‘తదమ్’ అని 2019లో ఓ సినిమా వచ్చింది… తమిళం… అరుణ్ విజయ్ డబుల్ యాక్షన్… ఆ నిర్మాతకు టేస్టుంది కానీ కమర్షియల్ బుర్ర లేదు… జస్ట్, మన స్రవంతి రవికిషోర్కు రైట్స్ అమ్మేసి, వచ్చిన సొమ్ము చూసుకుని మురిసిపోయాడు… ప్చ్, అసలు రూపాయి సొమ్మును రకరకాలుగా యాభై రూపాయలకు అమ్ముకోవడంలో తమిళ వ్యాపారులు ప్రసిద్ధులు… ఫాఫం, ఈయనకు ఏమైందో… సరే, ఈ రవికిషోరుడు అదే సినిమాను మన పోతినేని రాముడు హీరోగా చుట్టేసి… ఇప్పుడు ఏకంగా ఏడు భాషల్లో రిలీజ్ చేస్తున్నాడు…
డబుల్ యాక్షన్… నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్ నటిస్తున్నారు… మొన్నటి నుంచీ అన్ని పత్రికల్లో వీళ్ల ఇంటర్వ్యూలు వస్తున్నాయంటేనే అర్థమైపోయింది… తమాషా ఏమిటంటే..? ఇప్పుడు విడుదల చేస్తున్న ఏడు భాషల్లో తమిళం కూడా ఉంది… అంటే తమ ఒ:రిజినల్ సినిమాను తమిళ ప్రేక్షకులు డబ్బింగ్ సినిమాగా కూడా చూసి తరించే భాగ్యాన్ని ఈ రవికిషోరుడు, హీరో రాముడు కల్పిస్తున్నారన్నమాట… షూఫర్… రెడ్ అనే పేరున్న ఈ సినిమాకు ఇంకా చాలా విశేషాలున్నయ్… బుర్ర గిరగిరా తిరిగే షాకులున్నయ్… పదండి చదువుదాం…
మళ్లీ రెడ్ అనబడే ఈ తెలుగు సినిమా డబ్ వెర్షన్ చేసి, ఇంకెవరో తమిళ నిర్మాత రీమేక్ హక్కులు కొని, దాన్ని తమిళంలో నిర్మించి, పనిలోపనిగా తెలుగులో డబ్ చేసే ప్రమాదం కూడా ఉంది గమనించగలరు… అదేమంటే… ఓ స్టాండర్డ్ డైలాగ్ ఉంటుంది కదా… కథ మాత్రమే తీసుకున్నాం, కథనాన్ని నేటివిటీకి అనుగుణంగా మార్చాం అని… హహహ…
Ads
అవునూ, నేటివిటీకి అనుగుణంగా మార్చుకున్నాం అంటారు కదా… మరి తెలుగులో తీయబడిన సినిమాను ఒకేసారి ఏడు భాషల్లోకి డబ్ చేసి విడుదల చేస్తున్నారూ అంటే… ఆ మిగతా ఆరు ప్రాంతాల నేటివిటీని పట్టించుకోలేదు అన్నట్టే కదా… తమిళ కథకు తెలుగు నేటివిటీ అవసరం అయినప్పుడు, మిగతా భాషల్లో స్థానిక వాసన, రుచి అక్కర్లేదా..? తమిళం నుంచి మనకు అనువదించే సినిమాల్లో పాటలు తెలుసు కదా… ఆ ట్యూన్లో తెలుగులా వినిపించే పదాల్ని అడ్డదిడ్డంగా అమరుస్తారు… సో, ఈ ఏడు భాషల్లోనూ పాటల గతి అంతేనా..? ఏం కథలు చెబుతారు స్వామీ మీరు..?
ఇన్ని భాషల్లోనా..? అని ఎవరైనా విలేఖరుడు అడిగాడో లేదో మనకు తెలియదు గానీ… మన హీరో రాముడికి వివిధ భాషల్లో, ప్రాంతాల్లో బాగా ఆదరణ పెరిగినందున ఇన్ని భాషల్లో రిలీజ్ చేయాల్సి వస్తున్నదని రవికిషోరుడు కులాసాగా సెలవిచ్చాడు… ఓహ్, భోజ్పురి, మరాఠీ, బెంగాలీ ప్రాంతాల్లో కూడా మన హీరో ఎప్పుడు, ఎలా అంత పాపులర్ అయ్యాడు అని జుత్తుపీక్కోకండి, అది పీహెచ్డీ చేయాల్సిన సబ్జెక్టు… అవునూ, కన్నడంలోనూ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ అంటున్నారు కదా… కర్నాటకలో ఇప్పుడు అనువాద చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా..?
సర్లె… ఇక్కడ ప్రశ్న ఏమిటంటే..? హీరో రాముడు తెలుగు, తమిళ, మళయాళ, హిందీ, బెంగాల్, మరాఠీ, భోజ్పురి భాషల్లోనే ఇరగదీస్తే… మరి మిగతా భారతీయ భాషలకు అన్యాయం చేసినట్టు కాదా..? స్రవంతి రవికిషోరుడికి ఎవరూ చెప్పలేదేమో… మన పోతినేని రాముడికి గుజరాతీ, కశ్మీరీ, రాజస్థానీ భాషల్లోనూ మస్త్ ఆదరణ ఉంది… అంతేకాదు, సింహళంలో కూడా… మాండరిన్, అరబిక్, ఉర్దూ, రష్యన్ భాషల్లోనూ వెంటనే డబ్ చేసి… అన్నిచోట్ల థియేటర్ ఎక్స్పీరియెన్స్ కోసం… గ్రాండ్గా విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది..? పాన్ వరల్డ్ హీరో కదా… బాహుబలిని మరిచిపోయారా..?
అది సరేగానీ… మనవాళ్లకు ఇంత ప్రపంచజ్ఞానం ఉంది కదా… చకచకా డబ్ చేసి ప్రపంచం మీదకు వదిలేస్తారు కదా… మరి మిగతా భాషల్లో సినిమాలు తీసే నిర్మాతలకు ఈ జ్ఞానం ఎందుకు లేదు..? మన తెలుగులో అంత విరివిగా ఇతర భాషల అనువాద చిత్రములు ఎందుకు కనిపించవు..? బహుశా తెలుగు ప్రేక్షకులు ప్యూర్ ఒరిజినల్ సరుకునే ఇష్టపడతారేమోనని వాళ్లలో భ్రమలున్నాయేమో… మనం ఏదైతే చూసి, తరిస్తామని తెలియదు పాపం వాళ్లకు… ఈ చిత్ర పోస్టరునందు… #RAPO18 అనబడే అక్షరాలు చూసి, చాలాసేపు అర్థం కాలేదు… అది రామ్ పోతినేని 18వ చిత్రం అట… అసలు భాష ఇది కదా… ఈ ఏడు భాషలు, వివిధ దేశాల్లో రిలీజులను మించిన భాష… ఎలాగూ రెడ్ అనేది అందరికీ అర్థమయ్యే టైటిల్… పనిలోపనిగా ఓ ఇంగ్లిష్ వెర్షన్ కూడా అర్జెంటుగా డబ్ చేసి, ప్రపంచమంతా రిలీజ్ చేసేస్తే… రాపో19 సినిమా యాంజెలినీ జూలీతోనే ఇక…!!
Share this Article