చెంఘిజ్‌ఖాన్… నా జీవితాశయం ఈ సినిమా అంటున్నాడు బాలయ్య… అంటే చెంఘిజ్‌ఖాన్ బయోపిక్… బాలయ్య ప్రకటన వచ్చిందో రాలేదో అందరూ నెట్‌లో ఎవరీ చెంఘిజ్ అని సెర్చింగ్ మొదలుపెట్టారు… నెట్‌లో కూడా సరిపడా సమాచారం ఉండదు… తనపై ఉన్న సమాచారంలో కల్పితం ఎంతో, నిజం ఎంతో ఎవరికీ తెలియదు… సో, బాలయ్య తన ఇమేజీకి తగినట్టు ఇష్టారీతిలో ‘క్రియేటివ్ ఫ్రీడం’ తీసుకోవచ్చు… ఆ సినిమాకు గనుక రాజమౌళి దర్శకుడైతే ఆ కథను రక్తికట్టించగలడు… అవసరమైతే ఆ చరిత్ర, ఆ సమాచారాన్నే పూర్తిగా మార్చిపారేయగలడు… ఆర్ఆర్ఆర్ తరహాలో ఒక పాన్ వరల్డ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలడు…
బోయపాటి వంటి దర్శకులు దీనికి సూట్ కారు… ఇందులో కూడా బాలయ్య పెద్ద గన్ను పట్టుకుని తిరుగుతాడా..? బ్లడ్డు, బ్రీడు అనే సోది, స్తుతి డైలాగులు చెబుతాడా..? జగన్ మీద పంచ్ డైలాగులుంటాయా..? వంటి చర్చను వదిలేస్తే… బాలయ్య నిజంగా కష్టపడితే ఈ పాత్రకు సూటవుతాడు… కాకపోతే తన లుక్కుతో వస్తుంది సమస్య… అచ్చం ఫోటోల్లో ఉన్న చెంఘిజ్ పోలికలతో మేకప్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు, చేయొచ్చు… అలా చేస్తే తను బాలకృష్ణ కాదని ప్రేక్షకులు భ్రమిస్తే, ఇక బాలయ్యే ఆ సినిమా చేయడం దేనికి..? ఎవరినైనా పెట్టుకోవచ్చు… అలాగని బాలయ్య సొంత రూపంతో ఇతనే చెంఘిజ్ అని చెబితే ప్రేక్షకులు నవ్వుతారు…
సో, అఘోరాను ఇష్టారీతిలో చూపించినట్టు ఇందులోనూ ఓ హైబ్రిడ్ వేషం కట్టాలి తను… ఇక తీసేసి చెంఘిజ్ చరిత్ర కాబట్టి… నరుకుడే నరుకుడు… అఖండకు తాత చెంఘిజ్… తెర మీద నెత్తురు పారుతూనే ఉంటుంది… బాలయ్యకు ఇంతకుమించి కావల్సిందేముంది అంటారా..? ఉంది… ఓ లవర్ కావాలి, ఓ విలన్ కావాలి… చెంఘిజ్ చరిత్రేమో డిఫరెంట్… ఈ తొక్కలో ప్రేమలు, దోమలు జాన్తా నై… ఏదైనా రాజ్యం మీద దాడి చేసి కొల్లగొడితే ఆ తెగ నాయకుడి భార్య, బిడ్డలను తెచ్చి తన గుడారంలో కట్టేసి, వాడుకోవడం మాత్రమే తెలుసు తనకు… ఎందరిని అలా కట్టుకున్నాడో ఎవరికీ సంఖ్య తెలియదు…
Ads
విలన్ కూడా ఉండడు… తనకు తానే సవాల్ విసురుకుంటాడు… ఓ బానిస కొడుకు విశ్వాన్ని జయించాలని కలగంటాడు… ఆ కల నెరవేరడానికి అత్యంత క్రూరంగా వ్యవహరిస్తాడు… ఏదైనా రాజ్యం మీద దాడి జరిగిందంటే చాలు, తన సైనికులు ఆ ఇళ్లను దోచుకుంటారు, కాలబెడతారు, ఆడవాళ్లను ఎత్తుకుపోతారు… పిశాచాల దాడి తరహాలో ఉంటుంది… చెంఘిజ్ అంటేనే సంపూర్ణ విలనత్వం… నిజానికి తన విజయాల్లో అధికశాతం తనంటే భయాన్ని క్రియేట్ చేయడం వల్ల దక్కినవే… చెంఘిజ్ పిశాచసైన్యం వస్తుందంటే చాలు ఇతర రాజ్యాల అధినేతలకు పారిపోవడమే దిక్కు… భయమే వాళ్లను తరుముతుంది…
ఇదుగో ఇంతటి ప్రతికూల ఛాయలున్న పాత్రను బాలయ్య నిజంగా పోషిస్తాడా..? సాహసిస్తాడా..? లేక అదే రాజమౌళి తండ్రితో కథను మొత్తం తిరగరాయించేసి, చెంఘిజ్‌ను హీరోగా చిత్రీకరిస్తారా..? మంగోలియా ప్రాంతం అంటేనే భిన్నమైన జీవనపరిస్థితులు ఉంటయ్… సైబీరియా మంచు ఎడారులు… అత్యంత శీతలం లేదంటే అత్యంత ఉష్ణం… అక్కడ పుట్టిన వారి జన్యునిర్మాణమే వారికి రక్ష… వాళ్లకు తోడు వాళ్ల గుర్రాలు… అవన్నీ ఆసక్తికరంగా తీయగలిగితే నిజంగానే సూపర్ సినిమా అవుతుంది… కాకపోతే తెలుగు సినిమా అవలక్షణాల్ని వదిలేయాలి…
ఇలాంటి సినిమాలకు తీయడానికి సాహసం కావాలి… ఆత్మవిశ్వాసం కావాలి… ఫలితం ఎలా వచ్చినా తట్టుకునే కెపాసిటీ ఉండాలి, రెడీగా ఉండాలి… జేమ్స్ కామెరూన్ వంటి దర్శకులు ఆ కలలు గంటారు, నిజం చేసి చూపిస్తారు… తెలుగులో అలాంటి నిర్మాత దొరకొచ్చుగాక… కానీ దర్శకుడు..? రాజమౌళికి మహేశ్ బాబు సినిమా పూర్తిచేయడానికి నాలుగేళ్లు పట్టొచ్చు… ఈలోపు బాలయ్యలో మరింత ముసలితనం… ఒక్కటే మార్గం… ఘాజి తీసిన సంకల్ప్, శాతకర్ణి తీసిన క్రిష్ తదితరులతో ధైర్యం చేయాలి… వాళ్లు చేయగలరు… ఎటొచ్చీ బాలయ్య మార్క్ ఇమేజీ ఓ పాన్ వరల్డ్ సినిమాకు అడ్డు..!!
Share this Article