పాఠకులకు ‘కవిత్వం’ అర్థంకాకుంటే….. ఆ తప్పు కవిదా ? పాఠకులదా ? *ఆరుద్ర గారూ.! అర్థం కాకపోతే …….. “అన్ ఎడ్యుకేటెడ్ ఆంధ్రా” నా ? హవ్వ.!
ఆరుద్రగారు సాంప్రదాయరీతులకు భిన్నంగా టెక్నిక్ తో ” త్వమేవాహమ్ ” కావ్యాన్ని రాశారు. తన కళాకేళీ ప్రచురణల తరపున. ‘ ఆవంత్స… సోమసుందర్’ (పిఠాపురం) గారు అచ్చేయించారు. అది పాఠకులకు ఓ పట్టాన కొరుకుడు పడలేదు. బుర్ర ఎంత బద్దలు కొట్టుకున్నా కూడా….
కవి హృదయం అర్ధం కాలేదు.!!
Ads
అప్పుడు పాఠకులేం చేశారంటే.. సహజంగానే ఆ కవిత్వాన్ని గిరాటేశారు. అర్ధంకాని కవిత్వంతో కుస్తీపట్టడం దేనికని ఎంచక్కా ఆ కవిత్వాన్ని పక్కన పెట్టేశారు.. దాంతో ఆరుద్ర గారికి కోపం వచ్చింది.. నేనింత కష్టపడి రాస్తే అర్ధం చేసుకోలేక పక్కన పడేస్తారా ? ఈ అన్ ఎడ్యుకేటెడ్ ఆంధ్రా పాఠకులంటూ మండిపడ్డారు. ఇక నేను కవిత్వం… రాయను అనే ప్రతిజ్ఞ వరకూ వెళ్ళింది పరిస్థితి..
ఇక్కడ విషయమేమంటే…? కవి ఏది రాసినా? ఎలా రాసినా? పాఠకులు దాన్ని అర్ధం చేసుకోవాలా? ఎంత జటిలంగా వున్నా కూడా ఆ కవిత్వాన్ని హృదయానికి హత్తుకోవాలా? కవి చాదస్తం అంతా పాఠకులు భరించాలా? కవిత్వం అర్ధం కాకపోత పాఠకులకు చదువులేదనా? ఆ కవి దృష్టిలో .. పాఠకులు నిరక్షర కుక్షులా? ఒట్టి చచ్చు దద్దమ్మలా?
కవి ఏదో ఊహించుకొని రాస్తే, పాఠకులు దాన్ని… అర్ధం చేసుకోటానికి బుర్రగోక్కోవాలా? నానా తిప్పలు, పాట్లు పడాలా? తీరా సదరు కవిగారి కవిత్వం అర్ధం కాకపోతే “తప్పు నాది కాదు.. పాఠకులదే అని కవి ఓ స్టేట్ మెంట్ ఇచ్చేసి పక్కకు తప్పుకోవచ్చా. కవుల ఈ ధోరణి ఎంతవరకు సబబు?
రండి ఆ విషయమేదో తేల్చేద్దాం…!! ఆరుద్రగారి త్వమేవాహమ్ 1949 లో అచ్చయింది. అంటే ఇప్పటికీ 74 సంవత్సరాల క్రితం అన్న మాట. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా, హైదరాబాదు సంస్థానం మాత్రం భారతదేశంలో విలీనం కాలేదు.. ఇక్కడ నిజాంకు వ్యతిరేకంగా రైతాంగ సాయుధ పోరాటం ముమ్మరంగా జరుగుతోంది.. ఆ పరిస్థితుల్లో ఆరుద్ర గారు ఈ త్వమేవాహమ్ కావ్యాన్ని రచించారు…. మొదట దీని పేరు ” తెలంగాణ ” అని పేరు పెట్టారు. ఆతర్వాత శ్రీశ్రీ గారి సూచన మేరకు ఆరుద్ర దీన్ని “త్వమేవాహమ్ “అని మార్చారు..
“త్వమేవాహమ్ ” అంటే ‘నువ్వే నేను’ అని అర్థం. చిరంజీవి మానవుడితో మృత్యువు ‘త్వమేవాహమ్’ అంటుంది.. నాటి సామాజిక, అ)రాజకీయ పరిస్థితుల్లో మనుషుల బతుకు ఎంత ఘోరంగా..వుండిందో ధ్వన్యాత్మకంగా సూచించే శీర్షిక ఇదని శ్రీశ్రీ గారి… వ్యాఖ్య…!
