ఎవరో మిత్రుడు ఫేస్బుక్లో కామెంటినట్టుగానే… ‘‘ఈ కాంగ్రెసోళ్లు తెలంగాణ ఇవ్వడానికి పెద్ద టైం తీసుకోలేదు కానీ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడి ఎంపికకు మాత్రం తరాలు మారేట్టుంది…’’ వ్యంగ్యంగా చెప్పినా సరే, అందులో చాలా నిజం ఉంది… ఎన్నేళ్లయింది టీపీసీసీ అధ్యక్షుడిని మార్చాలని అనుకుని..! నన్ను తక్షణం తీసేసి, ఎవరో కొత్తాయనకు బాధ్యతలు ఇవ్వండి బాబోయ్ అని ఉత్తమకుమారుడే ఢిల్లీలో ఎఐసీసీ ఆఫీసు ఎదుట దీక్ష చేయడం బెటర్ అని జోకులు వినిపించే స్థాయిలో… కథ సాగుతూనే ఉంది… కర్రవిరగదు-పాముచావదు… ఊదుకాలదు-పీరులేవదు… వంటి ఎన్ని సామెతలైనా చెప్పుకొండి…
ఒక్కో ఎన్నిక వస్తూనే ఉంటుంది… టీఆర్ఎస్ దెబ్బకొడుతూనే ఉంటుంది… కానీ కొత్త నేత రాడు, కొత్త జోష్ రాదు, కేడర్ కదలదు, నానాటికీ నీరసం… పనిచేసే కేడర్ ఉన్నా సరే, నాలుగు ఊళ్లు తిరిగేవాడేడీ..? సమస్య వస్తే చాలు, వాలిపోయే నాయకుడేడీ..? చివరకు ఈరోజుకూ అంతే… ఐనా, అక్కడ ఢిల్లీలోనే దిక్కులేదు, ఈ గల్లీని ఎవడు పట్టించుకున్నాడు అంటారా..? అదీ నిజమే…
Ads
ఎటొచ్చీ, అదుగో అయిపోయింది అంటారు, ఇదుగో రేపే ప్రకటన అన్నంత బిల్డప్పు ఇస్తారు… జస్ట్, ట్రెడ్మిల్ మీద పరుగు… ఆయాసం తప్ప అడుగు ముందుకు పడేది ఉండదు… ఇప్పుడు జానారెడ్డి ఓ లేఖ రాశాడు, సాగర్‌లో ఉపఎన్నిక అయిపోయేవరకు పీసీసీ చీఫ్ ప్రకటించవద్దట… ప్రకటిస్తే పార్టీలో తలెత్తబోయే విభేదాల ప్రభావం సాగర్ మీద పడుతుందని తన ఆందోళన… తను అక్కడ కాంగ్రెస్ కేండిడేట్ కాబట్టి ఆయన కోరికలో లాజిక్ ఉంది, న్యాయం ఉంది కానీ..?
పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించగానే ఒక ఉపఎన్నికను కూడా ప్రభావితం చేసే స్థాయిలో పార్టీలో చీలికలు, విభేదాలు తలెత్తుతాయని జానారెడ్డి అభిప్రాయపడుతున్నాడా..? పార్టీలో తగాదాలు వస్తుంటయ్, పోతుంటయ్… ఇలా టీపీసీసీ ప్రకటించగానే అలా విరిగిపోయేంత పెళుసుగా ఉందా పార్టీ..? అయినా ఒకప్పుడు నేను నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లకపోయినా జనం గెలిపిస్తారు అని కాలరెగరేసిన జానారెడ్డేనా ఈయన..? మొన్నటి ఓటమితో తత్వం బోధపడిందా..? లేక ఈసారి బీజేపీ యాదవుడిని నిలబెట్టి ఢీఅంటేఢీ అంటూ మంచి బలమైన పోటీ ఇవ్వబోతున్నదని కంగారా..?
అవునూ, సాగర్ ఉపఎన్నిక మీద సోయితో టీపీసీసీ ప్రకటన ఆపేశారని అనుకుందాం… ఎలాగూ జీవన్‌రెడ్డి అంటున్నారుగా… రేవంతుడు కూడా మానసికంగా ప్రిపేరయ్యాడు కదా… కోమటిరెడ్డి ఏం చేస్తాడనేది వదిలేస్తే… జీవన్‌రెడ్డి పట్ల పెద్ద వ్యతిరేకత ఏమీ ఉండదు… మరెందుకు ఈ ఆందోళన మాస్టారూ..? సరే, ఇది ఆపుదాం, రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు… తరువాత ఖమ్మం, వరంగల్ గట్రా మున్సిపల్ ఎన్నికలు… ఎన్నాళ్లు వాయిదాలు వేస్తూ పోతారు..? ఏమో, ఈలోపు ఏ వేములవాడ ఎమ్మెల్యే సీటు ఉపఎన్నిక కూడా రావచ్చునేమో… రేప్పొద్దున అందరూ టీపీసీసీ కాస్త ఆపండి మహాప్రభో అని అడుగుతుంటే… అప్పుడేం చేయాలబ్బా…! పోనీ, ఇంకెవరో సీనియర్ కల్పించుకుని, ఎఐసీసీ అధ్యక్ష పదవి అటోఇటో తేలిపోయేదాకా టీపీసీసీ ఆపాలనే కొత్త పాయింట్ తెర మీదకు తీసుకొస్తే..? అప్పుడిక… చచ్చింది గొర్రె…. అదెప్పుడు తేలాలి..?!
Share this Article