Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాజ్యం పోయి, ఆస్తులు కరిగిపోయి… అంతటి నిజాం వారసుడు చివరకు…

January 15, 2023 by M S R

Konda Srinivas……   రాజుల సొమ్ము రాళ్ల పాలు..! 2007 ఆ ప్రాంతమనుకుంటా.మక్కా మసీదులో ఓ వ్యక్తి ప్రార్ధనలు చేసి బయటకు వచ్చాడు. నడవలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తికి ఇద్దరు మామూలు మనుషులు సహాయం చేసి ఓ ఎల్లో నెంబర్ ప్లేట్ ఉన్న టాటా కారులో కూర్చోబెట్టారు. ఓ నలుగురైదుగురు తప్ప ఆయన వెంట ఎక్కువ మంది లేరు. ఈ సంఘటన చూసి నేను ఆశ్యర్యపోయాను. ఎందుకంటే ఈ మనిషిని నేను బాగా ఎరుగుదును. ప్రత్యక్షంగా చూడకపోయినా పరోక్షంగా ఆయన గురించి 1986 నుంచి తెలిసిన వాడిని. అలాంటి వ్యక్తి ట్యాక్సీ కారులో వెళ్లడం కొంచెం ఆలోచింపజేసింది. ఇక వెంటనే ఆయన ఈ పరిస్థితికి కారణాలు తెలుసుకోకుండా ఉండలేకపోయాను. ఆయనే గత రాత్రి కన్నుమూసిన ఎనిమిదో నిజాం… ప్రిన్స్ ముఖరంజా.

ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన కుమారులు ఆజాం జాహి, మోజాంజాహిలను కూడా కాదని తన మనవడిని వారసుడిగా ప్రకటించారు. నిజాం మొదటి కుమారుడు ఆజాం జాహి, ప్రిన్స్ దుర్రెషహర్ దంపతుల రెండో కుమారుడే ప్రిన్స్ ముఖరంజా. తాత నుంచి వారసత్వంగా వచ్చిన సంపదతో చిన్న వయసులోనే ప్రపంచ కుబేరుడయ్యాడు. హైదరాబాద్ లో ఉన్న కోట్లాది రూపాయల ఆస్తులు, ప్యాలెస్ లకు హక్కుదారుడు. నిజాం చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్.
ఏడో నిజాం ఇతడిని వారసుడిగా ప్రకటించగానే నాటి ప్రధాని ఎన్నో గౌరవ పదవులను ఆఫర్ చేశాడు. కానీ ప్రిన్స్ ముఖరంజా వాటన్నింటిని కాదని తన అమ్మమ్మ దేశమైన టర్కీకి వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అక్కడ విలాసవంతమైన జీవితం గడిపాడు. ఆస్ట్రేలియాలోని వేలాది ఎకరాల అడవుల్లో షీప్ ఫామ్స్ పెట్టాడు. చుట్టపు చూపుగా ఏడాదికొకసారి హైదరాబాద్ వస్తూ తన ఆస్తులను చూసుకొని పోతుండే వాడు. వచ్చినప్పుడల్లా బంజారాహిల్స్ లోని చిరాన్ ప్యాలెస్ లో ఉండేవాడు. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడల్లా వార్తా పత్రికల్లో ఫోటోలతో హెడ్ లైన్స్ వార్తలు. పెద్ద హ్యాట్, టక్ చేసుకొని కౌబోయ్ గెటప్ లో ఉండే ఆయన్ను చూడగానే ఎవరీ వ్యక్తి అనేలా ఉంటాడు. దానికి తోడు నిజాం మనమడు అనగానే తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది.

ప్రిన్స్ ముఖరంజా చాలా మందిని పెళ్లి చేసుకున్నాడు. ఏ దేశంలో ఎవరు ఆ దేశపు అందగత్తెగా ఎన్నికైతే ఆమెను పెళ్లి చేసుకునే వాడు. అధికారికంగానే అలా 5 పెళ్లిళ్లు చేసుకున్నాడు. మూడో పెళ్లాం మనోలియాతో విబేధాల కారణంగా ఆమె ఇండియాలో మెయింటెనెన్స్ కేసు వేసింది. 2006 లో కోర్టు ప్రిన్స్ ముఖరంజాకు 15 కోట్ల మనోవర్తి ఇవ్వాలని ఆదేశించింది. ఆమెకు పుట్టిన కూతురు నీలోఫర్ చదువు, పోషణకు అదనంగా ఇవ్వాలని తీర్పు నిచ్చింది. మనోలియా మనోవర్తి చెల్లించే వరకు హైదరాబాద్ లో ఆస్తులు అమ్మడానికి వీలు లేదంది. అప్పటికే ఇద్దరు భార్యలు, వారి సంతానం ఆయనపై కేసులు వేయడంతో దివాళా తీశారు.

చేతిలో చిల్లి గవ్వ లేదు. దీనికి తోడు హైదరాబాద్ లోని ఆస్తులపై అతని మేనత్తలు, వారి వారసులు కూడా కోర్టు కెక్కడంతో అవి ఎటూ తెగలేదు. హైదరాబాద్ లో కొన్ని ఆస్తులకు సంరక్షకులుగా ఉన్న వారు వాటిని అతనికి తెలియకుండా అమ్ముకున్నారు. హైదరాబాద్ పోలీస్ యాక్షన్ అప్పుడు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కొంత డబ్బును పాకిస్థాన్ పంపించాడు. పాకిస్థాన్ ప్రభుత్వం ఆ డబ్బును లండన్ లోని వెస్ట్రన్ బ్యాంక్ లో జమ చేసింది. వడ్డీతో కలిపి అది ఇప్పుడు చాలా అయ్యింది. ఆ డబ్బు తమదంటే తమదని అటు పాకిస్థాన్, ఇండియా ప్రభుత్వాలు, ఇటు ప్రిన్స్ ముఖరంజా వాదించారు. మీరు ముగ్గురు ఏకాభిప్రాయంతో ఆ డబ్బు ఎవరిదని వస్తారో అప్పుడే ఇస్తామని వెస్టన్ బ్యాంక్ వారు చెప్పారు.

Ads

ఈ విధంగా ఎనిమిదో నిజాం కున్న ఆస్తులన్ని వివాదాల్లో చిక్కుకున్నాయి. చేతిలో ఉన్న ఆస్తులన్నీ కరిగిపోయాయి. ఒకప్పటి ప్రపంచ కుబేరుడు దివాళా తీశాడు. చివరి రోజుల్లో ఇస్తాంబుల్ లోని ఓ డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ కే పరిమితమై పోయాడు. ఆయన ఆసక్తికరమైన జీవిత చరిత్ర గురించి విదేశీ జర్నలిస్ట్ The Last Nizam..The rise and fall of India’s greatest princely state అనే పుస్తకం రాశాడు. ఇందులో ప్రిన్స్ ముఖరంజా గురించి ఎన్నో విషయాలు వెల్లడించాడు. రాజుల సొమ్ము రాళ్ల పాలు అంటే ఇదేనేమో..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions