అదే బాలయ్య, నరుకుడు, తురుముడు, నెత్తురు, కత్తులు, సీమ ఫ్యాక్షన్… అదే చిరంజీవి స్టెప్పులు, పాటలు, ఇమేజీ బిల్డప్పులు, మాఫియాతో పోరాటాలు, తుపాకులు…. ఎవరి ఇమేజీ బందిఖానా వాళ్లది… వాళ్లు బయటికి రాలేరు… ఫ్యాన్స్ రానివ్వరు… బిజినెస్ లెక్కలు అస్సలు కదలనివ్వవు… వాళ్లు ఏర్పాటు చేసుకున్న మార్కెట్‌లో వాళ్లే బందీలు… బాలయ్య కాస్త నయం, అఖండ, శాతకర్ణి వంటివి కనిపిస్తాయి… అవసరమైతే చెంగిజ్‌ఖాన్ కలగంటాడు… తీసినా తీస్తాడు… మొండి… చిరంజీవి దగ్గర ఆ ధైర్యమూ లేదు…
ఎవడో సల్మాన్ ఖాన్ రావాలి, టైమ్‌కు రవితేజ రంగంలోకి దిగాలి… లేదంటే కొడుకు రాంచరణ్ జతకలవాలి… అవే గెంతులు, అవే ఫైట్లు… మాస్ పేరిట అవే చొక్కాలు, లుంగీలు, బీడీలు… సీన్ కట్ చేస్తే పెద్ద పెద్ద మెషిన్ గన్లు, మలేసియా, సింగపూర్ దాకా వెళ్లి మరీ డిష్యూం డిష్యూంలు… అదేమంటే వింటేజీ చిరంజీవి… ఇదేం ముద్ర..? ఒక్క భిన్నమైన పాత్ర… ఇదీ అవర్ చిరంజీవి అనేలా తన రియల్ ఫ్యాన్ కాలర్ ఎత్తి చెప్పుకునే ఒక్క పాత్ర ఏది..? ఈ ఇమేజీ దాటి వేరే పాత్ర చేస్తే జనం చూడరని భయం… పోనీ, ఈ రొటీన్ లెక్కల ఆచార్య, గాడ్‌ఫాదర్ ఏమైనా చూశారా..? చిరంజీవికి ఇదొక సంధిదశ…
వాల్తేరు వీరయ్య ఒక రొటీన్ చిరంజీవి మార్క్ కమర్షియల్ సినిమా… అందులో మెరుపులేమీ లేవు… జస్ట్, డీఎస్పీ అరుపులు… ఫ్యాన్స్ కోరుకున్న చిరంజీవే కనిపిస్తాడు… నాలుగు సంక్రాంతి సినిమాల్లో బెటర్ రిజల్ట్, బెటర్ వసూళ్లు బహుశా వీరయ్యే కొల్లగొడతాడేమో… విజయ్, చిరంజీవి, బాలయ్య, అజిత్… ఎవరూ పాన్ స్టార్ కారు ఇప్పుడు… ఈ సినిమాలతో అస్సలు పాన్ ఇండియా స్టేటస్ రాదు… సో వాట్… రవితేజ ఉన్న నాలుగు సీన్లు జోష్‌తో ఉంటయ్… సినిమా తాలూకు ప్లస్‌ను, క్రెడిట్ ను రవితేజ ఎత్తుకుపోతాడు…
Ads
కేథరిన్, శృతిహాసన్ ఉన్నారంటే ఉన్నారు… ప్రకాష్‌రాజ్‌ను విలన్‌గా చూసీ చూసీ జనానికి బోర్ కొడుతోంది తప్ప దర్శకులకు కాదు… ఓ మత్స్యకారుడు, తనకు ఎవరూ లేరు, ఊరికీ మొనగాడు… ఓ టాస్క్ మీద మలేషియా వెళ్లిన వీరయ్య మైఖేల్ అనే గ్యాంగ్‌స్టర్‌తో తలపడతాడు… ఎందుకు అనేదే కథ… ఇక మాఫియా బాపతు పోరాటాలు, చివరకు ఎప్పటిలాగే హీరో కాలర్ ఎగరేస్తాడు… శుభం… బొచ్చెడు సినిమాల్లో చూసిందే కథ… సినిమా ఆరంభం నుంచీ ఎంటర్‌టెయిన్‌మెంట్ మీదే దృష్టి… చిన్న చిన్న జోకులు, వయస్సు రీత్యా చిన్న చిన్న స్టెప్పులు… పాతకాలం డ్రెస్సులు… ఎవరో కుర్ర హీరో బాపతు ట్రీట్‌మెంట్… చిరంజీవి సినిమాల ఖాతాలో మరొకటి… అంతే…
బాగానే ఉందా..? బాగోలేదా..? అనేది క్వశ్చన్ కాదు ఇక్కడ… దేనికది చూస్తే బాగానే ఉంది… డీఎస్పీ పాటలు బాగున్నయ్… శేఖర్ కొరియోగ్రఫీ బాగుంది… రవితేజ పాత్ర బాగుంది… శృతిహాసన్ అందంగా ఉంది… చిరంజీవి ఛలాకీగా ఉన్నాడు… కానీ కథేదీ… ప్రేక్షకుడు నిజంగా కనెక్టయ్యే కథనం ఏది..? పాత చొక్కాకు ఈ పూనకాల రంగుల అద్దకాలు మినహా ఎమోషన్‌తో అదరగొట్టిందెక్కడ..?
చివరగా ఒక్కమాట… ప్రేక్షకులు కోరుకున్నదే నేను ఇస్తున్నాను, ఇస్తాను అనేది చిరంజీవి పదే పదే చెప్పే డైలాగ్… ప్రేక్షకుడు అంటే తన దృష్టిలో ఫ్యాన్… ఆ పరిధి దాటి ఆలోచించిన రోజు చిరంజీవి తిరుగులేని రియల్ స్టార్ అవుతాడు… లేదంటే ఇదుగో ఇలా మరో దారినపోయే వీరయ్యలా మిగిలిపోతాడు..!! డబ్బులు, కలెక్షన్ల లెక్కల చట్రంలోనే ఉన్నన్నిరోజులూ ఇవే ‘పూనకాలు లోడింగ్’ బాపతు స్టెప్పులే… ఈ వయస్సులో కొత్త కథలు, కొత్త పాత్రలు, కొత్త స్టెప్పుల జాడేది..?! అన్నట్టు… కోర్టులో విలన్ తలనరికే ఆ సీన్‌ను ఎలా సమర్థించుకుంటావ్ చిరంజీవీ..?! దారుణం..!!
Share this Article