పార్ధసారధి పోట్లూరి …… సుపారీ అనే పదం తరుచూ మనం సినిమాలలో మరియు పత్రికలలో వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం ! సుపారీ అనేది కాంట్రాక్ట్ హత్యలకి మారు పేరుగా వాడుతుంది అండర్ వరల్డ్ మాఫియా ! అయితే ఈ ‘సుపారీ ‘ అనే పదానికి అర్ధం ‘తాంబూలం ‘! డబ్బులు తీసుకొని చేసే హత్యలకి పర్యాయపదంగా సుపారీ అనే పేరు ఎలా వాడుకలోకి వచ్చింది ? ఈ సుపారీ అనే పదానికి చారిత్రిక నేపధ్యం ఉంది అంటే నమ్మాలి ! సుపారీ అనే పదాన్ని ప్రవేశపెట్టినది మొదటగా ‘రాజా భీమ్ దేవ్ ‘!
13 వ శతాబ్దంలో రాజా భీమ్ దేవ్ జీవించినట్లు ఆధారాలు ఉన్నాయి కానీ ఇతను ఎక్కడి వాడో అన్న వివరాలు లభ్యం కావట్లేదు. రాజా భీమ్ దేవ్ కి సంబంధించి ఎలాంటి చిత్రాలు లేవు కానీ ప్రజలు రాజా భీమ్ దేవ్ గురించి చెప్పుకునే కధలు మాత్రం ఒక తరం నుండి ఇంకో తరానికి అలా వ్యాప్తి చెందుతూనే ఉండేవి. కానీ బ్రిటీష్ రచయిత అయిన స్టీఫెన్ మేరేడిత్ ఎడ్వర్డ్స్ వ్రాసిన పుస్తకం [1902] [Stephen Meredyth Edwardes’ book] ది రైస్ ఆఫ్ బాంబే : ఏ రెట్రోస్పెక్ట్ పుస్తకంలో రాజా భీమ్ దేవ్ ని ప్రస్తావించాడు.
హుస్సైన్ జైదీ [Hussain Zaidi]అనే మరో రచయిత కూడా రాజా భీమ్ దేవ్ గురించి తన పుస్తకం ‘డొంగ్రి to దుబాయి – సిక్స్ డికేడ్స్ ది ముంబై మాఫియా [Hussain Zaidi- Dongri to Dubai – Six Decades of the Mumbai Mafia] రాజా భీమ్ దేవ్ గురించి ప్రస్తావించాడు. పై రెండు రెఫెరెన్స్ ల ద్వారా తెలుస్తున్నది ఏమిటంటే రాజా భీమ్ దేవ్ అప్పటి దేవగిరి సంస్థానం రాజు అయిన రామచంద్ర కుమారుడు అని. రాజా రామచంద్ర అల్లా ఉద్దీన్ ఖిల్జీ సైన్యం చేతిలో ఓడిపోయి కోంకణ్ తీర ప్రాంతానికి పారిపోయాడు తన ప్రాణాలు రక్షించుకోవడానికి.
Ads
రాజా రామచంద్ర కోంకణ్ తీర ప్రాంతాలలోని చిన్న చిన్న గ్రామాలని తన ఆధీనంలోకి తీసుకొని మెల్లగా తన రాజ్యాన్ని ముంబై తీర ప్రాంతం వరకు విస్తరించాడు. రాజా రామచంద్ర మరణం తరువాత అతని కుమారుడు అయిన రాజా భీమ్ దేవ్ తన తండ్రి బాధ్యతలని స్వీకరించి ఎలాగయినా సరే కోల్పోయిన తమ దేవగిరి సంస్థానాన్ని తిరిగి ఖిల్జీ దగ్గర నుండి తీసుకోవాలి అనే పట్టుదలతో ఉండేవాడు.
కోంకణ్ తీర ప్రాంతం నుండి ప్రస్తుతం ముంబై గా పిలవబడుతున్న చిన్న చిన్న లంకలు ఉండే ప్రాంతానికి విస్తరించాడు తన రాజ్యాన్ని. అప్పట్లో ఇప్పటిలాగా ముంబై మొత్తం కలిసి ఉండేది కాదు. అరేబియా సముద్రంలో చిన్న చిన్న లంకలుగా ఒక్కో లంక ఒక్కో పేరుతో ఉండేవి. అలా అరేబియా సముద్రoలో ఉన్న చిన్న లంక అయిన ‘మహికావతి ‘ లంకని తన అధీనంలోకి తీసుకున్నాడు రాజా భీమ్ దేవ్. మహికావతి అప్పట్లో పేరు అయితే ప్రస్తుతం ‘మహీమ్‘ [Mahim ] పేరుతో ముంబై లో కలిసిపోయింది.
