కరపత్రికలు, మిగతా పత్రికలతో పోలిస్తే… సరే, భజనపత్రికలతో పోలిస్తే ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీ ప్రయారిటీస్, ప్రజెంటేషన్ బాగుంటాయి… ఈనాడు చప్పిడి, సాక్షి ఉప్మా రుచులతో పోలిస్తే ఆంధ్రజ్యోతి కొంత నయమే… కాస్త చాట్ మసాలా కూడా కలుపుతున్నారు ఈమధ్య… మొన్నామధ్య మునుగోడు ఫలితం మీద ‘గెలవడమే పదివేలు’ అని సూపర్ హెడింగ్ పెట్టిన అదే ఆంధ్రజ్యోతి ఓ నాసిరకం శీర్షిక పెట్టింది… ‘‘గుజరాత్‌లో కమాల్, హిమాచల్ ఢమాల్’’… మునుగోడు కమాల్, రెండు రాష్ట్రాల ఢమాల్…
ఇది చెప్పుకోవాలా..? కోవాలి… ఆంధ్రజ్యోతి మాత్రమే కాదు, మొత్తం మీడియా నిన్నటి రెండు రాష్ట్రాల ఫలితాల్ని గుజరాత్ కోణంలో మాత్రమే, మోడీ కోణంలో మాత్రమే, బీజేపీ కోణంలో మాత్రమే చూశాయి… అదే పలవరించాయి, అదే అపాత్రికేయ మైండ్ సెట్… ఈ మాట అనడానికి ఏమాత్రం సందేహించడం లేదు… అపాత్రికేయమే ఇది…
కమ్యూనిస్టులు, అర్బన్ నక్సల్స్, ఇతర మతాల ఫండమెంటలిస్టులు ఎంతసేపూ మోడీ కోణంలో దేశంలోని ప్రతి పరిణామాన్ని చూస్తుంటారు… విశ్లేషిస్తారు… అరుస్తారు… సోషల్ మీడియాలో కరుస్తారు… బర్డ్ వ్యూలో చూడటానికి, రాగద్వేషాలు లేకుండా గమనించడానికి ఇష్టపడరు… మీడియా కూడా అలాగే ఉండాలా..? ఆంధ్రజ్యోతి కూడా మూడునాలుగు పేజీల ప్రత్యేక కథనాలు ఇచ్చీ, ఆ ప్రయాస ఫలితం గంగలో కలిసినట్టుగా… అదే మోడీ మైండ్ సెట్‌తో ఈ పిచ్చి హెడింగ్ పెట్టినట్టుగా ఉంది… ఎన్నికలు, ప్రజాభిప్రాయం కోణంలో గుజరాత్‌ను, హిమాచల్‌ను అంత వేర్వేరుగా ఎందుకు చూడాలి అసలు..?
Ads
నమస్తే అనే కరపాత్రికేయం అయితే బోలెడు వ్యతిరేక కథనాలు వండి, బీజేపీ మీద కసిని, మోడీ మీద ద్వేషాన్ని టన్నుల కొద్దీ గుమ్మరించింది… వీసమెత్తు ప్రభుత్వ వ్యతిరేకత తన మీద ప్రభావం చూపించకుండా, మునుపెన్నడూ ఎరగనంత అత్యంత భారీ విజయాన్ని బీజేపీ కైవసం చేసుకుంది… ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియకుండా పోయింది దానికి…!
గుజరాత్ కమాల్, హిమాచల్ ఢమాల్ సాంకేతికంగా కరెక్టు… తప్పులేదు… కానీ అది బీజేపీ కోణం… అదే హెడింగ్ కాంగ్రెస్ కోణంలో రాయబడితే… హిమాచల్‌లో కమాల్, గుజరాత్‌లో ఢమాల్ అని ఉండాలి… ఆప్ కోణంలో అయితే గుజరాత్‌లో ఉనికి, హిమాచల్‌లో బెణికి అని రాసుకోవాలి… మిగతా ఏ పార్టీలకు సీన్ లేదు కాబట్టి, వాటి కోణం అక్కర్లేదు…
దేశంలో ఏం జరిగినా మోడీకి, హిందుత్వకు, బీజేపికి ముడిపెట్టి రాసేయడమనే ఓ వైరస్ ప్రబలంగా విస్తరించి, స్థిరంగా తిష్ఠ వేసింది ఇక్కడ… పైగా ఈ అప్పర్ డెక్కులో… రెండు కాదు ఒకటే అని మరో చిరుపైత్యం… విక్టరీ సింబల్ చూపించడానికి ఫాఫం అలా వి ఆకారంలో రెండు వేళ్లు చూపించడమే జనానికి తెలుసు… ఒక గుజరాత్ రిఫ్లెక్ట్ అయ్యేలా, ఒక హిమాచల్ హైడ్ అయ్యేలా ఒకే వేలుతో విక్టరీని ఎలా చూపిస్తారో ఆ రాధాకృష్ణుడికే తెలియాలి…
మరో పైత్యం ఏమిటంటే… మోడీ సొంత రాష్ట్రంలో గెలుపు అట, నడ్డా సొంత రాష్ట్రంలో ఓటమి అట… అంటే నడ్డా వేస్ట్ ఫెలో అని చెబుతున్నట్టా..? గుజరాత్ భారీ విజయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఫాఫం, నడ్డాకు ఏ క్రెడిటూ లేదా..? హిమాచల్ ఓటమిలో ప్రధాని మోడీ ఫెయిల్యూర్ ఏమీ లేదా..? వ్యక్తులకు ఎందుకు ఇవన్నీ ఆపాదించడం… నిజానికి ఇక్కడ ఆంధ్రజ్యోతిని ఓ ఉదాహరణగా తీసుకున్నాను తప్ప ఏ మీడియా కూడా సరిగ్గా నిర్వికారంగా ప్రజెంట్ చేయలేదు…!
Share this Article