కేరళ… కూత్తనాడు… ఆమె పేరు సుభద్ర… వయస్సు 46… ముగ్గురు పిల్లలు… భర్త రాజన్ గత ఆగస్టులో హఠాత్తుగా మరణించాడు… అతుల్ రాజ్ పేరున్న ఒక పిల్లాడికేమో మస్తిష్క పక్షవాతం… మంచం దిగలేడు… వాడిని విడిచిపెట్టి వేరే పనికి వెళ్లలేదు ఆమె… పెద్ద పిల్లాడు అభిన్ రాజ్ ఓ టెక్నికల్ కోర్సులో జాయినయ్యాడు… చిన్న పిల్లాడు అభిషేక్ రాజ్ ప్రభుత్వ స్కూల్‌లో ఎనిమిదో తరగతి…
అడగలేక అడగలేక అభిషేక్ రాజ్ టీచర్ గిరిజ హరికుమార్ దగ్గరకెళ్లింది… ‘అమ్మా, ఒక్క 500 ఇవ్వగలరా… పిల్లలకు తిండి కూడా లేదు…’ అనడిగింది… నిజంగానే అవసరాలు తీరడం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు… ఆదుకునే వాళ్లు లేరు… వేరే దిక్కులేదు… ఆ టీచర్ ఏం చేసిందంటే, ఆమె అడిగిన దానికి రెట్టింపు ఇవ్వడమే కాదు… అసలు ఆ కుటుంబం పరిస్థితి ఏమిటో గమనించడానికి రెండు రోజులాాగి, తనే వాళ్ల ఇంటికి వెళ్లింది…
‘‘నేను వెళ్లే సమయానికి ఇంట్లో తిండి గింజల్లేవు… పిల్లలకు పెట్టడానికి ఏమీలేదు… సగం కట్టిన ఇల్లు… వేరే ఆదాయం ఏమీ లేదు… పక్షవాతంతో బెడ్ మీద ఉన్న పిల్లాడి పేరిట ప్రభుత్వం కొంత సాయం చేస్తుంది… అదే వాళ్ల కడుపు నింపాలి… లేదంటే పస్తులే… వీళ్లకు నిజంగా నేను ఎలా సాయపడగలనో నాకే అర్థం కాలేదు మొదట్లో…’’ అని చెబుతోంది టీచర్ గిరిజ…
Ads
…(ఎడమవైపు ఉన్నది టీచర్ గిరిజ, కుడివైపు సుభద్ర)…
శుక్రవారం ఆ కుటుంబం పాథటిక్ పొజిషన్ వివరిస్తూ, క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది… చాలామంది మనస్సున్న దాతలు వెంటనే స్పందించారు… రెండు రోజుల్లో 51 లక్షల రూపాయలు వచ్చాయి… సుభద్ర బ్యాంకు ఖాతా నంబర్ ఇచ్చింది… ఆ టీచర్ చేసిన సాయానికి, దాతల స్పందనకు సుభద్రకు కన్నీళ్లు ఆగడం లేదు…
‘‘ఈ కుటుంబం గురించి పోస్ట్ చేస్తున్నప్పుడు నా మనస్సులో ఉన్నవి రెండే విషయాలు… 1) ఆ ఇల్లు నివసించడానికి వీలుగా ఉండాలి… 2) తన పిల్లల తిండి కోసం, చదువు కోసం ఆమె ఇకపై ఎవరినీ చేయిచాచి అడిగే పరిస్థితి ఉండకూడదు… స్పందించిన ప్రతి హృదయానికి కృతజ్ఞతలు’’ అని పోస్ట్ చేసిన గిరిజ ఆ ఫండ్ రెయిజింగ్ అప్పీల్‌ను క్లోజ్ చేసింది…
ఇదీ వార్త… నిజంగా ఇవే వార్తలు… లోకంలో ఇలాంటి సాయం అవసరమైన కుటుంబాలు చాలా ఉంటయ్… కానీ కొన్ని కథలే దాతల్ని కదిలిస్తయ్… కనెక్ట్ చేస్తయ్… ఇదీ అలాంటిదే… సొసైటీలో కొంత పాజిటివిటీని నింపే ఇలాంటి కథలే బహుళ ప్రచారంలోకి రావాలి… మెయిన్ స్ట్రీమ్ మీడియాకు అనేక దరిద్రాలు… దానికెలాగూ చేతకాదు… సోషల్ మీడియాయే శరణ్యం…!!
(తప్పుడు పాథటిక్ కథల్ని పోస్ట్ చేసి, డబ్బులు సంపాదించే వాళ్లు కూడా పుట్టుకొస్తారు, ఆల్‌రెడీ ఉన్నారు… దాతలు ఒకటికిపదిసార్లు చెక్ చేసుకుని, ఆయా ఖాతాలకు డబ్బులు పంపించడం బెటర్… క్రౌడ్ ఫండింగ్ అప్పీల్ పోస్ట్ చేసే వ్యక్తుల క్రెడిబులిటీ కూడా ముఖ్యమే… సుభద్ర ఇష్యూలో ఆ టీచర్ చాలామందికి తెలిసిన వ్యక్తి కావడంతో దాతలు నమ్మి సాయం చేశారు…)
Share this Article