ఈ కావ్యం కథావస్తువు తెలంగాణకు సంబంధించింది. రజాకార్ల దుర్మార్గాలకు అద్దం పట్టిందీ కావ్యం. రజాకార్లచే చెరచబడిన ఓ యువతి నిస్సిగ్గుగా… వివస్త్రయై తన బాధను చెప్పుకునే దృశ్యం కంటనీరు పెట్టిస్తుంది. శ్రీశ్రీ చెప్పినట్లు ఈ కావ్యానికి కాలమే ప్రధాన వస్తువు. తెలంగాణ అప్పుడొక అల్పక్షణంగా మారిపోతుంది. ఈ కావ్యం ఘనీభవించిన పర్వత దశతో ప్రారంభమై మధ్య మధ్య ఉపనదులను కలుపుకొని ప్రవాహదశతో అంతమవుతుంది. ఇసుక గడియారం, నీటి గడియారం, పెద్ద ముల్లు, చిన్నముల్లు, సెకండ్లు, చిన్నముల్లు, పెద్దముల్లు, పెండ్యులం, అలారం, కీ కాలానికి సంకేతాలుగా ఆరుద్ర వాడిన విధం గొప్పగా వుంటుంది. అందుకేనేమో దాశరథి ఆధునికుల్లో అత్యంతాధునికుడు ఆరుద్ర అంటాడు.
అంతా బాగానే వుంది కానీ,..”త్వమేవాహాన్ని ” టెక్నిక్ తో నింపేశారు ఆరుద్ర. కవిత్వమంటే రసాస్వాదన. దానికి టెక్నిక్ కూడా తోడైతే అదనపు పరిమళం అబ్బుతుంది.. అయితే ఆరుద్ర టెక్నిక్ ను మాత్రమే నమ్ముకున్నారు. అలా చెబితేనే ఆధునిక కవిత్వమవుతుందని అనుకున్నారో ! ఏమో?
గిరీశం చెప్పినట్లు కథ అడ్డం తిరిగింది. ఆరుద్ర.. ఎంతో గొప్పగా ఊహించుకొని రాసిన కవిత్వాన్ని జనం ‘రిసీవ్’ చేసుకోకపోవడం ఆరుద్రను బాధించింది. ఒక్కసారి ఆరుద్ర ఏం రాశారో ? ఎలా రాశారో? చూద్దాం !!
తెలంగాణ సాయుధ పోరాటం నుంచి స్పెయిన్ యుద్ధం దాకా, బ్రెయిన్ గన్లు, స్టెన్ గన్లు తెలిసుండాలి.. చెరిషించి, పరిషించి లాంటి దుష్ట సమాసాలను గమనిస్తూ ట్రావెల్ చేయాలి.. అయినా అప్పుడు కూడా త్వమేవాహమ్ అర్ధం కాదు.. ఇంకా లోతుకెళ్ళాలి. ఆరుద్ర బుర్రలో దూరి అసలు విషయాన్ని రాబట్టాలి.. ఈ గొడవంతా మనకెందుకులే అని …పాఠకుడు పఠన సన్యాసం చేస్తాడు. ఇందులో పాఠకుడి తప్పేమిటి?
అయినా…… ఆరుద్రగారికి కోపం వచ్చింది…!! “టెక్నిక్ లేని కవిత్వాన్ని నేనూహించలేను. ప్రత్యేక సంవిధానరహిత వాక్య సందోహాన్ని, వాక్సుద్ధి, ధారా, భాషా వైదుష్యాలుని పోనాడిన మాటల దొంతరని నేను కవిత్వంగా ఎంచలేను..టెక్నిక్ వున్న కవిత్వం జనానికి అర్థం కావడం లేదు.అందుకే ఈ ‘అన్ఎడ్యుకేటెడ్ ఆంధ్రావని’కి కావలసిన విధంగా తర్జుమా చేయడంలోకి దిగా ”నంటూ ఓ సందర్భంలో నీరుకారిపోయాడు.
