వ్యభిచారం నిషేధం… కానీ ఇన్నాళ్లూ వివాహపూర్వ శృంగారంపై అధికారికంగా నిషేధం ఏమీ లేదు… ఇప్పుడు అదీ ఈ కొత్త చట్టాల వల్ల నిషిద్ధం…
ఈ చట్టాల వ్యతిరేకుల విమర్శలకు మరో ప్రధానాంశం… అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదు, నిరసన ప్రదర్శించకూడదు, రాజ్యం పట్ల వ్యతిరేకతను కనబరచకూడదు… అంటే, ఇది భావప్రకటనను పూర్తిగా హరించడమేనని వాళ్ల విమర్శ… ఇటీవలే ఆ దేశం జీ20 దేశాలకు ఆతిథ్యం ఇచ్చింది… ఈ కొత్త చట్టాల వల్ల ఇన్నాళ్ల టూరిస్ట్ ఫ్రెండ్లీ, గ్లోబల్ ఇమేజీ, ఇన్వెస్ట్‌మెంట్స్ డెస్టినేషన్ దెబ్బతింటుందనేది మరికొందరి ఆందోళన…
Ads
కొత్త చట్టాల పట్ల ప్రభుత్వవర్గాల్లోనే ఒకింత వ్యతిరేకత కనిపిస్తుండటం విశేషం… ఇండొనేషియా టూరిజం ఇండస్ట్రీ బోర్డు డిప్యూటీ చీఫ్ మౌలానా ‘‘ఈ చట్టాలతో టూరిజం, దేశ ఎకానమీ ఎంత దెబ్బతింటుందో మా పర్యాటక మంత్రిత్వశాఖ పదే పదే చెప్పినా మా ప్రభుత్వం వినలేదు… గుడ్డిగా కళ్లు మూసుకుని చట్టాల్ని చేసేశారు’’ అంటున్నాడు… ఈ చట్టాలతో లాభంకన్నా నష్టమే ఎక్కువని ఇండొనేషియా ఎంప్లాయర్స్ అసోసియేషన్ డిప్యూటీ చైర్ పర్సన్ షింతా కాందానీ అంటున్నాడు…
2019లో తొలిసారిగా ఈ బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు దేశవ్యాప్తంగా జనం వీథుల్లోకి వచ్చారు… పౌరహక్కుల్ని హరించే చట్టాలు వద్దంటూ నినదించారు… దాంతో అధ్యక్షుడు జోకో విడోడో ఆ బిల్లుల్ని అటక మీదకు చేర్చాడు… ఈమధ్య మళ్లీ కాస్త సమీక్షించినట్టు చేసి, ఏకగ్రీవంగా ఆమోదింపచేశారు… ఈ సమీక్ష కంటితుడుపు తప్ప, ఇవన్నీ దేశానికి మంచివి కావని ఈ చట్టాల వ్యతిరేకుల ఆరోపణ…
విశేషం ఏమిటంటే… ఇలా కొన్ని వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నా సరే, పార్లమెంటులో మాత్రం అన్ని పార్టీలూ ఈ చట్టాల్ని సమర్థించాయి… దేశంలో ముస్లింలదే అధికజనాభా… కానీ హిందూ, క్రిస్టియన్ జనాభా కూడా ఉంది… కొన్నేళ్లుగా ముస్లిం ఫండమెంటలిజం పెరుగుతూ, అక్కడి రాజకీయ, సామాజిక చిత్రాల్ని బాగా మార్చేస్తుందనే విశ్లేషణలున్నాయి… ఈ చట్టాలూ ఆ కోవలోనివే అనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి..!
భిన్నమైన అభిప్రాయాలూ ఉన్నయ్… ఇస్లాం, హిందూ, క్రిస్టియానిటీ సహా ఆరు గుర్తింపు పొందిన మతాల మూల సిద్ధాంతాల నుంచి వైదొలిగితే అయిదేళ్ల జైలుశిక్ష అనే నిబంధన మాతమార్పిళ్లకు అడ్డుకట్ట వేసినట్టేనంటారు వాళ్లు…, మార్క్కిస్టు, లెనినిస్టు భావజాలంతో ఉన్నవాళ్లు కూడా నేరస్థులేననే నిబంధన కూడా హక్కులవాదుల్ని చిరాకెత్తిస్తోంది… గర్భస్రావాలపై గతంలో ఉన్న నిషేధం ఇప్పుడూ కొనసాగుతుంది… భార్య లేదా భర్త లేనివారితో ఎవరైనా శృంగార సంబంధాలు నెరిపితే వాళ్లు కూడా వ్యభిచారం సెక్షన్ల కిందకు వస్తారు…
Share this Article