గూగుల్ సెర్చ్ ఇంజిన్ లేకపోతే ఎన్ని బతుకు ఇంజిన్లు ఆగిపోయేవో? గుండు సూది నుండి అణుబాంబుల తయారీ వరకు ఏదడిగినా తడబడకుండా, సిగ్గులేకుండా టక్కుమని చెబుతుంది గూగుల్. సమాచార సముద్రాన్ని కొన్ని లక్షల, కోట్ల పేజీల్లో డేటాగా ఎక్కించి గూగుల్ సమాచార గుత్తాధిపత్యాన్ని సాధించింది. గూగుల్ లో లేనిదాన్ని ఇప్పుడు ప్రపంచం ఒప్పుకోని పరిస్థితి వచ్చేసింది.
సాంకేతిక పరిజ్ఞానం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించే కొద్దీ అధునాతన ఆవిష్కరణలు, సరికొత్త పరికరాలు రావడం సహజం. అలా గూగుల్ గూట్లోనే పుట్టినది అలెక్సా. గూగుల్ లో లిఖిత రూపంలో ఉన్న సమస్త సమాచారాన్ని శబ్ద రూపంలో ఆడియో ఫైళ్లుగా రికార్డు చేసి పెట్టారు. చిన్న సౌండ్ బాక్స్ ఒకటి ఉంటుంది. దాన్ని పవర్ కేబుల్ తో ఆన్ చేసి, నెట్ తో కనెక్ట్ చేసి పెడితే చాలు. మనం నోటితో అడిగే ప్రశ్నలకు- అది ఆడియో రూపంలో సమాధానమిస్తూ ఉంటుంది.
Ads
అలెక్సా! దో యామ్ నాట్ బ్లైండ్, ఐ కాంట్ సీ క్యాలెండర్. వాట్ ఈజ్ టుడే? అని మనం అడగ్గానే- ఒరేయ్ గుడ్డోడా! టుడే ఈజ్ మండే అని ఖచ్చితంగా జవాబు చెబుతుంది…….. అలెక్సా! ప్లే కెవ్వు కేక తెలుగు సాంగ్ అనగానే దానిదగ్గర ఉంటే కెవ్వు కేకుతుంది. లేకపోతే ఐ యామ్ సారి. ఐ డోంట్ హ్యావ్ దట్ పరమ పవిత్ర గీతం- అని బదులు చెబుతుంది…
గూగుల్లోకి వెళ్లి టైప్ చేసి విషయాన్ని వెదికే బదులు నోటితో అడిగితే అలెక్సా నోటితోనే చెబుతుంది. సాంకేతికంగా ఇందులో ఉన్న సౌలభ్యాన్ని కాదనడానికి వీల్లేదు. అయితే జనం చదవడం, రాయడం మానేయడం వల్ల విషయం జ్ఞాపకంలో ఉండడం లేదని పాతతరం గుండెలు బాదుకుంటోంది. ఇలాంటి యంత్రాలు మరింత పెరిగితే వినడం, చూడ్డం తప్ప జనం చదవరేమో అని కొందరి భయం. ఏ సాంకేతిక నూత్న ఆవిష్కరణకయినా మంచి చెడు రెండూ ఉంటాయి. దాన్ని మనం ఏ ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటున్నామన్నదే లెక్క.
ఇండియాలో ఇన్నాళ్లుగా అలెక్సా ఇంగ్లీషు, హిందీ భాషల్లో మాత్రమే మాట్లాడగలిగేది. ఇకపై తెలుగులో కూడా అలెక్సా చిలుక పలుకులు వినవచ్చు. హైదరాబాద్ ఐ ఐ టీ లో కేంద్రప్రభుత్వ సాయంతో ఈ ప్రాజెక్టు మొదలయ్యింది. తెలుగు శబ్ద రూప సమాచారాన్ని తయారు చేసి గూగుల్ వారి అలెక్సాకు ఇస్తారా? లేక అలెక్సాలా విడిగా ఇదొక పరికరమా? అన్నది స్పష్టత రావాల్సి ఉంది.
ఇప్పటికీ మీరు గూగుల్ అనువాదంలో
ఈత చెట్టు
ఈత పళ్లు అని కొట్టి చూడండి.
వెంటనే
Swimming tree
Swimming teeth
అనే వస్తుంది. కదల్లేని వేళ్లతో ఈత చెట్టు లోలోపల పడ్డ బాధను గూగుల్ అర్థం చేసుకుంది. ఈత చెట్టు నడిచి వెళ్లి ఈత కొలనులో స్నానమాడి మళ్లీ వచ్చి స్విమ్మింగ్ ట్రీగా యథా స్థానంలో నిలుచుని స్విమ్మింగ్ టీత్ తో పళ్లికిలించే వెసులుబాటు గూగుల్ కలిగిస్తే పడితే మనం గర్వపడాలి కానీ- బాధ పడ్డం వల్ల ప్రయోజనం లేదు.
రేప్పొద్దున అచ్చ తెలుగు అలెక్సా ఎన్ని ఈత చెట్లను ఈత కొట్టిస్తుందో? అలెక్సా చెప్పేదే అచ్చ తెలుగుగా మారి- ఎందరు ఈత చెట్లెక్కి దూడకు గడ్డి వెతుకుతున్నామని గుడ్డిగా మాట్లాడతారో?
తెలుగు అలెక్సాకు ఏ మాండలికం ప్రధానం అన్నది పెద్ద భాషాపరమయిన చిక్కు. బహుశా షరా మామూలుగా మీడియా తయారు చేసిన ఎవరూ మాట్లాడని ప్రామాణిక తెలుగు భాషనే అలెక్సాకు కూడా ప్రాతిపదికగా తీసుకుంటారేమో! ఆ తేనె తుట్టెను ఇప్పుడెందుకు కెలకడం? ఎక్కడో కారు చీకట్లో కాంతి రేఖలా- ఏదో ఒకనాడు తెలుగు అలెక్సా మన తెలుగు ఉచ్చారణలో తెలుగుతనం లేదు అని సరిగ్గా, స్పష్టంగా మాట్లాడితేనే సమాధానం చెబుతాను అని ఎదురుతిరిగే రోజు వస్తుందేమో అని…అలాంటి రోజు రావాలని కోరుకుంటూ తెలుగు అలెక్సాకు స్వాగతం చెబుదాం…… By………. పమిడికాల్వ మధుసూదన్
Share this Article