ఏవో పిచ్చి పదాలు… అర్థం లేనివి, అర్థం కానివి… ట్యూన్‌లో ఏది ఒదిగితే అవి… కూర్చడం, పేర్చడం, అదే సాహిత్యమని దబాయించడం… మ్యూజిక్ కంపోజర్లు కూడా ఏదో ట్యూన్ ఇచ్చామా, శెనిగెలు బుక్కి చేతులు కడుక్కున్నామా… గాయకులూ అలాగే తయారయ్యారు… అన్నీ అనికాదు, చాలా తెలుగు సినిమా రీసెంటు పాటల గతి ఇలాగే ఉంది… గతి అంటే ఇక్కడ నెగెటివ్ దుర్గతి కాదు, పయనం…
శాకుంతలంలో మల్లికా మల్లికా పాట అంత గొప్పగా ఏమీ లేదు కానీ… వీలైనంత తెలుగుతనంతో ఆకట్టుకుంది… బాహుబలి-2లో హంసనావా పాట రాసిన చైతన్య ప్రసాద్ ఈ మల్లికా పాటలో అంత్యప్రాసల కోసం కాస్త పాకులాడుతూనే, ప్రసవ ప్రయాసపడుతూనే, సరళమైన పదాల్ని అర్థవంతంగా పేర్చాడు… అవి రమ్య బెహరా గొంతులో అందంగా ఒదిగాయి… మనసు పెట్టాలే గానీ మణిశర్మ తెలుగు సినిమా సంగీతానికి దొరికిన ఓ మణిపూస కాదా…
ఒక దర్శకుడిగా గుణశేఖర్ టేస్టు ఎప్పుడూ బాగానే ఉంటుంది… రుద్రమదేవిలో అది కాస్త శృతితప్పినట్టు అనిపించినా… ఈ శాకుంతలం అనే నిజమైన పాన్-భరత్ సినిమా కాస్త ఆసక్తిని క్రియేట్ చేస్తోంది… మొదట్లో ఏమనుకున్నారో గానీ ఇప్పుడా సినిమా అయిదారు భాషల్లోకి, త్రీడీ గ్రాఫిక్స్ సహా రిలీజ్ చేయబోతున్నారు… దానికోసమే లేటవుతోంది…
Ads
ఈ ఫస్ట్ సింగిల్‌ను భిన్నంగా చిన్న చిన్న గ్రాఫిక్స్, సమంత ఫోటో ఫోజులతో అందంగా ప్రజెంట్ చేశారు… పాటలో ‘చూలు దాల్చిందని’ వంటి పదాలు అక్కడక్కడా కాస్త నవ్వు పుట్టించినా సరే, స్థూలంగా పాటను సరళమైన, లలితమైన పదాలతో నింపాడు చైతన్య ప్రసాద్… కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఛాయల్లోనే ప్రయాణిస్తుంది పాట… మరి సినిమా ఒరిజినల్ కథ అదే కదా…
గాంధర్వ వివాహమాడి, సరాగాలాడి, మళ్ళీ వస్తానని వెళ్లిపోయిన దుష్యంతుడు ఎంతకూ రాడు… అతని కోసం ఈ ఆశ్రమవాసి నిరీక్షణ… ఆ భావనల్ని అలతి పదాల్లో పొదగడమే ఈ పాట పొందిక… ఏదో ప్రాస కోసం ప్రయాసపడినా సరే, బాగానే ఉంది… మల్లికా, నా ఏలిక, మాలతీ మాలికా, హంసికా, జాగునే సేయకా, రాజుతో రా ఇక, అతనికో కానుక, ఈయనా నేనిక, వలపుకే నేడిక, స్వప్నిక, చైత్రిక, నేత్రిక… ఇలా… స్వప్నిక, చైత్రిక, నేత్రిక శకుంతల చెలికత్తెల పేర్లన్నమాట…
ఓ మేఘమా నువ్వయినా వెళ్లి, నా స్వామిని వేగంగా చేరుమా అని వేడుకుంటుంది… ఓచోట వెలవెలా వెన్నెలై పదప్రయోగం అంత పసందుగా లేదు గానీ, అక్కడే శారదాకాశం అని, అంటే వెన్నెలకాశం అని కవర్ చేసేస్తాడు రచయిత… మంచులో ముంచినా, ఎంత వేధించినా, ఓ రాజా నీ అంశను నాలో వెచ్చగా పొదుగుతున్నా అని చెప్పుకునే శాకుంతల గర్భ వ్యథను భలే అక్షరీకరించాడు…
చెలికత్తెలేమో సీమంతాల వేళలో ఈ హేమంతాలు ఏల..? ఓ నెలబాలా, నెలలు గడిచినవి, కడలి అలలా అలా కదలి… ఐనా కన్నులే వేచెలే, కాయలే కాచెలే అంటుంటారు… తెలుగులో సరైన పదాలు పాటలో ఒదగాలే గానీ అంతకుమించిన ‘రమ్య’మైన గీతం మరొకటి ఎలా ఉంటుంది..? అయిదు భాషల్లోకి తన గొంతులోనే తర్జుమా అయినా సరే…?! దారితప్పిన అనంత శ్రీరాంలు, విరోధాభాసల చంద్రబోస్‌లకు తెలుగు బాట ఇదీ అని చెప్పేలా ఈ పాట… అప్రస్తుతమే అయినా బాగుంది…!!
Share this Article