కన్నడిగుల భాషాభిమానం శృతిమించుతోంది… అది ఇతరుల పట్ల ద్వేషంగా మారుతోంది… మన తెలుగువాళ్లు నిజంగా అభినందనీయులు… కన్నడ స్టార్ పునీత్ రాజకుమార్ మరణిస్తే అందరిలాగే కన్నీరు పెట్టుకుంది… ఒక కేజీఎఫ్ సినిమాను సూపర్ హిట్ చేసింది… ఒక కాంతార సినిమాను నెత్తిన పెట్టుకుంది… కన్నడాన్ని మన సౌతే అని అలుముకున్నదే తప్ప విడిగా చూడలేదు… అది తెలుగువాడి సహృదయం… కానీ సినిమాలకు సంబంధించి కన్నడిగుల నుంచి ఈ వైఖరి కరువైంది దేనికి..?
తాజాగా ప్రశాంత్ నీల్‌పై పడ్డారు కన్నడ ట్రోలర్లు… ఏదో ఒక సాకుతో వెక్కిరించడం, విమర్శించడం… అంతకుముందు ఇదంతా లేదు… కేజీఎఫ్2 సక్సెస్ తరువాత ప్రశాంత్ ప్రభాస్‌తో సాలార్ తీస్తున్నాడు… అది మధ్యలో ఉంది… తరువాత సినిమా జూనియర్ ఎన్టీయార్‌తో ఉంది… అదీ ప్రకటించారు… తెలుగు ఇండస్ట్రీవైపు మళ్లుతున్నాడని తనపై ఓ ప్రకటించబడని అక్కసు… పైగా ప్రశాంత్ ప్యూర్ తెలుగువాడు… మాజీ మంత్రి రఘువీరారెడ్డి కుటుంబీకుడు… తన పేరులోని నీల్ అనే పదానికి అర్థం వాళ్ల స్వగ్రామం నీలకంఠాపురం అనే…
ఇవన్నీ ప్రశాంత్‌పై కోపానికి, ద్వేషానికి కారణమవుతున్నాయి… మొన్నటికిమొన్న కేజీఎఫ్ హీరో బర్త్‌డేకు ప్రశాంత్ విషెస్ చెప్పాడు… అది సరిపోదా..? సరిపోదట, ఏదో ఒకటి చెబుతూ ప్రశాంత్‌ను ట్రోల్ చేస్తున్నారు… కన్నడిగులు మరీ ఇలా తయారయ్యారేమిటి అనుకుని ప్రశాంత్ ప్రస్తుతం తన సోషల్ మీడియా ఖాతాలన్నీ రద్దు చేసుకున్నాడు… మీడియాలో, సోషల్ మీడియాలో ఏమైనా రాసుకొండి… దట్సాల్…
Ads
సాలార్ సినిమా తీసేది కూడా కేజీఎఫ్, కాంతార సినిమా తీసిన హొంబలె ఫిలిమ్స్ వాళ్లే… తాజాగా మలయాళంలో కూడా తీయబోతున్నారు… త్వరలో తమిళంలో కూడా తీస్తామని, మొత్తం 3 వేల కోట్ల మేరకు పెట్టుబడి పెడతామని ప్రకటించింది సంస్థ… కన్నడిగుల్లాగే ఆలోచిస్తే ఇక టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ కూడా హొంబలె నిర్మాత మీద పడి ఏడవాలా..? ట్రోల్ చేయాలా..? ఇది వ్యాపారంరా నాయనా..? అంతకుమించి ఆలోచించకండి… దిల్ రాజు తమిళంలో సినిమా తీయలేదా..? ఒక భాష హీరో సినిమాను మరో భాష వాళ్లు చూడటం లేదా..?
నిజానికి రష్మిక మంథాన దగ్గర స్టార్టయింది ఈ పైత్యం… నిజానికి ఆమెకు ఉన్న గొడవ తన బ్రేకప్ లవర్ రక్షిత్ శెట్టి మీద కోపం… ఆ ఫ్రెండ్స్ బ్యాచ్ మీద కోపం… అందుకే రిషబ్ శెట్టిని గోకుతూ ఉంటుంది… రిషబ్ ఆమెను ఉల్టా గోకుతాడు… అదంతే… దానికి ఆమెను కన్నడ వ్యతిరేకిగా ముద్ర వేసి రచ్చ చేస్తున్నారు కన్నడ ట్రోలర్లు… ఆమెకు కన్నడంకన్నా తెలుగు, తమిళం, హిందీ ఎక్కువైపోయాయి అని విమర్శ… సో వాట్..? వేరే భాష సినిమాలు చేస్తే తప్పేమిటట..?! అది ఆమె వృత్తి… పోనీ, మీ హీరోల సినిమాల్ని వేరే భాషల ప్రేక్షకులు చూడనక్కర్లేదా..? ఈ నాన్సెన్స్ పట్టించుకోవడం దేనికని ఇక తెలుగు లింక్స్ ఉన్న సెలబ్రిటీలందరూ ఇక తమ సోషల్ మీడియా ఖాతాల్ని రద్దు చేసుకుని, పే-ద్ద దండం పెట్టేయడమేనా..? ఇదెక్కడి సోషల్ ద్వేషంరా నాయనా..?!
Share this Article