జయసుధ, జయప్రదలతో బాలయ్య అన్‌స్టాపబుల్ ప్రోమో చూశాక కాస్త చిరాకేసింది… ఒకవైపు ప్రభాస్, గోపీచంద్ ఎపిసోడ్ అని ఊదరగొడుతూ మధ్యలో ఈ జయల ఎపిసోడ్ ఏమిటని కాదు… అసలు వాళ్లల్లో ఒక్కొక్కరిని విడివిడిగా గంటసేపు కూర్చోబెట్టాల్సిన బాలయ్య ఇద్దరినీ కలిపి మమ అనిపించడం ఏమిటని… పైగా మధ్యలో రాశిఖన్నాను ఇరికించారు… వాళ్ల అనుభవమంతలేదు ఆమె వయస్సు… అసలు ఆమె వాళ్లిద్దరి నడుమ ఎలా ఫిట్టయ్యందీ అని…
ఆ ఎపిసోడ్ మొత్తం చూడబడ్డాను… మరింత అసంతృప్తి అనిపించింది… ఆ మొత్తం ఎపిసోడ్‌లో కాస్త బాగనిపించింది మాలావత్ పూర్ణ బిట్… ఆమెది స్ఫూర్తిదాయక పర్వతారోహణ చరిత్ర… ఆమెను ఆహా అన్‌స్టాపబుల్ వేదిక మీద పరిచయం చేయడం బాగుంది… కానీ నిజానికి ఆమెను విడిగా వేరే ప్రోగ్రాంలో ఇంకాస్త వివరంగా మాట్లాడిస్తే, తన పయనం గురించి వివరింపజేస్తే ఇంకా బాగుండేది… ఈ జయసుధ, జయప్రద ఎపిసోడ్‌లో సరిగ్గా ఫిట్ కాలేదనిపించింది…
రాశిఖన్నా పూర్తిగా అన్‌ఫిట్ ఆ ఎపిసోడ్‌లో… జయప్రదతో పోలిస్తే జయసుధ ఎందుకో మరీ ముభావంగా కనిపించింది… ఏదో మొహమాటానికి వచ్చాను అన్నట్టుగా, ఏమాత్రం ఉత్సాహంగా లేదామె… వాళ్లతో స్వేచ్ఛగా, తనదైన శైలిలో బాలకృష్ణ షో నిర్వహించలేదు అనిపించింది… వాళ్లేమో బాగా సీనియర్లు, మిగతావాళ్లతో ఆడుకున్నట్టుగా కాదు… బాలయ్య మొహమాటం స్పష్టంగా కనిపించింది… నిజానికి అలాంటివాళ్లతో చాట్ షో సక్సెస్ చేయడమే మంచి టాస్క్… జయసుధ భర్త మరణం సందర్భంగా ఏం జరిగిందో, ఏం చెప్పాలనుకున్నారో వాళ్లకే క్లారిటీ లేదు… అలాగే యూపీ రాంపూర్ ఎన్నికల్లో జయప్రద చేదు అనుభవాలు, భయాల మీద మరీ క్లుప్తంగా ముగించేశారు… వాళ్లిద్దరి ఫ్రెండ్‌షిప్ పరీక్షించే ప్రశ్నలు కూడా ఆకట్టుకోలేదు…
Ads
మధ్యలో వాళ్లను తీసుకుపోయి ఏదో రసం తాపించాడు… దేనికి..? జయసుధ దాన్ని కూడా తిరస్కరించింది… మొహమాటపెట్టి తన పాటకు వాళ్లతో స్టెప్పులేయించే ప్రయత్నం కూడా ఫెయిల్… జయసుధ, జయప్రద, శ్రీదేవి ఒక దశలో తెలుగు సినిమాను శాసించారు… హీరోల ఆధిపత్యం ఉన్న రోజుల్లోనూ వాళ్ల హవా ఉండేది… వాళ్లకు మంచి మంచి పాత్రలు కూడా దక్కాయి అప్పట్లో… మరీ ఇంత పేలవంగా వాళ్లతో ఒక ఎపిసోడ్ మమ అనిపించేశారు, పెద్దగా రక్తికట్టలేదు… నిజానికి అన్‌స్టాపబుల్ ప్రతి ఎపిసోడ్‌కు ముందు బాగా వర్క్ జరుగుతుంది… ఈ ఎపిసోడ్‌కు అది పెద్దగా జరిగినట్టు లేదు…
పద్మ అవార్డులకు సంబంధించి తనకు అన్యాయం జరిగిందని జయసుధకు బాగా అసంతృప్తి ఉంది… నిజానికి ఢిల్లీలో పైరవీ చేసుకునే చాన్స్, స్కోప్ ఉన్నా సరే జయప్రదకు కూడా పద్మ పురస్కారం ఏమీ దక్కలేదు… ఇదే ప్రస్తావన వచ్చినప్పుడు ప్రత్యేకించి కంగనా రనౌత్ పేరు చెప్పి మరీ అలాంటివాళ్లకు పద్మ పురస్కారాలు వస్తున్నాయని ఆక్షేపించడం కరెక్టు కాదనిపించింది…
జయప్రద, జయసుధలకు పద్మ పురస్కారాలు దక్కకపోవడం అన్యాయమే, కానీ కంగనా ఏదో అనర్హురాలు అన్నట్టుగా మాట్లాడటం సరికాదు… ఐనా ఎవరెవరికో భూషణ్‌లు, విభూషణ్‌లు దక్కుతుంటే, ఆమెకు దక్కిన పద్మశ్రీదేముంది..? అసలు పద్మ పురస్కారాలు అంటేనే పైరవీల బాపతు… అందరికీ తెలుసు… అవేకాదు, జాతీయ అవార్డులు కూడా దాదాపు అంతే కదా… మొత్తానికి ఈ ఎపిసోడ్ ఏమాత్రం ఇంప్రెసివ్‌గా లేదు…
ప్రభాస్ ఎపిసోడ్ గురించి ప్రోమో దద్దరిల్లిపోతోంది… కానీ ఇలాంటి చాట్‌షోలకు బ్యానర్లను కూడా అనుమతిస్తారా..? షో రక్తికట్టడానికి కొందరు ఆడియెన్స్‌ను కూర్చోబెడుతుంటారు… కానీ ఈ ఎపిసోడ్‌కు ప్రభాస్ ఫ్యాన్స్‌ను తీసుకొచ్చినట్టున్నారు… ఈలలు, నినాదాలు, కేకలతో వేదిక మారుమోగిపోయింది… బాలయ్య, ప్రభాస్‌లకు వాళ్లను ఆపడమే ప్రయాస అయిపోయింది… ఆ ప్రభాస్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలిక..!!
Share this Article