2003… హిమాలయన్ టైమ్స్ అనే పత్రిక జర్నలిస్టు ఒకరు ఖాట్మండు వీథుల్లో తిరుగుతున్నాడు ఏదో వార్త కోసం… ఆ వార్త వర్కవుట్ కాలేదు గానీ ఓ కేసినోలో అనుకోకుండా ఓ కేరక్టర్ మొహం అనుమానాస్పదంగా కనిపించింది… ఇక తనపై నిఘా వేశాడు… రెండు వారాలు… పాత పత్రికలు తిరగేశాడు… క్లిప్పింగులు, ఫోటోలు సరిచూసుకున్నాడు… తాజా ఫోటోలతో సహా వార్తలు పబ్లిష్ చేశాడు… ఫలానా వ్యక్తి నేపాల్‌లో తిరుగుతున్నాడు అని…
పోలీసులు సోయిలోకి వచ్చారు… ఆ కేసినో మీద దాడి చేశారు… అప్పటికి ఆ వార్త తెలియని ఆ వ్యక్తి జూదం ఆడుతూనే ఉన్నాడు… తనపై బోలెడు కేసులు… కోర్టుకు హాజరు పరిచారు… యావజ్జీవం పడింది… ఆ వ్యక్తి పేరు శోభారాజ్… ఒకప్పుడు ఈయన పేరు మీద వార్తలే వార్తలు… బయటపడినవే 12 హత్యలు… బయటపడనివి 30… హిప్పీలంటే ద్వేషం… దొంగతనాలు, మోసాలు, హత్యలు అత్యంత సులువుగా చేసేవాడు… అమ్మాయిల్ని ఇట్టే ఆకర్షించేవాడు… తన కళ్లల్లో ఏదో మాయ ఉందంటారు పోలీసులు కూడా… అందుకే పాము అని పిలుస్తారు…
ఇప్పుడు ఆ వ్యక్తి గురించి ఎందుకు చెప్పుకోవాలంటే… తిండి పెట్టీ పెట్టీ, జైలులో మేపీ మేపీ, 78 ఏళ్ల వయస్సులో ఇంకా వీడు ఏం పీకుతాడులే అనుకుని నేపాల్ జైలు నుంచి విడుదల చేసింది… ఈరోజు రిలీజయ్యాడు… ఎటు వెళ్తాడు..? అదీ ప్రశ్న… అసలు తన జాతీయ ఏమిటి..? వియత్నాం సైగాన్‌లో ఓ భారతీయ సింధీ వ్యాపారికీ, తన దుకాణంలో పనిచేసే ఓ వియత్నామీ మహిళకు పుట్టినవాడు శోభారాజ్… తరువాత ఆ తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు… తండ్రేమో ఆ కుటుంబాన్ని వదిలేశాడు…
Ads
ఆ తరువాత తన తల్లి కొత్త ప్రియుడు, ఫ్రెంచ్ ఆర్మీ లెఫ్టినెంట్ తనను దత్తత తీసుకున్నాడు… వాళ్లకూ పిల్లలు పుట్టాక వీడిని పట్టించుకోవడం మానేశారు… అలా పేరుకు ఫ్రాన్స్ పౌరుడు… కుటుంబం నుంచి దూరమై నేరాలకు దగ్గరయ్యాడు… తన రూపంతో ఇండియా నుంచి వియత్నాం దాకా పలు దేశాల్లో తిరిగేవాడు… అత్యంత తెలివైన మోసగాడు… మహామాయగాడు… పదీపదిహేను పాస్‌పోర్టులు ఉపయోగించేవాడు…
మళ్లీ ఏదో కేసులో పట్టుబడ్డాక తీహార్ జైలుకు పంపించారు… తను సంపాదించిన డబ్బు ఉందిగా… అది తన తమ్ముడితో తెప్పించుకుంటూ జైలు సిబ్బందిని లోబరుచుకుని బిందాస్‌గా బతికేవాడు… పాత్రికేయులకు ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు… తన శిక్షాకాలం ముగిసే సమయానికి థాయ్ వారెంటు సిద్ధంగా ఉంది… మరణశిక్ష కూడా పడొచ్చు… ఇండియన్ అధికారులు ఎలాగూ థాయ్ పోలీసులకు అప్పగిస్తారు… అందుకని ఓరోజు తన కాపలాదార్లకు, తోటి ఖైదీలకు పెద్ద పార్టీ ఏర్పాటు చేశాడు జైలులోనే…
అందులో నిద్రమాత్రలు, మత్తుమందు కలిపి, వాళ్లంతా మత్తులోకి జారిపోగానే జైలు నుంచి బయటపడ్డాడు… కానీ గోవాలో ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్‌కు పట్టుబడ్డాడు అనుకోకుండా… మళ్లీ శిక్షల పొడిగింపు… ఐతేనేం, థాయ్ శిక్ష తాత్కాలికంగా తప్పింది కదా… ఇండియన్ జైలులో శిక్షకాలం పూర్తయ్యాక ఇండియా తనను ఫ్రాన్స్‌కు పంపించేసింది… అక్కడ సెలబ్రిటీలా బతికాడు కొన్నాళ్లు… కానీ బుద్ధి ఊరుకోదు కదా… ఎందుకో నేపాల్ వెళ్లాడు… అక్కడ పోలీసులు తనకోసం ఎదురుచూస్తున్నారని తెలిసీ, తను తప్పించుకోగలననే నమ్మకంతో వెళ్లాడు…
అలా ఓ జర్నలిస్టు కారణంగా దొరికిపోయాడు… 19 ఏళ్లుగా నేపాల్ జైల్లోనే ఉన్నాడు… వయస్సు 78కి చేరింది… పలుసార్లు హార్ట్ సర్జరీలు జరిగాయి… నేపాల్ సుప్రీంకోర్టు కూడా వయస్సు, అనారోగ్యం కారణాలతోపాటు ఇప్పటికే 19 ఏళ్లు జైలులో గడిపినందున తన విడుదలకు ఓకే చెప్పింది… బయటపడ్డాడు… ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే..? తను ఎక్కడికి వెళ్తాడు..? ఇండియా..? ఫ్రాన్స్..? అఫ్‌కోర్స్, ఇప్పుడు ఏ దేశం పోలీసులకూ తన మీద ఇంట్రస్టు లేదు… ఇప్పుడు తనేమీ నేరాలు చేసే స్థితిలో లేడు… కానీ పాము పామే..!!
Share this Article