ఈ సినిమా గురించి నిజానికి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు… ఏదైనా ఓటీటీలోకి తోసిపారేస్తే అయిపోయేది… షార్ట్ ఫిలిమ్‌కు ఎక్కువ, ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిమ్‌కు తక్కువ… అయితే ఒక చాన్స్ మిస్ చేశాడు దర్శకుడు ఆళ్ల అనిల్ కుమార్… సంక్రాంతి సందర్భంలో సహజంగానే జనం వినోదం కోసం ఖర్చు పెడతారు, సినిమాలు చూస్తారు… ఫ్యామిలీ ప్రేక్షకులు కలిసి సినిమాలకు వెళ్లే సందర్భాల్లో ఇదీ ఒకటి… దీన్ని సొమ్ము చేసుకోవడానికి పెద్ద హీరోలు సంక్రాంతి బరిలో ఉండటానికే ప్రిఫరెన్స్ ఇస్తారు…
సినిమా ఎలా ఉన్నా సరే, కలెక్షన్లు మాత్రం ఈ మూడు రోజులూ బాగుంటాయి… అయితే పెద్ద హీరోల సినిమాలు బాగాలేనప్పుడు, టికెట్లు దొరకనప్పుడు… కాస్త ఫ్యామిలీతో చూసే మరో వినోదాత్మక సినిమా కనిపిస్తే, ఆ థియేటర్‌లో దూరిపోతుంటారు… అలా సొమ్ములు రాబట్టుకున్న సినిమాలు బోలెడు… చిన్న సినిమాలు అలా ప్లాన్ చేసుకుంటాయి… ఈసారి సంక్రాంతి బరిలో వారసుడిగా విజయ్, తెగింపుతో అజిత్, వీరసింహారెడ్డిగా బాలయ్య, వాల్తేరు వీరయ్యగా చిరంజీవి బరిలో దిగారు…
అందులో నాసిరకం, పరభాషా చిత్రాల కారణంగా విజయ్, అజిత్ ముందే తప్పుకున్నారు… మిగిలిన ఇద్దరూ బలంగానే పోటీపడ్డారు… కాకపోతే ఇద్దరికీ అవి మూస సినిమాలు… నరుకుడు భాషలో బాలయ్య, స్టెప్పుల భాషలో చిరంజీవి… కొత్త కథలు కావు, కొత్త కథనాలు కావు… జస్ట్, వాళ్ల ఫ్యాన్స్ కోణంలో తీయబడిన రొటీన్ ఫార్ములా సరుకు అది… పండుగ బరిలో చిరంజీవి కాస్త ముందంజలో ఉన్నా సరే, పాతతరం చిరంజీవి ఫ్యాన్స్ కూడా ఈ చిరంజీవి ఇక మారడు అని పెదవి విరిచే సినిమా…
Ads
సో, కల్యాణం కమనీయం అనే చిన్న సినిమాకు కాస్త చాన్స్ దొరికేది… ఏమాత్రం బాగున్నా..! కానీ ఆ చాన్స్ వేస్టయిపోయింది… సంతోష్ శోభన్ కాస్త నటన తెలిసిన మొహమే… హీరోయిన్ ప్రియా భవానీశంకర్ కూడా తేటగా కనిపించే మొహమే… ఉద్యోగం లేని భర్త, కొలువు చేసే భార్య అనేదీ మంచి ప్లాటే… సరిగ్గా అల్లుకుంటే మంచి కామెడీ సీన్లు పండే కథ… సరదాసరదాగా సంక్రాంతి ఫ్యామిలీ ప్రేక్షకుల ఆదరణ పొందే చాన్స్ ఉండేది… కానీ అయదారు మంచి సీన్లు రాసుకోలేక దర్శకుడు సినిమాను ఫ్లాప్ చేశాడు…
కల్యాణం కమనీయం ప్లస్ పాయింట్లు ఏమిటంటే… ఎక్కడా అశ్లీలం, అసభ్యత ఛాయల్లేవు… ధడధడ సంగీతం మోతల్లేవు… మంద్రంగా ఉన్న పాటలే… ఎటొచ్చీ ఈతరం ప్రేక్షకులను థియేటర్ల దాకా రప్పించాలంటే ఏదైనా కొత్తదనం కావాలి… అది ఇవ్వడంలో దర్శకుడు ఫెయిల్… ఫాఫం, హీరో హీరోయిన్లు మాత్రం ఏం చేస్తారు..? ఏదో ఆ పాత్రల నేచర్ మేరకు నటిస్తూ పోయారు… పోనీ, సపరేట్ కామెడీ ట్రాక్ అయినా నడిపించొచ్చు కదా, అదీ చేతకాలేదు… ఇక సినిమాను ఎవరు లేపుతారు… అందుకే పడుకుండిపోయింది…! యూవీ క్రియేషన్స్ అండగా ఉన్నప్పుడు ఇంకాస్త బాగా, మరింత కసరత్తుతో, ఇంకాస్త వినోదాత్మకంగా తీసి ఉండవచ్చునేమో సినిమా..!!
Share this Article