సమర్థుడైన రాతగాడి లక్షణం ఏమిటంటే… సరళంగా రాయడం, అర్థమయ్యేట్టు రాయడం, ఒక అంశానికే పరిమితం కావడం, తప్పైనా ఒప్పైనా ఒక ధోరణికి స్టికాన్ అయి ఉండటం, అవసరమైన ఉదాహరణలు, ఆధారాలు, గణాంకాలు ఇవ్వడం… ప్రస్తుతం తెలుగులో ప్రభావవంతమైన రాతగాడిగా పేరున్న రాధాకృష్ణకు ఏమైందో, ఎవరైనా బినామీతో రాయించాడో గానీ… తన కొత్త పలుకు 36 అంశాలకు పాకి, పీకబడి… తనేం చెబుతున్నాడో తనకే సమజ్ కాని దురవస్థ…
కానీ ఏమాటకామాట… కేసీయార్ ప్రభుత్వం కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆఫీసు మీద దాడి చేయించడాన్ని సమర్థించాడు… ఈ క్రూరమైన వ్యూహకర్తల వ్యూహాలతో మొత్తం భారతీయ రాజకీయ వ్యవస్థే భ్రష్టుపట్టిపోతోందని బాధపడ్డాడు… నిజమే… ప్రశాంత్ కిషోర్ మార్క్ వ్యూహాలు, సోషల్ మీడియా ఎత్తుగడలు, నెగెటివ్ క్యాంపెయిన్ చాలా నీచమైన కార్యాచరణ… కేసీయార్ చేసింది కరెక్టు… (సునీల్ పేరుకు కాంగ్రెస్ వ్యూహకర్తే అయినా తమ మీద పోస్టులు, ప్రచారానికి పాల్పడుతున్నాడనే కోపంతో కేసీయార్ కోవర్టులే ఆయనకు చెప్పి ఈ దాడులు చేయించారనే గుసగుసలు కూడా ఉన్నాయి…)
ఎందుకంటే… ఒక దశలో ప్రశాంత్ కిషోర్‌ను పిలిచి, పెద్ద పీట వేసి, అతిథి సత్కారాలు చేసి, ఈయన దగ్గర నాకు తెలియని గుప్త మంత్రజాల విద్యలేమీ లేవని గమనించినవాడై కేసీయార్ తరువాత చాలా దూరం పెట్టేశాడు తనను… ఎవరికైనా కేసీయార్ భారీగా ప్రయారిటీ ఇస్తున్నాడు అంటే తన నిగ్గు తేల్చుకునే పరిశీలన పరిధిలో ఉండబడతాడని అర్థం… అయితే ఇక్కడ ఓ ప్రశ్న… సునీల్ కనుగోలు ప్రభుత్వంపై వ్యతిరేక పోస్టులు పెడుతున్నాడు అంటున్నారు… ప్రభుత్వ వ్యతిరేక అభిప్రాయ ప్రకటన చట్టవిరుద్ధం కాదని సుప్రీంకోర్టే పలు కేసుల్లో చెప్పిందిగా మరి…
Ads
పైగా ఇప్పుడు రాధాకృష్ణ నీతులు చెబుతున్నాడు గానీ… ఒక్కసారి అలా ఎన్టీయార్ ట్రస్టు భవన్ వైపు వెళ్లి రావచ్చు కదా… ఐనా మీ క్యాంపే కదా… మీకూ ఓ వ్యూహకర్త ఉన్నాడనీ, తను చేసే పని కూడా ఇదేనని తెలియదా..? జగన్‌కు ఐప్యాక్ ఒప్పందం ముగియవచ్చుగాక… కానీ ప్రశాంత్ కిషోర్ శిష్యరత్నమే కదా జగన్ సోషల్ వ్యూహాలన్నీ చూస్తున్నది… తెలంగాణ బీజేపీకి కూడా వ్యూహకర్తల టీం ఉంది… మరి ఎవరు శుద్ధపూసలు..? దురదృష్టం కొద్దీ ఇండియన్ పాలిటిక్సులో రెండుమూడు దురభిప్రాయాలు బలంగా వేళ్లూనుకున్నాయి ఈమధ్య… అధినేత పాదయాత్ర చేయాలి, వీలయితే రాజశ్యామలయాగం చేయించాలి, సోషల్ మీడియా వ్యూహకర్తల టీం బలంగా ఉండాలి…
జనంలో ఉండనక్కర్లేదు… ప్రజావిధానాలేమిటో చెప్పనక్కర్లేదు… అసలు ఉండనక్కర్లేదు… జనం కష్టాల్లో వారి దగ్గరకు వెళ్లనక్కర్లేదు… జనాన్ని మభ్యపెడుతూ పోవాలి… అంతే… సో, ప్రశాంత్ కిషోర్ గొంగట్లోనే ప్రతి పార్టీ అన్నం తింటోంది… వెంట్రుకలు ఏరడం వృథా ప్రయాస… ఇది కొన్నాళ్లు సాగుతుంది… వచ్చే ఎన్నికల్లో పతాక స్థాయికి చేరుతుంది… తరువాత పతనమవుతుంది… అదొక్కటే ఆశ..!
ఏమాటకామాట… రాధాకృష్ణ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మీద విరుచుకుపడతాడని ఆశపడ్డ తటస్థులను కూడా తను నిరాశపరిచాడు… కొత్తగూడెం వనమా రాఘవకన్నా అనేకరెట్లు వివాదాస్పదుడు కదా… దమ్మున్న పత్రికే గట్టిగా రాయకపోతే ఇంకెవరు రాస్తారు..? మిగతా ఉప్మా పత్రికలకు, పులిహోర చానెళ్లకు అంత సీన్ లేదుగా…!!
Share this Article