ఆడ పని… మగ పని… అసలు వంటపని ఆడదా…? మగదా…? ఇదేం పిచ్చి ప్రశ్న… ఎవరు చేస్తే వాళ్లది..? పనికి లింగభేదం ఏముంది..? మారుతున్న కాలంతోపాటు వంటపనితో పాటు గతంలో కేవలం ఆడవాళ్లకే పరిమితమైన ప్రతి పనిలోనూ మగవాడు సాయం చేస్తున్నాడు… చేయాలి… చేయక తప్పదు… అంట్లు తోమడం ఆడపని… పాలు వేడిచేసి, కాఫీ పెట్టడం మగపని అని తేడాలు ఏమీ ఉండవు కదా…
కానీ కార్పొరేట్ ప్రపంచం ఊరుకుంటుందా..? పనిని కూడా జెండరైజ్ చేసేస్తుంది… తమ ప్రచారం కోసం, తమ అమ్మకాల కోసం, కస్టమర్లను అట్రాక్ట్ చేయడం కోసం… నానా గడ్డీ కరుస్తూనే ఉంటాయి కదా కంపెనీలు… ప్రత్యేకించి ఇళ్లల్లో పనికొచ్చే సరుకుల అమ్మకాల కోసం పోటీ… దాంతో మగ సబ్బులు, ఆడ సబ్బులు… మగ చీపుళ్లు, ఆడ చీపుళ్లు… మగ సర్ఫ్, ఆడ సర్ఫ్… ఇలా సరుకులకు కూడా ఆడ, మగ తేడాల్ని ఆపాదించేశారు…
మిలింద్ సోమన్ హఠాత్తుగా ఇన్‌స్టాలో హాయ్ అని పలకరించి… మగవాళ్ల విమ్ వచ్చిందోయ్, ఆది మన డిష్ వాషింగ్ లిక్విడ్ తెలుసా అన్నాడు… మామూలుగా ఇన్నాళ్లూ పసుపు కలర్ లేదా ఆకుపచ్చ కలర్ డబ్బాలు కనిపించేవి కదా… అవి జస్ట్, ఆడ లిక్విడ్ డబ్బాలు… ఇప్పుడు వచ్చిన మగ లిక్విడ్ బ్లాక్ డబ్బాలో వస్తుందట… ఓహ్, సరేనని మీరు ఆర్డర్ చేస్తే, అవుటాఫ్ స్టాక్ అని బదులొస్తుంది… అంటే ఏమిటి అర్థం..? ప్రచారానికి వేసిన వేషాలు అని అర్థం…!
Ads
మీరు చూస్తూ ఉండండి… ఇది గనుక క్లిక్కయితే ఆడ కుక్కర్లకు దీటైన మగ కుక్కర్లు వస్తాయి… మూకుళ్లు, పెనాలు, సరాతాలు, గరిటలు, చెంచాలు వాట్ నాట్..? ఎవరి సరుకు వాళ్లదే… ఎవరి పనిముట్లు వాళ్లవే…! కానీ విమ్ వాడు మిలింద్ సోమన్ ద్వారా స్టార్ట్ చేసిన ప్రచారం అంత ఆదరణ పొందలేదు సరికదా నెటిజనం వెక్కిరిస్తున్నారు… తిట్టిపోస్తున్నారు కామెంట్లలో…
మీ తల్కాయ్… మగ పని, ఆడ పని ఏమిట్రా… ఆడ సబ్బు, మగ సబ్బు కూడా ఉంటాయా..? ఇంకా నయం… హార్పిక్స్‌కు కూడా ఈ లింగభేదాలు పెట్టలేదు నయమే… కిచెన్‌లో పనులకు ఈ తేడాలు రుద్ది, ప్రచారాలు చేసుకుంటున్నారు సరే… మరి ఫ్రిజులు, టీవీలు, మిక్సీలు, ఫ్యాన్ల మాటేమిటి..? వాటికీ మగతనాన్ని చేర్చి, కొత్త బ్రాండ్లను, కొత్త వేరియంట్లను తీసుకొస్తారా కొంపదీసి…!!
Share this Article