శారదా వాసుదేవ్ తన వాల్ మీద రాసుకొచ్చిన ఓ స్టోరీ ఆసక్తికరంగా అనిపించింది… ఏ గుడికైనా రకరకాల స్థలపురాణాలు ఉంటాయి… అందులో అధికశాతం నమ్మబుల్‌గా ఉండవు… కానీ ఇదెందుకో కనెక్టింగ్… ఆమె రాసింది యథాతథంగా ఇక్కడ పెట్టలేం… అంటే స్టార్ గుర్తులు అడ్డుతగులుతాయి… మన భాషలో మనం చదువుకుందాం…
గుండెలపై కాదు… తలపై కుంపటి,.. అది తెలంగాణ కంచి… శ్రీ వరదరాజ పెరుమాళ్ దేవాలయం, వరదరాజపురం… హైదరాబాద్‌కు దగ్గరలోనే ఉంది… ఎలా వెళ్లాలో తెలుసా..? ఈసీఐఎల్ క్రాస్ రోడ్డు నుంచి కుశాయిగూడ, కీసర దాటేసి, అంకిరెడ్డిపల్లి చౌరస్తా చేరాలి… అక్కడి నుంచి మూడు చింతల క్రాస్ రోడ్ చేరి, కరకపట్ల ఊరు కూడా దాటాలి… ఆ తరువాత 8 కిలోమీటర్లు వెళ్తే వరదరాజపురం వస్తుంది…
ఇంకా ఈజీ రూట్ చెప్పాలా..? రాజీవ్ రహదారి ఉంది కదా… సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట మీదుగా కరీంనగర్ వైపు వెళ్లే రోడ్డు… కేసీయార్ ఫామ్ హౌజ్ రోడ్ కూడా అదే… 40 కిలోమీటర్ల దాకా వెళ్లాలి… శామీర్‌పేట దాటి, ప్రజ్ఞాపూర్ చౌరస్తా దగ్గర కుడివైపు తిరగాలి… అంటే జగదేవ్‌పూర్ వైపు… అక్కడి నుంచి 12 కిలోమీటర్లు వెళ్తే ఈ వరదరాజపురం వస్తుంది… ఈ రూట్లో సిద్దిపేట్- భువనగిరి బస్సులు కూడా తిరుగుతుంటాయి…
Ads
కథ ఏమిటంటే… గూడ పెరుమాళ్లు పంతులు తలపై ఓ కుంపటి… చేతుల్లో వరదరాజ పెరుమాళ్ దేవతా మూర్తి… కుంపట్లో కణకణ మండే నిప్పు కణికలు… ఆయన కళ్లలో ఏదో దృఢసంకల్పం… జనం వేల సంఖ్యలో పోగయ్యారు… పెరుమాళ్‌నే చూస్తున్నారు… పంతులుతోపాటు స్వామినీ చూస్తున్నారు… భక్తితో చేతులు జోడిస్తున్నారు… జేజేలు కొడుతున్నారు… అక్కడ గోల్కొండ నవాజు సైన్యం మొహరించి ఉంది… ఓ జాగీర్దారు కుర్చీపై కూర్చున్నాడు…
కంచికి వెళ్లి, వరదరాజ పెరుమాళ్‌ను దర్శించి, వస్తూ వస్తూ నా ఊళ్లోనూ వరదరాజ పెరుమాళ్ గుడి కట్టుకుంటానని ఆ గూడ పెరుమాళ్ల పంతులు నిర్ణయం తీసుకున్నాడు… అందుకే విగ్రహాన్ని చేయించుకుని, తలపై మోసుకుంటూ ఊరికి వచ్చాడు… అదీ నేపథ్యం… వస్తున్నాడు… సరిగ్గా మెదక్ జిల్లా, జగదేవపూర్ మండలానికి వచ్చేసరికి నవాబు సైనికులు ఆగవోయ్ పంతులూ అన్నారు… విగ్రహం ఎలా పెడతావు, గుడి ఎలా కడతావు అని గద్దించారు…
నన్నూ నా దేవుడిని వదిలేయండి, నా దేవుడి గుడిని నేనే కట్టుకుంటాను అని సదరు పంతులు వేడుకున్నాడు… దాంతో నవాబు సైనికులకు ఆడుకుంందామని అనిపించింది… జాగీర్దారు కూడా తలపై కణకణమండే బొగ్గుల కుంపటిని మోసుకుని నడిస్తే గుడి కట్టుకునేందుకు జాగ ఇస్తాను, అనుమతి ఇస్తాను అన్నాడు… పంతులు సంతోషంతో సరే అన్నాడు… నడవడం ఏమిటి, పరుగెత్తుతాను అన్నాడు… అయితే ఒక షరతు, కుంపట్లో బొగ్గు మసి కాకూడదు, నీకు వేడి తగలకూడదు అన్నాడు జాగీర్దారు… దేవుడితో ఆట…
ఏదయితే అదయింది… ఆ దేవుడే చూసుకుంటాడు అనుకున్నాడు పంతులు… పాగల్ బొమ్మన్ అని జాగీర్దారు పగులబడి నవ్వాడు… కానీ పంతులు తననే సూటిగా చూస్తూ ఓ సవాల్ విసిరాడు… నేను కుంపటి తలకెత్తుకుని ఎంత దూరం నడుస్తానో అంత భూమి ఇస్తావా..? నేను గెలిస్తేనే… అనడిగాడు… వేడి పెరిగింది అక్కడ… సరే, కానివ్వు అన్నాడు జాగీర్దారు… అహం… ఆ పే బ్రాహ్మడు గెలిచేది లేదనే భావన…
పెరుమాళ్లు ఆ మొత్తం భూమిలో తనకంటూ ఏమీ ఉంచుకోలేదు… గుడి కట్టించాడు… కోనేరు కట్టించాడు… వసతి గృహాలు, విశ్రమ మంటపాలు, మహాసింహద్వారం, పెద్ద రాజగోపురం, వాహనాల మంటపం, రథాల మంటపం… కంచి తరలి వచ్చినట్టుంది… నగలు, కిరీటాలు, వడ్డాణాలు, జంధ్యాలు సరేసరి… 16 మంది పూజారులు… ఊరి మొదట్లో ఆంజనేయుడి విగ్రహం ప్రతిష్ఠించి వరదరాజులకు రక్షణగా నిలిపాడు…
గుడి చుట్టూ క్రమేపీ ఊరు వెలిసింది… వరదరాజపురం ఏర్పడింది… ఇదంతా జరిగి 450 ఏళ్లట… ఆనాటి పూజారుల పరంపరకు చెందినవారే పూజలు చేస్తున్నారు… వాళ్లే ధర్మకర్తలు… నాటి పెరుమాళ్ ఇప్పటికీ ఈ గుడి రాతి బండల్లో, స్తంభాల్లో, గోపురంలో, పునాదిరాయిలో ఇంకా బతికే ఉన్నాడు… కానీ కొన్నాళ్లుగా గుడికి ఏవో చిక్కులు అంటున్నారు… ఆ భూములపై ఎవరి కన్నయినా పడిందా..? ఏమో, మన దేవాదాయ శాఖకు మింగడమే తప్ప, కాపాడటం తెలియదుగా…!!
Share this Article