సూర్యుడి కొడుకు యమధర్మరాజు. కూతురు యమునా నది. ఇద్దరూ నల్లగా ఉంటారు. నలుపు రంగుకు యమధర్మ రాజు ప్రాణమిస్తాడు. ఆయన వాహనం దున్నపోతు నలుపు. ఆయన డ్రెస్ పంచె, ఉత్తరీయం నలుపు, ఆయన చేతిలో యమపాశం నలుపు. భారతంలో ధర్మరాజు పేరు అర్థం చేసుకోవచ్చు. ప్రాణాలు తీసే యముడు ధర్మరాజు కావడం ధర్మబద్దమేనా? అని కొందరి ధర్మ సందేహం. జాతకాలు, సిజేరియన్ కత్తులు, ఆసుపత్రిలో లేబర్ వార్డ్ బెడ్డుల అందుబాటు గొడవల వల్ల పుట్టడం ముందుకో, వెనుకకో మార్చి మనం బ్రహ్మను తీసిపారేయగలం. యముడిని సవాలు చేసి చావును మాత్రం సెకెనులో వెయ్యో వంతు సమయం కూడా వాయిదా వేయలేం. చావొక్కటే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ లాంటి గ్యారెంటీ. యముడి పాలన అంత స్ట్రిక్ట్. ట్రాన్స్పరెంట్. నిష్పక్షపాతం. అందుకే యముడు ధర్మరాజు. లోకంలో చావు లేకపోతే జీవితానికి రుచే ఉండదు. ఎప్పటికీ ఉండిపొమ్మని శాశ్వత ఆయుష్షు ఇస్తే- ఇలా ఉండిపోలేం త్వరగా తీసుకెళ్లు- అని తపస్సు చేసి అయినా చస్తాం. పుట్టినది ఏదయినా చావాలి. అది సృష్టి నియమం. ప్రత్యేకించి పద్నాలుగు లోకాల్లో భూలోకం పేరు మర్త్య లోకం. వ్యాకరణం ప్రకారం మృత్యువు అన్న మాటలో అక్షరాలు, ఒత్తులు అటు ఇటు మారితేనే మర్త్య లోకం అవుతుంది. అంటే చావును వెంటబెట్టుకుని పుట్టే లోకం లేదా చావు గ్యారెంటీ లోకం అని అర్థం.
దక్షిణ దిక్కుకు అధిపతి యముడు. అందుకే వాస్తులో తూర్పు, ఉత్తరం శ్రేష్ఠం. పడమర ముఖం కూడా ఓకే. దక్షిణ ముఖం అంటే భయపడతారు. ఒకప్పుడు ఊరికి ఉత్తరంలో శ్మశానాలు ఉండేవి. దక్షిణంలో పెడితే యముడి బలం మరీ పెరుగుతుందని భయపడినట్లున్నారు. ఉత్తర దిక్పాలకుడు కుబేరుడు. ఎంత సంపాదించినా చివరకు నా వైపు వచ్చి బూడిద కావాల్సిందే అని సింబాలిక్ గా కుబేరుడు ఉత్తరాన శ్మశానం వైపు కూర్చున్నాడేమో! అయినా ఊళ్లు అన్ని దిక్కుల్లో విస్తరించిన తరువాత అష్ట దిక్పాలకులు ఎప్పుడో పరారైపోయారు. ఇప్పుడు శ్మశానాలన్నీ ఊరి మధ్యే ఉంటున్నాయి. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ వన్ లో రోడ్డుకు అటు శ్మశానంలో పుర్రెలు కాలుతుంటాయి. ఇటు హోటల్లో పూరీలు కాలి చట్నీలు కోరుతుంటాయి. ఇదే శ్మశాన వైరాగ్యం! రోడ్ నంబర్ పన్నెండులో కూడా అంతే. శ్మశానంలో పాడెకు కట్లు విప్పి చివరి మంత్రాలు చదువుతుంటారు. పక్కనే కూరగాయల షాపులో పూజలో ప్రసాదానికి చేయదగ్గ కూరలను గృహస్థులు కొంటూ ఉంటారు. జుబ్లీ హిల్స్ డౌన్లో అత్యాధునిక ఎలెక్ట్రిక్ శ్మశానం మహా ప్రస్థానం బాడీని బూడిద చేస్తూ ఉంటుంది. పక్కనే ఏ సీ ఫంక్షన్ హాల్లో శుభకార్యం మంగళ వాద్యాలు మోగుతుంటాయి. ఆ చావుకు ఈ వాద్యం మంగళాశాసనం అనుకోవచ్చు! లేదా ఈ శుభానికి… అమంగళము ప్రతిహతమవుగాక!
Ads
చావు అశుభం అన్నది మన నరనరాన జీర్ణించుకుపోయింది. నిజానికి కాశీకి ఉన్న పేర్లలో “మహా శ్మశానం” అన్నదే చాలా పాపులర్. బతికి ఉండగా చుక్క మంచి నీళ్లు కూడా ఇవ్వని లోకం- చచ్చిన తరువాత చచ్చినవారిని తలుచుకుని తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది. తొంభై తొమ్మిదేళ్ల నిండు ప్రాయానికే హఠాత్తుగా, ఆకస్మికంగా, అర్ధాంతరంగా పోయారే అని గుండెలవిసేలా రోదిస్తూ ఉంటుంది.
ఇంతకంటే శ్మశాన చర్చలోకి వెళితే పాఠకులకు అశుభ సూచకంగా అనిపించవచ్చు. కరోనా కొట్టిన దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా శ్మశానాల్లో చోటు దొరకడం లేదు. కరెంటుతో దేహాలను రెండు నిముషాల్లో బూడిద చేద్దామన్నా- అంతులేని నిరీక్షణ తప్పడం లేదు. అమెరికా లాస్ ఏంజిలిస్ లో ప్రతి ఆరు సెకన్లకు కరోనాతో కన్నుమూసిన ఒక దేహం శ్మశానానికి వస్తోందట. మిషన్ మీద ఉన్నదే ఇంకా కాలి బూడిద కాలేదు- అప్పుడేనా? అని దేహాలను శ్మశానాలు వెనక్కు తిప్పి పంపుతున్నాయట. కరోనా కనీసం గౌరవంగా చావనివ్వదు. చచ్చాక గౌరవంగా అంత్యక్రియలు కూడా చేయనివ్వదు. చచ్చినవారి ఉసురు తగిలి కరోనా నోట్లో పురుగులుపడి చస్తుంది………….. By… పమిడికాల్వ మధుసూదన్
Share this Article