ఒకే ఒక సినిమా చేసేసి, ఆ తరువాత సినిమాలకు గుడ్ బై కొట్టేసి, ఇతర రంగాల్లో సెటిలైన వాళ్లు ఉన్నారా..? అదీ హీరోయిన్లు… ఒకసారి ఆ మేకప్పులు, లైట్లు, ఆ పాపులారిటీ పాత కాలం విస్కీలా ఎక్కేసి, ఇక అవకాశాల కోసం ఇండస్ట్రీలోనే చక్కర్లు కొడుతుంటారు సాధారణంగా… కానీ కొందరు ఆ ప్రలోభాల్లో పడరు… ఎస్పీ శైలజ ఒకే ఒక్క సినిమా చేసింది… అదీ విశ్వనాథ్ మొహమాటానికి… సాగరసంగమం… తను ట్రెయిన్డ్ డాన్సర్, ట్రెయిన్డ్ సింగర్ కాబట్టి రెండింటికీ పరీక్ష పెట్టుకుంది.,.. ఇక సినిమాకు ఓ పెద్ద దండం పెట్టింది…
గీతాంజలిలో హీరోయిన్‌గా చేసిన గిరిజ మరీ ఒక్క సినిమా కాదు గానీ మలయాళంలో వందనం, మళ్లీ తెలుగులో హృదయాంజలి… అంతే ఇక, జంప్… మళ్లీ ఎందరు పిలిచినా రాలేదు… హిందీలో షారూక్ ఖాన్‌తో స్వదేశ్ సినిమాలో నటించిన గాయంత్రి జోషి కూడా జస్ట్, ఒకే ఒక్క సినిమా మళ్లీ కెమెరా ముందుకు రాలేదు… షారూక్ పక్కన చేసిన పాపులారిటీ కూడా ఆమెను ప్రలోభాల్లో పడేయలేదు… సప్తపది హీరోయిన్ భమిడిపాటి సబిత కూడా ఒకే సినిమా చేసినట్టు గుర్తు…
మరొకరున్నారు… మహానది చిత్రంలో కమల్ హాసన్ కూతురిగా నటించిన అమ్మాయి శోభన… తను మంచి సింగర్… ట్రెయిన్డ్… అందులోనే శ్రీ రంగ రంగనాథునీ పాటను బాలసుబ్రహ్మణ్యంతో కల్సి తనే పాడింది… శోభనకు అదే తొలి చిత్రం. ఆ తర్వాత మరే చిత్రంలోనూ తను నటించలేదు… మహానది అనగానే గుర్తొచ్చేది సంతానభారతి పేరు… తన గురించి Bharadwaja Rangavajhala ….. మాటల్లో చదవాలి…
Ads
తెలుగులోకి అనువాదమై వచ్చే కమల్ హసన్ సినిమాలన్నిట్లోనూ దాదాపు బాగా తెల్సిన ముఖం ఒకటి కనిపిస్తూంటుంది. మైఖేల్ మదన కామరాజులో కారు మెకానిక్ గానూ… అన్బై శివంలో విలన్ గానూ ఇలా కమల్ మూవీస్ లో రెగ్యులర్ గా కనిపించే ఆ ముఖం పేరు సంతాన భారతి. ఈ మధ్య వచ్చిన విక్రమ్ సీక్వెల్ లో కూడా చివరలో … తాగేసి కమల్ తరపున పోరాడే పాత్రలోనూ కనిపిస్తాడు …
నిజానికి ఆయన నటుడు కాదు. దర్శకుడు. కమల్ హసన్ తోనే రెండు అద్భుతమైన సినిమాలు తీశారు. సంతాన భారతి తన ఫిలిం కెరియర్ దర్శకుడుగా ప్రారంభించారు. నటుడుగా మారారు. దర్శకుడుగా ఆయన తీసిన చిత్రాలు విజయవంతం కావడమే కాదు … ప్రయోగాత్మక చిత్రాలుగా పాపులర్ అయ్యాయి కూడా. దర్శకుడిగానూ నటుడిగానూ కూడా తనదైన ముద్ర వేసిన సినిమా పర్సనాల్టీ ఆయన… నటుడుగా సంతాన భారతి ఎంత బిజీ అంటే … డైరక్షన్ గురించి ఆలోచించలేనంత బిజీ.
ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమా రక్త సంబంధం తెలుగువాళ్లు అంత త్వరగా మరచిపోలేని సినిమా. ఆ సినిమాకు మాతృక తమిళ సినిమా పాశమలర్. శివాజీ గణేశన్, సావిత్రి నటించిన ఆ చిత్రాన్ని సంతాన భారతి తండ్రి ఎమ్.ఆర్. సంతానం నిర్మించారు. నటుడుగా ప్రవేశించిన ఎమ్.ఆర్ సంతానం నిర్మాతగా మారి శివాజీ గణేశన్ తో అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. తండ్రికి రివర్స్ లో సంతాన భారతి దర్శకుడుగా ప్రవేశించి నటుడయ్యారు అంతే తేడా …
నిర్మాత ఎమ్.ఆర్ సంతానం కుమారుడుగా భారతి… సీనియర్ మేకర్ మేన్ పీతాంబరం తనయుడుగా పి. వాసు ఇద్దరూ కలసి దర్శకత్వం చేయాలని నిర్ణయించుకున్నారు. అలా వచ్చిన తొలి చిత్రమే పన్నీరు పుష్పంగళ్. సురేష్, శాంతి కృష్ణ నటించిన ఆ సినిమా తమిళ్ లోనే కాదు… తెలుగులోనూ మంచి ఆదరణే పొందింది.
ఏలూరులో రైల్వే ట్రాక్ అవతల వైపు ఓ థియేటర్ ఉండేది … అందులో చూశా ఈ పన్నీరు పుష్పాల డబ్బింగ్ వర్షను. దర్శకులుగా భారతీ వాసులకు పేరు తెచ్చింది. ఆ తర్వాత కూడా భారతి డైరక్ట్ చేసిన కొన్ని సినిమాలు తెలుగులో మంచి విజయాలనే అందుకున్నాయి. నందమూరి బాలకృష్ణ తొలినాళ్ల సినిమా సాహసమే జీవితం దర్శకులు కూడా భారతీ వాసులే.
ఇళయరాజా సంగీత దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో పాటలన్నీ వెరైటీలే. అందులో వేటూరి కాస్త హిందీ మిక్స్ చేస్తూ రాసిన మబ్బులో చందమామ చాలా స్పెషల్ గా ఉంటుంది. పి.వాసు, సంతాన భారతి ఇద్దరూ దర్శకుడు శ్రీధర్ దగ్గర పనిచేసేవారు. భారతిని శ్రీధర్ కు రికమండ్ చేసినది కవి కణ్ణదాసన్. అప్పుడు శ్రీధర్ మీనవ నన్బన్ తీస్తున్నారు. ఎమ్జీఆర్ హీరోగా చేసిన ఆ సినిమాతోనే వాసు కూడా డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో చేరారు.
అలా మొదలైన స్నేహం జంట దర్శకులుగా వర్ధిల్లింది. అలా ఇద్దరూ శ్రీధర్ , ఎమ్జీఆరుల ఆశీర్వాదాలు పొంది రంగంలోకి దిగారన్నమాట. వాసుతో కలసి కొంతకాలం ప్రయాణించిన తరవాత స్వంత మార్గం పట్టారు సంతాన భారతి. విడిపోయాక వాసు రజనీకాంత్ తో సినిమాలు చేశాడు. భారతి కమల్ హసన్ తో సెటిలైపోయాడు. అలా కమల్ సంతాన భారతి డైరక్షన్ లో వచ్చిన తొలి చిత్రం గుణ.
ఆటిజం ప్రేమికుడి కథతో రూపొందిన ఈ చిత్రం నటుడుగా కమల్ హసన్ కీ… దర్శకుడుగా సంతాన భారతికీ కూడా పేరు తెచ్చింది. స్పానిష్ మూవీ టైమి అప్ టైమి డౌన్ ఆధారంగా సబ్ జాన్ అల్లిన కథే గుణ. ఆటిజంకు గురైన ఓ కుర్రాడి ప్రేమకథ గుణ. ఉమాదేవి అనే ఓ దేవత తనను ప్రేమిస్తుందని…. ఆ ఉమాదేవి కోసం నిరీక్షిస్తూంటాడు.
