అసలే కరోనా కాలం! వంద వద్దులే! యాభై కోట్లివ్వు చాలు!
ఎంత చెట్టుకు అంత గాలి. పిండి కొద్దీ రొట్టె లాంటి సామెతలకు కరోనా టైమ్ లో బాగా పాపులారిటీ వస్తోంది. డబ్బున్నవారి కష్టాలు డబ్బున్నవారికే తెలుస్తాయి. వారు నాలుగు కోట్ల బెంట్లీ కారులో తిరుగుతుంటారు కానీ- ఆ నెల ఆ కారు నడిపే డ్రైవర్ కు జీతమివ్వడానికి ఆ కారులోనే వెళ్లి అప్పు అడగాల్సిన పరిస్థితి రావచ్చు. శిఖరం అంచు దాకా వెళ్లడం కష్టం. అక్కడే స్థిరంగా ఉండడం ఇంకా కష్టం. చాలాసార్లు సంపన్నుల వైభోగం ఇలాగే ఉంటుంది. డ్రైవర్లు, పనిమనుషులు, వంట మనుషులు, తోటమాలులు, ఫామ్ హౌస్ లు, గెస్ట్ హౌస్ లు, వీకెండ్ హోమ్ లు, హిల్ స్టే లు, విదేశాల్లో ఇళ్లు, సొంత విమానాలు, నౌకలు… ఇలా ఒక రాష్ట్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ తో సమానంగా ఒక అత్యంత సంపన్నుడి ఆదాయ వ్యయాలు ఉంటాయి. కొందరి విషయాల్లో కొన్ని దేశాల బడ్జెట్ కంటే ఎక్కువ కూడా ఉంటుంది.
అలాంటి అతి సంపన్నుల ఇంద్రభవనంలో ఒక దుర్ముహూర్తాన భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే లోకం తలకిందులయిపోతుంది. పూరి గుడిసెలో ఆలుమగలు కొట్టుకుని, తిట్టుకుని రాత్ గయి బాత్ గయి అనుకుని మరుసటి రోజు ఉదయాన్నే ఏమీ జరగనట్లు అన్యోన్యంగా బతికేస్తుంటారు. ఇంద్రభవనంలో అలా కుదరదు. ఇరు పక్షాల లాయర్లు పొద్దున్నే డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ తింటూ వాదనలు మొదలు పెట్టాలి. నోటీసులు, ఫ్యామిలీ కోర్టులు, సివిల్ కోర్టులు, హై కోర్టు, సుప్రీం కోర్టు, అంతర్జాతీయ కోర్టు, అంతరిక్షం కోర్టు…ఎంతదాకా అయినా పోరాడుతూనే ఉండాలి. అమెరికాలో అమెజాన్ వ్యవస్థాపకుడు భార్యకు విడాకుల సెటిల్ మెంట్ చెల్లించగా- అందులో నుండి ఆమె అక్షరాలా ఇరవై అయిదు వేల కోట్ల రూపాయలు దానధర్మాలు చేసింది. ఇటీవలి కాలంలో అత్యంత విలువయిన విడాకులుగా ఇది చరిత్ర పుటల్లో సువర్ణాక్షర లిఖితమయ్యింది.
Ads
భారత దేశంలో కూడా సంపన్నుల విడాకుల కేసులు ఇలాగే ఉన్నాయి. ఒన్ టైమ్ సెటిల్ మెంట్ కింద యాభై కోట్లు, వంద కోట్లు, అయిదు వందల కోట్లు విడాకులప్పుడు భార్యకు ఇవ్వాల్సిన కేసులున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులు తలకిందులు కావడంతో- భర్తల నుండి విడాకులు కోరుకుంటున్న భార్యలు రెండు మూడు మెట్లు కిందికి దిగి తక్కువ పరిహారానికి ఒప్పుకుంటున్నట్లు ఎకనమిక్ టైమ్స్ లోతయిన విశ్లేషణతో ఒక వార్తను ప్రచురించింది. నెల నెలా ఇవ్వాల్సిన భరణంలో కూడా తగ్గింపుకు సిద్దమట. కోర్టు బయట ఎంతో కొంత తీసుకుని మాజీ భర్తలను పెద్ద మనసుతో క్షమించి వదిలేద్దామని మాజీ భార్యలు ముందుకొస్తున్నారట. “ఉప్పెన ముంచెత్తితే ఊరంతా కొట్టుకు పోతుంది. కానీ ఉప్పెనతో వచ్చిన ఒండ్రు మట్టితో పొలంలో బంగారం పండుతుంది” అని ప్రఖ్యాత కథా రచయిత శంకరమంచి అమరావతి కథల్లో అంటాడు. కొన్ని ఉపద్రవాలతో ఉపయోగాలు కూడా ఉంటాయని విడాకుల కేసుల్లో నిత్యం బిజీగా ఉండే అత్యంత సంపన్నులు ఇప్పుడు స్వగతంలో అనుకుంటున్నారు!…… By…. – పమిడికాల్వ మధుసూదన్
Share this Article