బహుశా మనం ఒకే కోణం నుంచి ఆలోచిస్తున్నామేమో… కేసీయార్ ఢిల్లీ పర్యటనను ఎవరూ దేకలేదు, ఫ్లాప్ అనే చిత్రీకరణ కరెక్టు కాదేమో… కుమారస్వామి, అఖిలేష్ తప్ప ఇంకెవడూ రాలేదు, కేసీయార్‌ను అలుముకోలేదు అనే విశ్లేషణ కూడా సరికాదేమో… ఎందుకంటే… కుమారస్వామి, అఖిలేష్ కేసీయార్ ద్వారా డబ్బులు తిన్న ప్రాణాలు కాబట్టి కాస్త కృతజ్ఞతగా వచ్చారేమో… కానీ మిగతా పార్టీలకు ఆ అవసరం ఏముంది..? రాకేష్ టికాయత్ ఎలాగూ డబ్బులను బట్టి వ్యవహరించే కేరక్టరే…
హైదరాబాద్‌లో తిట్టిపోయి, ఢిల్లీలో కేసీయార్ రైతు దీక్షలో కలిసి కూర్చుంటాడు… మేనేజబుల్… అసలు కేసీయార్ ఆలోచన విధానమే తప్పు… ఎందుకు మరణించారో తెలియని కొందరు రైతు కుటుంబాలకు చెక్కులు ఇచ్చి రావడం కరెక్టు కాదు… రాజకీయ లబ్ధి… ఆ చెక్కులతో ఇక పంజాబ్ రైతాంగం తనకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతారని ఆశించడమే కరెక్టు కాదు… సిక్కు రైతాంగం నమ్మకాన్ని పొందడం అంత వీజీ కాదు… ఈ ప్రకాష్ రాజ్‌లు, ఈ రాకేష్ టికాయిత్లతో రాజకీయం చేయడం ఏమిటో తనకే తెలియాలి… అసలు ఢిల్లీలో తనను నమ్మేవాడు లేదు, వచ్చి పలకరించినవాడు లేడు…
ఇదంతా ఒక వెర్షన్… కానీ అన్ని పార్టీల్లాగే బీఆర్ఎస్ ఒక పార్టీ… దానికీ కొన్ని లక్ష్యాలున్నాయి… దేశమంతా విస్తరించేసి, ప్రధాని కుర్చీ నుంచి మోడిని హిమాలయ గుహలకు తరిమేసి, అధికారం చేజిక్కించుకోవాలని దానికీ ఆశ ఉంది… అందులో తప్పేమీ లేదు… కానీ మాకు పోటీగా మరో పార్టీ వస్తుంటే మేమెందుకు వెళ్లి సంఘీభావం చెప్పాలి..? పోనీ, నువ్వు ఏ కూటమిలో ఉన్నావు..? యూపీఏలో లేవు… సో, డీఎంకే గానీ, ఆర్జేడీ గానీ, జేఎంఎం గానీ, ఎస్పీ గానీ, ఎన్సీపీ గానీ, కాంగ్రెస్ గానీ నీకెందుకు ఆహ్వానం పలకాలి..?
Ads
బీజేపీతో బద్ద వైరం కాబట్టి ఎన్డీయే లేవు… న్యూట్రల్ స్టేటస్ అనుభవించే శివసేన, టీఎంసీ, బిజూ జనతాదళ్ గానీ ఓ పోటీదారుడికి ఎందుకు కేసీయార్‌ను ఆత్మీయంగా కౌగిలించుకోవాలి…? నువ్వెంతో నేనంతే… ఏం, మమతకు ప్రధాని పదవి కావాలని లేదా..? సేమ్, జేడీయూ నేత నితిశ్‌కు కూడా ప్రధాని కావాలని ఉందిగా… అవసరమొస్తే ఎస్పీ, ఆర్జేడీ, జేడీయూ కలిసి పనిచేస్తాయి… కాంగ్రెస్‌తో కలుస్తాయి… కానీ బీఆర్ఎస్తో ఎందుకు కలుస్తాయి..? ఏళ్లనాటి వైరాన్ని పక్కనపెట్టి కేసీయార్ లెఫ్ట్ పార్టీలను చేరదీస్తున్నాడు, మజ్లిస్ కోసం ఏ పనైనా చేస్తాడు… మరి వాళ్లు కూడా పెద్దగా రియాక్ట్ కాలేదెందుకు..?
ఇక్కడా సేమ్… ఒక పార్టీ ఢిల్లీలో ఆఫీసు పెట్టుకుంటే వెళ్లి రావాలా..? అది తప్పనిసరి మర్యాదా..? పైగా కేసీయార్‌కు ఢిల్లీలో ఉన్న పలుకుబడి ఎంత..? క్రెడిబులిటీ ఎంత..? అసలు తన పార్టీకి జాతీయ విధానం అంటూ ఉందా..? కార్యాచరణ ఉందా..? అసలు ఆ ఎమ్మెల్యేల కొనుగోలు వీడియోలనే ఎవరూ పట్టించుకోలేదు… ఇక పార్టీ ఆఫీసు ఓపెన్ చేసుకుంటే వెళ్తారా..? వెళ్లాలా..? సో, ఎవరూ పట్టించుకోలేదు అనే కోణం తప్పేమో… ఐనా కేసీయార్ ఎందరు జాతీయ స్థాయి జర్నలిస్టులను కలిశాడు, తన ఎజెండాను షేర్ చేసుకున్నాడు..? అసలు నేషనల్ మీడియా మేనేజ్మెంట్ ఉందా తనకు..? అకేషన్ వస్తే మాత్రం ఊరూపేరూ లేని పత్రికలకు తెలంగాణ జనం డబ్బును యాడ్స్ కోసం వెదజల్లుతుంటాడు…
ఐనా ఆంధ్రజ్యోతి రిపోర్టింగు ఏదో కక్షతో రాసినట్టుంది… ఈ వార్త చూశారా..? ఇది ఆంధ్రప్రభ… అదేలెండి, మద్యం స్కాంలో పేరుందిగా… కేసీయార్‌కు మద్దతు వెల్లువెత్తుతోందట… దాంతో రైతుసభ పెట్టబోతున్నాడట… ఉత్తరాది రైతులు జైకిసాన్, జైకేసీయార్ అని నినదిస్తున్నారట,… యూపీ, హర్యానా, పంజాబ్ రాజకీయాల్లో ప్రకంపనలు అట… రైతు సభలో పలువురు మాజీ సీఎంలు బీఆర్ఎస్లో చేరబోతున్నారట…ఉత్తరాది నేతల్లో విశ్వాసం విపరీతంగా పెరిగిపోయిందట… ఛిఛీ, కేసీయార్ సొంత పత్రిక నమస్తేతెలంగాణకు, నమస్తే సాక్షికి ఈ రిపోర్టింగులో పదిశాతమైనా చేతనైందా..? దేశం మూడ్ పట్టుకోగలిగిందా..? సార్, కేసీయార్ సార్, ఆ రవిప్రకాష్‌తో మాట్లాడి అర్జెంటుగా అయిదారు టీవీ చానెళ్లు స్టార్ట్ చేయాలి సార్..!!
Share this Article