కొప్పల్… కర్నాటక నడిబొడ్డున ఉంటుంది… అక్కడ సంక్రాంతి వచ్చిందంటే చాలు… ఓ జాతర కోలాహలం మిన్నంటుతుంది… పదిహేను రోజులపాటు జరిగే ఈ జాతర యూనిక్… గవి సిద్ధేశ్వర మఠ్ జాతర అంటారు దీన్ని… ఈ జాతర పుట్టుక, స్థలపురాణం జోలికి పోవడం లేదు ఇక్కడ… అక్కడి స్థానికుల ఆనందంగా దీన్ని మరో పూరి ఉత్సవంగా చెప్పుకుంటారు… దాన్ని మించిన రథోత్సవం అనీ చెబుతారు… కానీ దేని విశిష్టత దానిదే… 3 రోజుల్లో కోటి మంది భక్తులు ఒక్కచోట చేరి భక్తిగా దేవతాగద్దెలను టచ్ చేసే సమ్మక్క-సారలమ్మ జాతర నిజానికి దక్షిణాన ఓ కుంభమేళా… అంతకుమించి… సో, భక్తుల సంఖ్య జాతర మీద ప్రజల నమ్మకాల గురించి చెప్పేటప్పుడు ప్రధానం కాదు…
మన పొరుగునే ఉండి, మన భాషతో పోలిన భాష కలిగిన కన్నడిగుల నిజమైన సంస్కృతి, పండుగలు, ఆచారాల గురించి తెలుగునాట అస్సలు జరగాల్సినంత చర్చ గానీ, రావల్సినంత మీడియా కవరేజీ గానీ లేవు… మొన్న జ్ఞానయోగి సిద్ధేశ్వరస్వామి మరణిస్తే, ఏకంగా ముఖ్యమంత్రి సహా 10 – 15 లక్షల మంది అంతిమనివాళి అర్పిస్తే తెలుగు మీడియా కవరేజీ లేదు… అదే పెద్ద ఉదాహరణ… ఈ గవి సిద్ధేశ్వర జాతర కూడా అంతే… లక్షల మంది భక్తగణాన్ని ఒక్కచోట చేర్చే విశ్వాసాన్ని, ఆ కోలాహలాన్ని మించిన వార్తలేముంటయ్… క్షుద్ర రాజకీయాలు, భజనలు, కీర్తనలే మనకు ప్రధాన వార్తలు అవుతున్న పాత్రికేయ దరిద్రం…
ఈ గవి సిద్ధేశ్వర మఠ్ జాతర ఆర్గనైజ్డ్‌డ్‌గా ఏదో ఓ సంస్థ పూర్తి బాధ్యత తీసుకోకపోయినా… లక్షల మంది యాత్రికులు చిన్న అపశృతి లేకుండా జాతరలో పాల్గొంటారు… దాసోహ సమితి కొన్ని నిర్దేశాలను ప్రకటిస్తూ ఉంటుంది… ప్రత్యేకించి రథోత్సవం ఫోటోలు చూడండి… నిజమే, పూరి జగన్నాథుడి ఉత్సవాన్ని తలపిస్తోంది… కరోనా కారణంగా రెండేళ్లు జనం లేకపోయినా, గతంతో పోలిస్తే ఇప్పుడు దాదాపు 25 శాతం వరకూ జాతర జనం పెరిగిపోయారు…
Ads
అన్నింటికీ మించి ఆశ్చర్యాన్ని కలిగించే అంశం… అక్కడికి వచ్చే ఏ భక్తుడికీ… (మతాలకు కూడా అతీతంగా) కడుపు మాడకూడదు… అందుకని అనేక మంది వ్యాపారులు, దాతృత్వం చూపే ధనికులు తమంతట తాము వస్తారు… సంప్రదాయ సిద్ధమైన ఉప్మా, పులిహోర, అన్నం మాత్రమే కాదు, లక్షల సంఖ్యలో చపాతీలు ప్లస్ కూర… అప్పటికప్పుడు అనేక డైనింగ్ హాల్స్ వెలుస్తాయి… మరీ ఆశ్చర్యం ఏమిటంటే… దాదాపు 10 నుంచి 15 లక్షల మిర్చి బజ్జీలను అప్పటికప్పుడు నూనెలో వేయించి మరీ పంపిణీ చేస్తారు…
అసలు ఈ మిర్చి బజ్జీలను భక్తగణానికి తప్పనిసరిగా పంపిణీ చేయడం, దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఎలా ప్రారంభమైందోె తెలియదు గానీ… ఇంత భారీ సంఖ్యలో ఈ బజ్జీల వినిమయం ఖచ్చితంగా వార్తే… ఒక్క భక్తుడికి కూడా కడుపు అప్‌సెట్ కావడం వంటివి జరగవు… కుప్పలుకుప్పలుగా మిర్చి బజ్జీల ఫోటోలు కన్నడ మీడియాలో కన్నులపండుగా కనిపిస్తాయి… అక్కడి యూట్యూబ్ చానెళ్లు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మంచి కవరేజీ ఇస్తుంది…
ఇవేగాకుండా వందల మంది భక్తగణం దాదాపు 7 లక్షల చిన్న చిన్న బొబ్బట్లను (షెంగ హొలిగె)లను, 300 క్వింటాళ్ల మాడ్లి (చపాతీలను ఉపయోగించి చేసే ఓరకం ఉత్తర కర్నాటక స్పెషల్ స్వీట్ డిష్), కోవా బిళ్లలు తయారు చేసి యాత్రికులకు పంచిపెడుతున్నారు ఈసారి… కావల్సిన వంటచెరుకు, నూనె, గుండిగెలు, మూకుళ్లను కూడా అప్పటికప్పుడు సమకూర్చుకుంటారు… ఏవీ చేతకానివారు తాగునీరు, ప్లేట్లు తీసేయడం వంటి సర్వీస్ చేయడం ద్వారా తమ భక్తిని చాటుకుంటారు… గతంలో కాలేజీ స్టూడెంట్స్ ఈ సేవాకార్యక్రమాల్లో ఎక్కువగా కనిపించేవాళ్లు, ఈసారి ప్రైవేటు సంస్థల ఎంప్లాయ్స్, వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది కనిపిస్తున్నారు..!!
Share this Article