అదే సమయంలో అనుకోకుండా కనిపించిన ఓ ధనవంతుడి కూతుర్ని ఉమాదేవిగా భావించి తీసుకెళ్లిపోతాడు. ముందు గుణను అసహ్యించుకున్నా… నెమ్మదిగా అతని మీద ప్రేమ కలుగుతుంది ఆ అమ్మాయికి… ఇలా సాగే ఈ గుణలో ఓ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ ఉంది. అదే కమ్మనీ నీ ప్రేమలేఖనే…
దర్శకత్వం కంటే నటించడమే కాస్త కస్టం అంటారు సంతాన భారతి. అదీ వేరే దర్శకుడి చిత్రంలో నటించడం ఇంకాస్త ఇబ్బందికరం అంటారు. శివ చంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఎన్ ఉయిర్ కన్నమ్మ నటుడుగా సంతానభారతి తొలి చిత్రం. ఆ తర్వాత చేసిన సినిమానే మైఖేల్ మదన కామరాజు. ఆ సినిమా నటుడుగా సంతాన భారతికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
కమల్ హసన్, సింగీతం శ్రీనివాసరావుల సహకారం వల్లనే నటుడుగా కొనసాగగలుతున్నాననేది సంతానభారతి అభిప్రాయం. వాసుతో కలసి ఐదు సినిమాలు డైరక్ట్ చేశారు. విడిపోయాక చేసినవి ఎనిమిది. నటుడుగా మాత్రం ఎనభై వరకూ సినిమాలు సక్సస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు. నటుడుగా తనకు తృప్తినిచ్చిన పాత్ర మాత్రం సత్యమే శివం చిత్రంలోనిది అంటారాయన.
విలన్ కారక్టర్లు చేస్తున్న సత్యరాజ్ ను హీరోను చేసిన ఘనత సంతానభారతికే దక్కుతుంది. ఆయన దర్శకత్వం వహించిన మహానది చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ పురస్కారం సాధించింది. అయితే దర్శకుడుగా జాతీయ అవార్డు అందుకోవడం తన జీవిత లక్ష్యం అంటారు భారతి. నిజానికి ఆయన తీసిన గుణ, మహానది చిత్రాలు ఆ స్థాయికి చెందినవే. సంతాన భారతికి తెలుగునాట గుర్తింపు తెచ్చిన రెండు చిత్రాలూ డిఫరెంట్ లుక్ తో వచ్చినవే.
ఫ్రెంచ్ రచయిత విక్టర్ హ్యూగో రచన ఆధారంగా కమల్ హసన్, రంగరాజన్ కలసి రాసిన కథ మహానది పేరుతో తెరకెక్కింది. చైల్డ్ ట్రాఫికింగ్ మొదలుకుని అనేక విషయాలను తడుముతుంది మహానది. తొంభై దశకంలో వచ్చిన ఆర్ధిక సంస్కరణలు పల్లెల స్వరూప స్వభావాలను ఎలా పరిమార్చాయో కూడా చెబుతుంది మహానది.
మహానది తర్వాత మళయాళంలో విజయవంతమైన వియత్నామ్ కాలనీని తమిళ్ లో రీమేక్ చేశారు సంతాన భారతి. ఒరిజినల్ లో మోహన్ లాల్ చేసిన కారక్టర్ తమిళ్ లో ప్రభు చేశారు. సత్యరాజ్ నటించిన ఎంగురుందో వన్ధన్ దర్శకుడుగా సంతాన భారతి చివరి చిత్రం. ఆ తర్వాత పూర్తిగా నటనకే అంకితం అయిపోయారు. దర్శకుడుగా తనకు తృప్తినిచ్చిన సినిమా మాత్రం గుణనే అంటారాయన. ఈ మద్యే బర్త్ డే జరుపుకున్నాడీ కుర్రాడు … శానా మంది తారలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు …!!
Share this Article