ఇంతకీ దేవిశ్రీప్రసాద్ గెలిచాడా..? థమన్ గెలిచాడా..? ఒక విశ్లేషణ….. దర్శకుడు బాబీ గెలిచాడా..? మలినేని గోపీచంద్ గెలిచాడా..? మరొక విశ్లేషణ…. బాలయ్య గెలిచాడా..? చిరంజీవి గెలిచాడా..? ఏ సినిమా వసూళ్ల పరిస్థితేమిటి..? అనే విశ్లేషణలు కొంతమేరకు వోకే… ఎందుకంటే, మనం ఉన్న రియాలిటీలో గెలుపోటములకు హీరోల్నే బాధ్యుల్ని చేస్తున్నాం… గెలుపోటములను బట్టే సదరు హీరో తదుపరి మార్కెట్ నిర్దేశించబడుతుంది కాబట్టి…!
కానీ సంగీత దర్శకుల్లో ఎవరు గెలిచారు..? ఏ దర్శకుడు గెలిచాడు..? అనే చర్చలు శుద్ధ దండుగమారి యవ్వారం అనిపిస్తుంది… ఏదో నాలుగు పిచ్చి వార్తల కోసం తప్ప ఆ విశ్లేషణలు వేస్ట్… వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతి బరిలో బలంగానే పోటీపడ్డాయి… రెండు సినిమాల నిర్మాతలు సేమ్… హీరోయిన్ సేమ్… కొరియోగ్రాఫర్ సేమ్…
నిజానికి వసూళ్ల విషయంలో వీరయ్య కాస్త ముందంజలో ఉన్నాడు… పెట్టిన ఖర్చుకు ఫుల్ రన్‌లో ఎంత వస్తుందో చూడాల్సి ఉంది… వీరసింహారెడ్డి వసూళ్లు ఇంకా పుంజుకుంటే తప్ప గట్టెక్కడు… ఇక పోటీ అంటారా..? హీరోలు తప్ప ఇంకెవరి నడుమ పోటీగా చూడాల్సిన పనిలేదు… థమన్ బాలయ్య పట్ల కాస్త ఎక్కువ అభిమానంతో ఉంటాడు… తనకు చేతనైనంత మేరకు పాపులర్ ట్యూన్స్ ఇవ్వడానికి ట్రై చేశాడు… అలాగే డీఎస్పీ వీరయ్య సినిమాకు కొన్ని ప్రయోగాలతో, కొత్త ట్యూన్లు ట్రై చేశాడు… ష్, లోకం ఎలా ఉంటుందంటే… సినిమా రిలీజయ్యాక సక్సెస్ మీట్లలో గానీ, ఇంటర్వ్యూల్లో గానీ డీఎస్పీ, థమన్ పేర్లను ఆయా సినిమాల బాధ్యుల్లో ఎందరు ప్రస్తావించారు, ఎవరు అభినందించారు..? సో, ఈ రెండు సినిమాల తరువాత మళ్లీ ఎవరి సినిమాలు వాళ్లవే… అయినా వాళ్లు తమ నడుమ పోటీ అని ఫీలయితే కదా…
Ads
ప్రిస్టేజియస్ ప్రాజెక్టు వచ్చింది, ఫాయిదా ఎంత అనే లెక్కలు వేసుకుంటారు, అంతే… కాకపోతే సినిమా సూపర్ హిట్ అయితే తదుపరి సినిమాలకు ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయవచ్చు… అంతే… దర్శకులు మినహా మిగతా వృత్తి నిపుణులు ఈ పోటీ వార్తల్ని లైట్ తీసుకుంటారు… దర్శకుల నడుమ పోటీ కాదు గానీ, ఫ్లాప్-హిట్ వాళ్ల భావి అవకాశాలను, రెమ్యునరేషన్లను ప్రభావితం చేస్తాయి… అగ్ర నటుల్ని డీల్ చేయడం చిన్న టాస్కేమీ కాదు…
ఇక మిగతా వాళ్ల సంగతికొస్తే… శృతి హాసన్ సినిమాలు పూర్తయ్యాక ఇక అస్సలు ఇటువైపు రాలేదు… ఫ్లాపా, హిట్టా లైట్ తీసుకుంది… హిట్టయితే కాస్త బెటర్… కానీ ఆమె అవేమీ పట్టించుకోలేదు… కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఏపాటకాపాట, కొత్తగా ఆ హీరోల ఇమేజికి తగినట్టు ఏం స్టెప్పులు కంపోజ్ చేయాలో ఆలోచించుకుంటాడు తప్ప దీన్ని వీరయ్య, వీరసింహా పోటీగా భావించాడు… తనకు వచ్చిన మంచి చాన్స్, దానికి తగినట్టు కొత్తగా డాన్సులు చేయించాలి… అదే ధ్యాస…
వీరసింహా ఫెయిలయితే ఇమీడియట్‌గా గోపీచంద్‌కు వచ్చిన నష్టమేమీ లేదు… పెద్ద హీరోను సమర్థంగా టాకిల్ చేశాడనే పేరొచ్చింది, అది చాలు, భావి అవకాశాలను అదే పట్టుకొస్తుంది… అంతెందుకు..? ఇదే టీంతో మరో సినిమా చేయడానికి బాలయ్య రెడీగా ఉంటాడు… బాబీకి కూడా వీరయ్యతో ఫాయిదా దక్కినట్టే… కొన్ని మనం పట్టించుకోం… ఉదాహరణకు, అడ్డగోలు రెమ్యునరేషన్ తీసుకుంటున్న మాటల రచయిత ఎమోషనల్, పంచ్ డైలాగులు బాగానే రాస్తున్నాడు గానీ, కామెడీ రాయడంలో పరమ వీక్…
జబర్దస్త్ టీం లీడర్లు బెటర్‌గా కామెడీ స్క్రిప్టు రాయగలరు… ప్రిరిలీజులు, సక్సెస్ మీట్లు, ఇంటర్వ్యూలు, చాట్ షోలు గట్రా అన్నీ అయ్యాక ఒకటే ఆసక్తికరంగా అనిపించింది ఏమిటంటే… బాలకృష్ణ చెంఘిజ్ ఖాన్ పాత్ర మీద ఆసక్తి చూపడం… చేయగలిగితే తనే చేయగలడు, చిరంజీవికి అది సూట్ కాదు, తను చేయడు కూడా… రిస్కీ ప్రాజెక్టే కానీ రాజమౌళి, నాగ్ అశ్విన్ వంటి బడా దర్శకులయితే బెటర్… కానీ రాజమౌళి మహేశ్ సినిమాతో, నాగ్ అశ్విన్ ప్రభాస్ సినిమాతో బిజీ… ఇప్పట్లో వాళ్లు ఫ్రీ కాలేరు… కొంతమేరకు గుణశేఖర్‌తో ట్రై చేయవచ్చునేమో… చిరంజీవి మరో స్టెప్పుల సినిమా చూసుకుంటాడు… ఈలోపు బాలయ్య మరో నరుకుడు సినిమా చేసేస్తాడు…!!
Share this Article