రాజ భీమ్ దేవ్ మహీమ్ లో ఒక కోట కట్టాడు చుట్టూ సముద్రం మధ్యలో కోట అన్నమాట. తన తండ్రి హయాంలో కోల్పోయిన దేవగిరి సంస్థానం తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియలో భాగంగా ఖిల్జీ సైన్యంలోని ముఖ్యులని ఎంపిక చేసుకొని ఒక్కొక్కరిని చంపించేవాడు రాజా భీమ్ దేవ్ ! దీని కోసం తన సైన్యంలోని ఎంపిక చేసిన కొందరిని తన కోటలో విశాలమైన చోట అందరినీ సమావేశపరిచి తన వ్యూహం ఏమిటో, ఎవరిని చంపాలో స్పష్టంగా చెప్పి ఆ పని చేయడానికి ఎవరు ముందుకు వస్తారు అని ప్రశ్నించేవాడు.
రాజా భీమ్ దేవ్ వ్యూహానికి మద్దతుగా ముందుకు వచ్చిన సైనికుడికి ఒక పళ్ళెంలో తాంబూలంతో పాటు ధనం కూడా పెట్టేవాడు. అంటే సుపారీ [ఆకులు, వక్కలు] ని స్వీకరించిన వారు రాజా భీమ్ దేవ్ చెప్పిన వ్యక్తిని చంపి రావాలి. అలా సుపారీని స్వీకరించిన వారు రాజా భీమ్ దేవ్ చెప్పిన ఖిల్జీ సైన్యంలోని ముఖ్యులని చంపి వెనక్కి వచ్చిన వస్తే మళ్ళీ తగినంత డబ్బుని ఇచ్చి సత్కరించేవాడు రాజా భీమ్ దేవ్. ఇలా సుపారీ అనే పదం కాంట్రాక్ట్ కిల్లింగ్ కోసం ఒక రహస్య కోడ్ గా వాడకంలోకి వచ్చింది అప్పట్లో.
ఈ సుపారీని రాజా భీమ్ దేవ్ ఎలా వాడేవాడో ప్రజలు కధలు కధలుగా చెప్పుకునే వారు. అలా సుపారీ పదం మెల్లగా ముంబై అండర్ వరల్డ్ మాఫియాకి రహస్య కోడ్ గా 6 దశాబ్దాల పాటు చెలామణి అయ్యింది. అఫ్ కోర్స్ మెల్లగా పోలీసుల వల్ల సుపారీ అంటే ఏమిటో సామాన్య ప్రజలకి కూడా తెలిసిపోయింది అనుకోండి ఇప్పుడు. ప్రస్తుతం మహీం గా ముంబై లోని ఒక ప్రాంతాన్ని పిలుస్తున్నారు కానీ 13 వ శతాబ్దపు కోట ఆనవాళ్ళు ఏవీ లేవు ఇప్పుడు. కానీ సుపారీ అనే పదం ఇంకా సజీవంగా ఉంది.
సుపారీని ఆఫర్ చేసేటప్పుడు రాజా భీమ్ దేవ్ విందు భోజనం పెట్టేవాడు తన ముఖ్యమయిన అనుచరులకి. భోజనం అయిన తరువాత ఎవరు సుపారీ తీసుకుంటారో అతను తనకి ఇచ్చిన పని పూర్తి చేసుకొని వచ్చిన తరువాత మళ్ళీ విందు భోజనం పెట్టి డబ్బు ఇచ్చేవాడు. ఇప్పుడు ఒకేసారి డబ్బు ఇస్తారు సుపారీ తీసుకున్న వాళ్ళకి.. కానీ భోజనాలు లాంటి సాంప్రదాయం మాత్రం లేదు. ఈ సుపారీ పదం అప్పట్లో ఎడారి దొంగలుగా బ్రతికే దుబాయిలోని దేశ దిమ్మరులకి కూడా పాకిపోయింది.. దాంతో దుబాయి నుండి వచ్చి సుపారీ తీసుకుని హత్యలు చేసేవాళ్ళు. అందుకే సుపారీ అనే పదం ఇప్పటికీ దుబాయిలో వాడకంలో ఉంది…
Share this Article