ప్రపంచంలో, ఏక కాలంలో సమాంతరంగా అనేక నాగరికతలు అభివృద్ధి చెందాయి. ఆయా ప్రాంతాల పరిస్థితులను బట్టి, అందుబాటులో ఉన్న వనరులతో ప్రకృతి వికసించింది. ప్రకృతిలో భాగమైన మనిషి కూడా, పరిణామ క్రమంలో సంక్రమించిన తెలివితేటలతో… కాలంతో పాటు ఎదిగాడు.
మనిషి సమూహ జీవి . వికాసం (ఎవల్యూషన్) లో భాగంగా తన అవసరాలను తీర్చే సాధనాలు వేటికవి గొప్పగా అభివృద్ధి చెందాయి. సమూహాలలో తమవైన వాటి పట్ల – పరాయి వాటి పట్ల, స్త్రీ పురుష భేదాలతో పాటు, వివిధ వృత్తులపట్ల అభిమానాలు – దురభిమానాలు పెరుగుతూ ఉన్నాయి. తన సమూహం పట్ల తన పట్ల ఏర్పడే ప్రేమతోనూ… వేరే సమూహాలు వ్యక్తుల పట్ల ఏర్పడే పరాయి భావం – అయిష్టతతోనూ దాదాపు అన్ని సందర్భాలలోనూ మనిషి సహజంగా ప్రవర్తించలేడు. తన సమూహం పట్ల తనకున్న అనురక్తియే… వేరే వారికి వారి సమూహం పట్ల కూడా ఉంటుంది అని గుర్తించరు. ఇక్కడే ఘర్షణ వైఖరి మొదలవుతుంది.
తన చుట్టూ ఉన్న పరిస్థితులను బాగా లోతుగా తెలుసుకొని మమేకం కావడం ప్రారంభమైన తర్వాత, వాటిలోని గొప్పతనాలు కాస్త సిద్ధాంతాలుగా, వేరే వాటిలోని విషయాలు తక్కువగా కనిపించి రాద్ధాంతాలుగా మొదలవుతాయి. అవి అస్తిత్వ వాదాలు కావచ్చు, విస్తృతమైన వాదాలు కూడా కావచ్చు. ఆస్తికత్వం, మానవవాదం, కమ్యూనిజం, లౌకికవాదం, స్త్రీవాదం, దళిత, మైనారిటీ, ప్రాంతీయ వాదాలు ఇలాంటి అనేక ఆలోచనా రీతులలో కొన్ని. ఇటువంటి ఆలోచనారీతులు, జీవన శైలులు ఎన్ని ఉన్నప్పటికీ, ప్రపంచమే ఒక కుగ్రామం కాబట్టి… ప్రతి వ్యక్తీ దాదాపు అన్నింటితోనూ సర్దుకుపోక తప్పదు. అలా కుదరకపోతే రహస్యోద్యమాలలో విడిగా బతకాల్సి ఉంటుంది. నిష్ఠురమైన నిజం ఏమంటే, అన్ని వాదాలలోను గొప్పలు ఉన్నట్టే… తప్పులు కూడా ఉంటాయి.
Ads
బుద్ధుని కాలంలో, జీవితపు అసలైన అర్థం కోసం – ఆనందం కోసం వెతుకులాటలో… అన్నపానాదులు మాని, శరీరాన్ని శుష్కింప చేసుకునే ఆత్మహింసా వాదం ఒకటైతే… విపరీత భోగాలతో సుఖించే తాంత్రిక వాదం ఒకటిగా ఉండేది. ఈ రెండు విధానాలు సరికావని గౌతమ బుద్ధుడు… మధ్యమ మార్గాన్ని ప్రతిపాదించాడు. ఇప్పటికీ, ఎప్పటికీ జీవితం ఏ వాదంలోనూ సంపూర్ణంగా ఇమిడే అవకాశం లేదు.
చదువు రీత్యా, వృత్తిరీత్యా నేను ఆధునిక వైద్యానికి సంబంధించిన వ్యక్తిని. నా విధానం పట్ల ఉండే అనురక్తితో మిగతా వైద్య విధానాలను నిరాకరించే ధోరణి ఉంటుంది. అవును, ఆధునిక వైద్యం అద్భుతమైనది. మిగతా విధానాలలో కొందరు చేసుకునే… హెచ్ఐవి పూర్తిగా నిర్మూలన వంటి అతిశయోక్తుల ప్రచారాల వల్ల… వాటి పట్ల మరీ చులకన భావం ఏర్పడింది. అయితే ఇటీవల వేరే వైద్య విధానానికి సంబంధించిన మిత్రుడు ఒకరు నా దగ్గరకు ఒక పేషెంట్ ని పంపించారు. ఆ పేషెంట్ కి ఎలర్జీ సమస్య ఒకటి ఉండేది. దానికి ఎన్నో చోట్ల తిరిగినప్పటికీ ఎంత మాత్రం ఉపశమనం కలగలేదు. చివరికి ఆయన దగ్గర చక్కగా నయం అయింది.
