ఒక పదాన్ని దాని అసలు అర్థం గాకుండా… వ్యంగ్యం కోసమో, విమర్శ కోసమో వేరే అర్థంలో వాడితే… ఫాఫం, ఆ పదాల్ని నిజ అర్థంలో వాడటానికి కూడా భయమేసే పరిస్థితి..! అర్థం కాలేదా..? చెప్పుకుందాం… ఎందుకంటే…? వాటి అర్థాలు తెలిసో తెలియకో గానీ… ఈ తలతిక్క టీవీ షోలు చూసి, యూట్యూబ్ వీడియోలు చూసి, సినిమాలు చూసి… చాలామంది ఈమధ్య, ఆడవాళ్లతో సహా…. పీకినవ్ తీ, తొక్కేమీ కాదు, నీ బొక్క, తొక్కాతోలు… ఇలాంటి పదాలు యథేచ్ఛగా వాడేస్తున్నారు… అంతేకాదు, పైసా వసూల్ అనే సినిమాలో బాలయ్య సాంగ్ గుర్తుందా..? వసూల్, వసూల్, పైసా వసూల్ అని సాగుతూ ఉంటుంది… అందులో తను చేయితో చేసే సైగలు గమనించారా..?
అది ఏ సంభోగక్రియకు సంకేతమే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా… దీన్ని మరీ మరీ పాపులర్ చేసింది ఈటీవీలోని జబర్దస్త్, ఢీ… విచిత్రంగా నిజజీవితంలో కూడా అనేకమంది ఎవరినైనా వెక్కిరించడానికి ఇలాగే చేసిచూపిస్తున్నారు… ఖర్మ,,,
Ads
ఆయా పార్టీల సోషల్ మీడియా విభాగాలు… అంటే భాషా సంస్కారానికి ప్రతీకలు అన్నమాట… కొందరైతే బూతుల్ని యథేచ్ఛగా ప్రయోగిస్తారు… వాళ్ల నోటికి ఎంతొస్తే అంత… వాళ్ల అమ్మల దగ్గరో, అక్కల దగ్గరో నేర్చుకున్న సంస్కారాన్ని, పుట్టుకతో సంపాదించుకున్న మర్యాదను ఎంచక్కా ట్రోలింగు కోసం వాడి, తమ జన్మల్ని ధన్యం చేసుకుంటూ ఉంటారు… కొందరు మాత్రం బూతులపై బట్టలు కప్పి… అనగా చెప్పుల్ని తువ్వాలలో దాచి కొట్టినట్టుగా…. మింగు, గువ్వ, మొగ్గ వంటి పదాల్ని వాడుతుంటారు…
ఈ పదాలకు అర్థం తెలిసింది కదా… అలాంటి పదాలు చాలా వాడుతున్నారు… మనం మాత్రం ఇక్కడే ఆపేద్దాం… ఇక్కడ సమస్య ఏమిటంటే..? ఈ పదాల్ని నిజ అర్థంలో వాడటానికి ఈమధ్య ఇబ్బంది ఎదురవుతోంది… ప్చ్.., పదాల్ని భ్రష్టుపట్టించడం అంటే ఏమిటో అర్థం అవుతోంది ఈమధ్యే… సేమ్, ఇలాంటిదే పత్తాపారం… పత్తి యాపారం… దీన్ని కూడా ‘‘ఆ క్రియ’’ లేదా ‘‘ఆ వ్యాపారం’’ అనే అర్థంలోనే వాడుతున్నారు…
పులిహోర కలపడం అంటే లైనేయడం అట… పడేయడం అట… సంబంధాలు నెరపడం అట… ఎంత దుర్మార్గమైన అర్థానికి తీసుకొచ్చేశారు… థూమీబచె… గుళ్ల వద్దకు వెళ్లినా సరే, పులిహోర ప్రస్తావన తీసుకురావడానికీ ఇబ్బంది… ఇంట్లో పులిహోర కలుపుతున్నప్పుడూ అదే సమస్య,…
నిజానికి ఇలా పదాలు అర్థాలో కోల్పోవడం ఇప్పుడే కాదు… మీడియాయే ఈ దుర్మార్గానికి కారణం… కుంభకోణం, శఠగోపం పెట్టడం, స్వాహా చేయడం, తీర్థం పుచ్చుకోవడం వంటి పదాల్ని కూడా భ్రష్టుపట్టించారు… ఇప్పుడు వాటి అసలు అర్థాలు కూడా ఎవరికీ తెలియవు, ఆ అర్థాల్లో వాడరు… మరిచేపోయాను… ఈమధ్య తిట్ల ట్రెండ్ కూడా సేమ్ ఇలాగే… మాదాపూర్, లక్డీకాపూల్, లంగర్ హౌజ్, పంజాగుట్ట పదాల్ని కూడా తిట్లకు వాడుతున్నారు… వాటిల్లో ఏ దారుణమైన తిట్టుకు ఏ ప్రాంతం పేరు వాడుతున్నారో మీరే మీ బూతుసామర్థ్యాన్ని బట్టి ఊహించుకొండి…!!
Share this Article