“త్వమేవాహమ్ లో, వేదనాశకలంలో ఏంగ్ ఝయిటీ , కన్ ఫ్యూజన్ వున్నాయంటాడు ఆరుద్ర.. “నిముషాలు గానీ, నిముషాలలో ఒకడైన కవిగాని బ్రెయిన్ లో పెయిన్ కన్ ఫ్యూఝన్. గుప్పిటి ఏంగ్ ఝయిటి ముట్టడి’ అనే రాయాలంటాడు.. అలాగే ఆరుద్రీకరించి రాశాడు.. అయితే శ్రీశ్రీ ఈ కావ్యానికి లఘుటిప్పణి రాశాక దాశరథి ఈ కావ్యం గురించి విపులంగా వ్యాఖ్యానించాక గానీ త్వమేవాహం అర్ధం కాలేదు.. దాని విలువ తెలీలేదు. కవిత్వం అర్ధం కానప్పుడు.. విశ్లేషకులో, విమర్శకులో రంగంలోకి దిగి, అరటి కాయ ఒలిచినట్లు ఆ కవిత్వ రీతిని, తీరును చెప్పేంత వరకు ఆ కవిత్వం ముడిసరుకుగానే మిగిలిపోతుంది..
త్వమేవాహం విషయంలోనూ అదే జరిగింది.. అంతెందుకు? ఆరుద్రగారి అర్ధాంగి, కవి, రచయిత్రి కె.రామలక్ష్మి గారు’ త్వమేవాహమ్ ‘ గురించి ఏమన్నారో … చూడండి…! “నేను స్వతంత్రలో పొయిట్రీ పేజీ చూసే రోజుల్లో .. “కాలం” అన్న కవితా భాగం అచ్చయింది. తర్వాత “త్వమేవాహమ్ ” భాగాలు కూడా అచ్చయ్యాయి. అవి నాకప్పుడు అర్ధమయి కాదు.. కొత్త కవిత ప్రచురించవలసిన అవస్థ. ఈనాటికీ నేను’త్వమేవాహమ్’ వింత పడుతూనే చదువుతాను. ఇప్పటికీ.. శ్రీశ్రీ వివరణ తర్వాత కూడా .. నాకు పూర్తిగా అర్ధం అయిందని అనుకోను” (త్వమేవాహమ్ స్వర్ణోత్సవ ముద్రణ కోసం రామలక్ష్మి గారు రాసింది..1.6.1999)
ఆరుద్ర గారి సంగతి కాస్సేపు పక్కన బెడదాం… ఇలా పాఠకులకు అర్ధం కాకుండా రాసిన కవుల్లో వేగుంట మోహన్ ప్రసాద్ గారొకరు.. ఆయన కవిత్వం అర్ధం చేసుకోవడం ఓ సర్కస్ ఫీట్ కంటే .. తక్కువేం కాదన్న వాళ్ళూ వున్నారు. Obstract పొయెట్రీ పేరుతో ఆయన ఆంధ్రదేశంపైకి దండెత్తారు.. ఇప్పటికీ ఆయన కవిత్వం అర్ధంకాని వారు కోకొల్లలు. సరే ఆవిషయాన్నీ కాస్సేపు పక్కన బెడదాం.
ఇప్పుడు సమస్య.. కవి రాసే కవిత్వం పాఠకులకు అర్ధం కావాలా? అన్న ప్రశ్న తలెత్తుతుంది.. ఏ కవైనా ముందు తన కోసమే కవిత్వం రాసుకుంటాడు. ఆ తర్వాత లోకం ముందు పెడతాడు. తన కవిత్వాన్ని జనం (పాఠకులు) ఆదరించాలని కోరుకుంటాడు. అయితే… తాను రాసిన కవిత్వం తనకు మాత్రమే తెలిస్తే సరిపోదు… అది జనానికి అర్ధం కావాలి… అప్పుడే జనం చదువుతారు. ఆదరిస్తారు…
మరి ఆంధ్రా జనం ‘అన్ ఎడ్యుకేటెడ్’ అని ఆరుద్ర గారికి ముందే తెలిసుంటే… ఈ త్వమేవాహమ్ రాసేవాడు కాదేమో? పాపం కావ్యం రాశాక గానీ ఆయనకు తెలీలేదు.. అయినా కూడా ఈ అన్ఎడ్యుకేటెడ్ జనం ఈ కావ్యాన్ని వదల్లేదు.. ఓపిగ్గా టిప్పణి, వ్యాఖ్యానాల సాయంతో అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారనే చెప్పాలి. లేకుంటే 74 యేళ్ళ తర్వాత కూడా మనం ఇలా ఫేస్బుక్ లో త్వమేవాహమ్ గురించి మాట్లాడుకునే వాళ్ళం కాదుగా!… అలాంటప్పుడు… ఆంధ్రా జనం అన్ ఎడ్యుకేటెడ్ ఎలా అవుతారో ఆరుద్ర గారే చెప్పాలి.. చెప్పడానికి ఆయనిప్పుడులేరు..!!– *ఎ.రజాహుస్సేన్..!!
Share this Article