అమితాబ్ బచ్చన్… రేఖ…! అసలు ఆ జంట పేరు వింటే, వాళ్లు నటించిన పాత హిందీ సినిమాలు తలుచుకుంటే సినిమా ప్రియులకు ఓ సంబరం… ఒకనాటి ప్రేమికులు… బహుశా నలభై ఏళ్లు దాటిపోయి ఉంటుంది… వాళ్ల బ్రేకప్ జరిగిపోయి..! ఎవరి బతుకులు వాళ్లవే… ఆ ప్రేమాయణంపై బోలెడు కథలు., వార్తలు, కథనాలు, యూట్యూబ్ వీడియోలు… ఎవరు ఏమైనా రాసుకోనీ… ఇన్నేళ్లలో పాత సంగతుల్ని వాళ్లిద్దరిలో ఎవరూ కెలికే ప్రసక్తే లేదు… ఏ ఇంటర్వ్యూల్లోనూ మాట్లాడేది లేదు… గౌరవప్రదమైన దూరం… లోపల ఒకరి మీద ఒకరికి ఏ భావం ఉందనేది అప్రస్తుతం… వాళ్ల వ్యక్తిగతం… కానీ..?
వాళ్లిద్దరూ మళ్లీ కలిసి నటిస్తే..? వావ్… అదే జరిగితే సూపర్ అనేవాళ్లు ఉంటారు… అబ్బే, ఈ ముసలి వయస్సులో వాళ్లిద్దరూ జంటగా నటించడానికి ఏముంటుందిలే అని పెదవి విరిచేవాళ్లూ ఉంటారు… కానీ వాళ్లిద్దరినీ వాళ్ల వయస్సులకు తగినట్టుగా ఉండే పాత్రల్లోనే జంటగా చూపించే ఒక ప్రయత్నం జరుగుతోంది… ప్రస్తుతం చర్చల్లో ఉన్న ప్రయత్నాలు ఫలించవచ్చు, లేకపోవచ్చు… కాకపోతే వాళ్లిద్దరినీ మళ్లీ ఓసారి జంటగా వెండి తెర మీద చూడాలనుకునేవాళ్లకు మాత్రం మంచి కబురు ఇది…
Ads
ఈటీవీలో ‘ఆలీతో సరదాగా’ షో వస్తుంది కదా… నిన్న తనికెళ్ల భరణితో చిట్‌చాట్… మాటల మధ్యలో ఈ ప్రస్తావన వచ్చింది… ‘‘హేమిటి అన్నా, అంతటి రాఘవేంద్రుడితో సినిమా చేస్తున్నవ్, పైగా నలుగురు హీరోయిన్లు, లక్కీ చాన్స్… అసలు అమితాబ్‌తో కూడా చేస్తున్నావటగా, అది జరిగితే మాత్రం మహా లక్కీ…’ అని ఆలీ అంటుంటే… ‘‘నిజానికి ఎప్పుడో ఆరేళ్ల క్రితం కావచ్చు, ఓ ప్రయత్నం జరిగింది… అమితాబ్, రేఖ జంటగా ఓ సినిమా తీయాలి… కానీ వర్కవుట్ కాలేదు… బాలు, లక్ష్మి కలిసి చేసిన మిథునం సినిమాను ఒకాయన కన్నడంలో డబ్ చేశాడు, ఆ సినిమా గురించి బాలీవుడ్ పెద్దలు తెలుసుకుని, హిందీలో రీమేక్ ఆలోచనలో ఉన్నారు…’’ అని భరణి చెప్పుకొచ్చాడు…
‘‘నిజంగానే ఆ ఇద్దరూ అంగీకరిస్తే… దాన్ని నేనే డైరెక్ట్ చేసే అవకాశం లభిస్తే, ఇక అంతకుమించి అదృష్టం ఏముంది’’ అనేది భరణి ఆనందం… నిజమే, రెండే పాత్రలతో… మలివయస్సులో దంపతుల నడుమ బంధాన్ని విభిన్నంగా చూపించిన చిత్రం మిథునం… బాల సుబ్రహ్మణ్యం, లక్ష్మి ఇద్దరూ ఇద్దరే అన్నట్టుగా నటించారు… బాలు నటించగలడని అందరికీ తెలుసు గానీ, ఇంత బాగా నటించగలడు అని చెప్పింది ఆ సినిమాయే… నిజంగా అమితాబ్, రేఖ ఈ పాత్రలకు అంగీకరిస్తే వాళ్లిద్దరూ భలే సూటవుతారు… బాలు వేసిన పాత్రకు అమితాబ్ పర్ఫెక్ట్ ఆప్ట్… అసలు ఆ ఇద్దరూ ఒక ఫ్రేములో వెండితెర మీద కనిపిస్తేనే ఓ పెద్ద విశేషం… అమితాబ్ వేస్తాడు, ఏమాత్రం మేకప్ లేకపోయినా ముసలి పాత్ర వేయడానికి తను రెడీ… కానీ రేఖ అలా ముసలిదానిలా కనిపించడానికి ఒప్పుకుంటుందా..? అదే అసలు ప్రశ్న…!!
Share this Article