హిందూ బంధుగణానికి ఓ ప్రశ్న… సినిమా నటి అమలా పాల్‌ను ఓ గుడిలోకి రానివ్వకపోవడం కరెక్టేనా..? కేరళలోని తిరువైరానిక్కుళం మహదేవ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్లగా… అక్కడి అర్చకులు, ఆలయ కమిటీ, సిబ్బంది అడ్డుకున్నారు… అన్యమతస్తులకు ప్రవేశం లేదని తేల్చి చెప్పారు… మహాదేవ ఆలయంలోకి హిందువులకు మాత్రమే ప్రవేశం ఉందని తేల్చి చెప్పారు… ఆలయం ఎదురుగా ఉన్న అమ్మవారిని దర్శించుకోవచ్చని సూచించారు… విధి లేక ఆమె అలాగే చేసింది… ఇదీ వార్త…
ప్రశ్న ఏమిటంటే..? ఆమె ప్రవేశాన్ని ఆలయ ఆచారాలు, ఆది నుంచీ కొనసాగుతున్న ఆనవాయితీలు అడ్డుకుంటాయి… ఆ మాట నిజమే… కానీ సడలిస్తే తప్పేమిటి..? తిరుమల వంటి అత్యంత ధనిక హిందూ దేవాలయంలో అన్యమతస్థులు బోలెడు మంది భక్తధనాన్ని ఎంజాయ్ చేస్తుంటారు… మతప్రచారం సరేసరి… కానీ అమలా పాల్ ఆ గుడికి మతప్రచారం కోసం వెళ్లలేదు… కొలువు కోసం కాదు… మహాదేవుడి దర్శనం కోసం వెళ్లింది…
అమలా పాల్ అనగానే అదేదో సినిమాలో ఆమె బరిబాతల నటించిన సీన్లే గుర్తొస్తాయి… కానీ ఆమె స్ట్రగుల్ తెలియదు చాలామందికి… అమలా పాల్ మహాదేవుడి మీద విశ్వాసంతో, భక్తితోనే అక్కడికి వెళ్లింది కదా… జన్మతః క్రిస్టియన్ అయినందున ఆమె ప్రవేశం అభ్యంతకరమా..? మరి రోజూ అయ్యప్పను పూజించే జేసుదాసు హరివరాసనం పాట నేపథ్యం ఏమిటి..? సో, ప్రతి నిర్ణయం వెనుక ఓ విచక్షణ అవసరం… తప్పేమిటి..? ఆమె అన్యమతస్తురాలే కావచ్చుగాక, దైవదర్శనం కోసం వస్తే తప్పేమిటి..? ఇందులో హిందూ మతం పట్ల గానీ, ఆ మహదేవుడి పట్ల అగౌరవమో, అపచారమో గానీ లేవు కదా… ఆమె హిందూ దేవుళ్ల పూజలు కూడా చేస్తుంటుంది…
Ads
ఆమె మొదటి పెళ్లి రెండేళ్లకే ఆమెకు చేదు అనుభవాల్ని మిగిల్చింది… విడాకులు ఇచ్చింది… మనసు భగ్నమైంది… ఓ దశలో సన్యాసం తీసుకుని హిమాలయాలకు వెళ్లడానికి రెడీ అయ్యింది… తరువాత కుటుంబసభ్యుల ఒత్తిడి మేరకు ఆ ఆలోచన మార్చుకుని, పుదుచ్చేరిలోని అరావిల్లే గ్రామం చేరుకుంది… తనలోకం తనదే… యోగ సాధనలో మునిగిపోయేది… తనేమిటో తెలుసుకునేందుకు తన లోలోపలకు తనే వెళ్తూ అన్వేషణ సాగించింది… ఒక్క ముక్కలో చెప్పాలంటే ఓ సన్యాసినిలా గడిపింది…
ఈరోజుకూ ఆమెకు యోగ ప్రధాన వ్యాపకం… సినిమాలు ఓ వృత్తి, పాత్ర నచ్చితే చేస్తుంది, లేకపోతే లేదు… చాలా చాలా మందితో పోలిస్తే అమలా పాల్ చాలా బెటర్ పర్సనాలిటీ… ఆమె గుడి సందర్శన నిజంగానే భక్తిపూర్వకం… ఆమె తత్వం తెలిసినవాళ్లు ఎవరైనా చెబుతారు… ఆత్మ అన్వేషణలో ఆమెకు దేవుడు కావాలి… ఏ మతం దేవుడైనా సరే… అంతేతప్ప, వరాలు, అనుగ్రహాలు కావు…
ఆత్మచింతనతో ఎవరైనా పరమాత్మ సన్నిధిలోకి వస్తే ఎవరైనా ఎందుకు అడ్డుకోవాలి..? ఆమె సందర్శనలో దుర్బుద్ధి గానీ, దురుద్దేశం గానీ లేనప్పుడు, ఆ దేవుడి దర్శనాన్ని అనుమతిస్తే తప్పేమిటి..? ఈ కోణంలో చర్చ ఎందుకు జరగకూడదు… ఆగమం, ఆచారం తెలియని ఏ కోర్టో రుతుస్రావ మహిళల్ని అనుమతించే తీర్పులకన్నా… ఏ గుడికాగుడి స్వీయ సమీక్ష చేసుకుంటే తప్పేమిటి..? ఇదొక అభిప్రాయం కాదు… ఇదొక ప్రశ్న… సమాధానం అన్వేషణలో…!!
Share this Article