వరల్డ్ హేపీనెస్ రిపోర్ట్ … ప్రతి సంవత్సరం ఈ నివేదిక విడుదలవుతూ ఉంటుంది… ప్రజలు ఏ దేశంలో ఎక్కువ ఆనందంగా ఉన్నారో ర్యాంకులు ఇస్తుంది… దానికి రకరకాల ప్రాతిపదికలు గట్రా ఉంటయ్… అఫ్‌కోర్స్, చాలామంది ఈ రిపోర్టును లైట్ తీసుకుంటారు, అది వేరే సంగతి… సరే, ఆ ర్యాంకుల ప్రామాణికాలన్నీ కరెక్టే అనుకుందాం… వరుసగా అయిదోసారి ఫిన్లాండ్ దేశం ఈ హేపీనెస్ ఇండెక్స్‌లో ప్రథమ స్థానంలో నిలిచింది…
నిజానికి ప్రపంచంలోకెల్లా ఆనందంగా ఉండే దేశం భూటాన్… ఆ దేశం జీడీపీ లెక్కల్లో కాదు, ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారనే లెక్కలతో తన పాలనను సమీక్షించుకుంటుంది… ప్రజలు కూడా అంతే… సంపద పోగేసుకోవడం కాదు, ఎంత ఆనందంగా బతికామనేదే వాళ్లకు ముఖ్యం… కానీ ఆ దేశం పేరు టాప్ ఫైవ్ జాబితాలో కూడా ఎందుకు కనిపించదో అర్థం కాదు…
2022 రిపోర్ట్ కోసం 156 దేశాల ప్రజలకు ఓ ప్రశ్న సంధించింది ఆ రిపోర్ట్… మీకు మీరే మార్కులను వేసుకొండి… వరస్ట్ అయితే 0, టాప్ అయితే 10… ఇలాగన్నమాట… అవినీతి స్థాయి, సగటు ఆయుప్రమాణం, సామాాజిక మద్దతు వంటివి కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది… ఎందుకు ఫిన్‌లాండ్ స్వర్గం..? ప్రజలు ఎందుకు ఆనందంగా ఉన్నారు..? 83 ఏళ్ల సగటు ఆయుప్రమాణం ఉన్న ఆ దేశంలో నిజమైన ఆనందం ఎక్కడుంది..?
Ads
ఫిలాసఫర్, రీసెర్చ్ స్కాలర్, ఆల్టో యూనివర్శిటీ లెక్చరర్ Frank Martela, తమ ఆనందానికి కారణాల్లో… తప్పక పాటించే మూడు అంశాల్ని కాదు, అసలు పట్టించుకోనివి, చేయనివి ఏమిటో తన విశ్లేషణలో ఇలా చెప్పుకొచ్చాడు… ఇంట్రస్టింగ్… ‘‘Kell’ onni on, se onnen kätkeköön… ఫినిష్ ప్రముఖ కవి రాసిన ఈ వాక్యం రఫ్ అనువాదం ఏమిటంటే… నీ జీవితాన్ని, నీ ఆనందాన్ని ఏ పరిస్థితిలోనూ చుట్టుపక్కల వాళ్లతో, తోటి ఉద్యోగులతో పోల్చుకోవద్దు అనేది ఫస్ట్ పాయింట్… అందులోనే సంపద ప్రదర్శన కూడా అవసరం లేదంటాడు ఫ్రాంక్…
చేస్తున్న పనిని ఆస్వాదించడం కూడా ఒకటి… నేను ఓసారి ఫిన్‌లాండ్‌లోకెల్లా సంపన్నుడిని చూశాను… తను బిడ్డను స్ట్రోలర్‌లో ట్రామ్ స్టేషన్ వైపు తీసుకుపోతున్నాడు… తన స్థాయికి మంచి లగ్జరీ కాదు, డ్రైవర్ పెట్టుకోలేకకాదు… తను ప్రజారవాణానే విశ్వసిస్తాడు, ఆశ్రయిస్తాడు… అందులో ఆయనకు ఆనందం ఉంది… అందుకే విజయం, సంపద, హోదాల్ని కాదు… నిన్ను ఆనందంగా ఉంచే అంశాలేమిటో తెలుసుకుని, వాటికే ప్రాధాన్యం ఇవ్వాలని అర్థం…
నా రీసెర్చ్‌లో నేను గమనించిన మరో అంశం… విశ్వసనీయత, వ్యక్తిగత నిజాయితీ, విలువలు… మేం “lost wallet” experiment in 2022 పేరిట మా దేశప్రజలకే ఓ పరీక్ష పెట్టాం… ప్రపంచంలోని 16 నగరాల్లో 192 పర్సులను వేర్వేరు ప్రాంతాల్లో వదిలేసి వచ్చాం… మా రాజధాని హెల్సింకిలో 12 పర్సులకు గాను 11 పర్సుల్ని వెతికి మరీ వాపస్ చేశారు… నిజాయితీకి ఫిన్‌లాండ్ ప్రజలు ఇచ్చే ప్రాముఖ్యత అది… మీరు లైబ్రరీలో ల్యాప్‌టాప్, ట్రెయిన్‌లో మొబైల్ ఫోన్ మరిచిపోయారా…? ఆందోళన అక్కర్లేదు, అవే మీ ఇంటికి నడిచొస్తాయి… సో, ఆనందం సంపదలో లేదు, ప్రభుత్వ సౌకర్యాల్లో లేదు, ఈ నిజాయితీలో ఉంది… దాన్ని నమ్మి పాటించే వ్యక్తిగత జీవనశైలిలో ఉంది…’’
Share this Article