నేను ప్రవీణుణ్ణి అయిన జబ్బుతో బాగా నీరసపడి పోవడంతో ఆ పేషెంట్ ని నా దగ్గరికి పంపారు. సరైన వ్యాధి నిర్ణయం చేయడం, మంచి వైద్యం ఇవ్వడంతో ఆ పేషెంట్ త్వరగా కోలుకుంది. నేను వాస్తవంలో బతుకుతాను కాబట్టి, వేరే వైద్య విధానంలో ఆమె కోలుకొన్న విషయాన్ని తూచ్ అని చప్పరించడం నాకు సాధ్యం కాదు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక మిత్రుని కుమారుడి పెళ్ళిలో కలిసినప్పుడు, ప్రముఖ సైన్స్ అడ్వకేట్ ఒకరు, తమ తండ్రి దీర్ఘ కాలం పడ్డ ఇబ్బంది మోడర్న్ మెడిసిన్ కాని వేరే విధానంలో నయమైంది అని చెప్పారు. వాదాల మూసలో వుండటం మూలంగా ఇలాంటి వాటిని ఎప్పటికీ ఓపెన్ గా చెప్పుకోరు.
వివిధ సంఘాలు తమ సంకుచిత ప్రయోజనాలతోనే పనిచేస్తాయి అనేది అందరికీ తెలిసిందే. జీతాలు, వసతులు, గౌరవాలు గొప్పగా పొందే వృత్తుల వారు కూడా సంఘాలుగా ఏర్పడి… తమకు ఇంకా ఇంకా కావాలి అని డిమాండ్ చేయడం చూస్తూనే ఉంటాం. దాదాపు అన్ని సందర్భాలలోనూ తమ సంఘాలలోని వ్యక్తుల యొక్క తప్పులను కూడా కప్పిపుచ్చడానికి… ఆయా సంఘాల నాయకులు, సభ్యులు ముందుకు వస్తూ ఉంటారు. ఇలా మనుషులు తమ వాదాలకు కట్టుబడి, మిగతా ప్రపంచం దృష్టిలో దోషులుగా నిలబడుతుంటారు. విచారకరంగా ఆ విషయం వారికి అర్థం కాదు.
ఏ మూసలోనూ ఒదగకుండా, వీలైనంతవరకూ సంపూర్ణ మానవునిగా బతకడానికి ప్రయత్నం చేయాలి. దీనికి ఏకైక విధానం సహానుభూతి. ఇతరులు ఏదైనా తప్పు చేసినా, పొరపాటు చేసినా… ఆయా పరిస్థితులలో నేను ఉండుంటే… ఏ విధంగా ప్రవర్తించేవాడిని అని ఆలోచించి ప్రవర్తించడమే సహానుభూతి. వారి పరిస్థితులను, కష్టాలను, ఇబ్బందులను మనవిగా భావించి వారి పట్ల సానుకూలంగా, సానుభూతితో, ప్రేమతో ఉండటమే సహానుభూతి.
సహానుభూతి అనేది సమాజానికి చేటు చేసేదానిని, ప్రకృతి విరుద్ధమైన దానిని ప్రోత్సహించేది కానక్కరలేదు. కొన్ని సందర్భాలలో వ్యతిరేక భావన లేకుండా, అభావంగా ఉండటం కూడా సరైన పద్ధతి. మనుషుల మధ్య ప్రేమ, విశ్వాసం వెల్లివిరియడానికి మనతో పాటే ప్రతి ఒక్కరికీ తమదైన లోకం ఉంటుంది… మనకు ఉన్నట్టే వారి సానుకూల – ఇబ్బందికర పరిస్థితులు వారికి ఉంటాయి అనే విషయం ఎప్పుడూ మననంలో ఉంచుకోవాలి. మన ప్రవర్తనను – అభిప్రాయాలను ఎదుటి వాళ్ళు ఆమోదించి – గౌరవించినట్లే మనం కూడా… సమాజానికి ఇబ్బంది లేని వారి అభిప్రాయాలను, ప్రవర్తనను గౌరవించాలి. అప్పుడే లోకం ప్రశాంతంగాను, హాయిగాను ఉంటుంది… — డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఎండి, కాకినాడ
Share this Article