అధికారంలో ఉన్నాం కదా, బోలెడు మార్గాల నుంచి డబ్బు వస్తుంది… సాక్షికి నాలుగు పైసలు పడేస్తే చాలు…… ఇలా అనుకుంటే చివరకు పుట్టి మునిగిపోతుంది… మార్కెట్‌ను బట్టి ఆ దుకాణం నిర్వహణ ఉండాలి…… నష్టాలు నషాళానికి అంటితే తప్ప జగన్‌కు ఈ తత్వం బోధపడలేదు… దాంతో హడావుడిగా ఈనాడు బాట పట్టాడు… నిజం… తెలుగు పత్రికలన్నింటికీ ఈరోజుకూ ఈనాడే మార్గదర్శి… అవలక్షణాలకు, కాసిన్ని మంచి లక్షణాలకు కూడా…!
అందరికీ తెలిసిందే కదా, పత్రికా పరిశ్రమ సంక్షోభంలో ఉందని…! ‘‘గతంలో పత్రికను కాగితంపై ముద్రించి, తెల్లారేసరికి వాకిళ్లలో వేసేవారట గురూ’’ అని ఆశ్చర్యంగా చెప్పుకునే రోజులు తప్పకుండా వస్తాయి… నిజం చెప్పాలంటే ప్రస్తుతం చాలా చిన్న పత్రికలు కేవలం ఈ-పేపర్లను మాత్రమే పబ్లిష్ చేస్తున్నాయి… కొన్నేమో జిల్లాలు, డివిజన్లకు ఫ్రాంచైజీలు అమ్ముకుని, అంటే తమ బ్రాండ్ పేరు వాడుకునేలా… వాట్సప్ ఎడిషన్లు రిలీజ్ చేస్తున్నాయి… అదీ ప్రింట్ మీడియా దురవస్థ…
ఏబీసీ, ఐఆర్ఎస్ లెక్కలన్నీ ఇకపై బోగస్… పెద్ద పెద్ద పత్రికలే దుకాణాలు మూసుకుంటున్నాయి… డిజిటల్ ఎడిషన్లు చాలు అనుకుంటున్నాయి… మన పత్రికలు కూడా గతంలో ఉన్న ప్రింట్ ఆర్డర్లో చాలామేరకు తగ్గించుకున్నయ్… ప్రింటింగ్ కాస్ట్ అంతగా పెరిగిపోయింది… ఈ స్థితిలో ఒక్క సాక్షివాడు ఇన్ని పేజీలు ఎలా ప్రింట్ చేశాడు ఇన్నాళ్లూ…? నష్టాల్ని భరిస్తూ ప్రింట్ చేశాడు… ఇప్పుడు కళ్లు తెరుచుకున్నయ్, ఈనాడు తొవ్వతొక్కాడు… ఎలాగంటే..?
Ads
ప్రింటింగ్ కాస్ట్ పెరుగుతుండేసరికి ఈనాడు తెలివిగా ఏం చేసిందంటే..? ప్రింట్ ఎడిషన్‌ను 12 లేదా 14 పేజీలకు కుదించేసుకుంది… యాడ్స్ ను బట్టి పేజీల సంఖ్య… ఆరు పేజీలను డిజిటల్ ఎడిషన్‌లో మాత్రమే పెడుతుంది… అవసరమైతే మరో ఆరు పేజీలకూ రెడీ, కంటెంటు నింపేయడమే కదా… ప్రతిభ, నేషనల్, రీజనల్, సినిమా, స్పెషల్ పేజీ ఎట్సెట్రా అన్నీ డిజిటల్ ఎడిషన్ మాత్రమే…
ఆంధ్రజ్యోతికి ఇవన్నీ డొంక తిరుగుళ్లు ఉండవ్… స్ట్రెయిట్… పది లేదా పన్నెండు పేజీలు… ప్రింట్ అంతే, డిజిటల్ ఎడిషన్ కూడా అంతే… ఆటలు, సినిమా, నేషనల్, ఎడ్యుకేషన్, బిజినెస్ గట్రా అన్ని రకాల వార్తలూ అందులోనే వచ్చేలా చూస్తారు, మంచి స్ట్రాటజీ… కానీ సాక్షి అలా కాదు కదా… మొదట్లో ఎచ్చులకు పోయింది… తలబొప్పి కట్టింది… వెంటనే ఈనాడు తరహాలోనే ప్రింట్ కట్ చేసుకుని, డిజిటల్ ఎడిషన్ పెంచేసింది… ఎలాగంటే..?
సేమ్, ఈనాడు తరహాలోనే 10 లేదా 12 పేజీల ప్రింట్ ఎడిషన్… ఇక మిగతావి సాక్షి ప్లస్ అనే డిజిటల్ ఎడిషన్‌లోకి తోసేశారు… నేషనల్ రెండు పేజీల్లో ఒకటి, బిజినెస్ రెండు పేజీల్లో ఒకటి, స్టేట్ న్యూస్ రెండు పేజీల్లో ఒకటి, రాష్ట్రానికొకటి, కొలువుల రెండు పేజీల్లో ఒకటి, సినిమా పేజీ, స్పిరిట్యుయల్ పేజీ… ఒక్క ముక్కలో చెప్పాలంటే ఫ్యామిలీ పేజీనే కాస్త ఎక్స్టెండెడ్ డిజిటల్ వెర్షన్‌గా మార్చారు… వేరే కొత్త ప్లస్ ఏమీ లేదు… అంత నాణ్యత కూడా లేదు… ఏదో తోచిన కంటెంట్ నింపేశారు…
ప్రొఫెషనల్ కోణంలో చెప్పుకుందాం… వంద వార్తలు, వంద ఆర్టికల్స్ వస్తాయి… స్పేస్ తక్కువ… అందులో నిజంగా జనానికి అవసరమైనవి, ఇంట్రస్టింగు, సీరియస్‌నెస్, టైమింగు, ట్రెండింగు, తమ సెల్ఫ్ సెంట్రిక్ గట్రా అన్నీ తూకం వేసుకుని, ఏవి పబ్లిష్ చేయాలనే నిర్ణయానికి రావడం మొనగాడి లక్షణం ఫీల్డులో……. వచ్చిన కంటెంటంతా డిజిటల్ ఎడిషనే కదా, మొత్తం పేజీల్లో పెట్టేసి, ఆ పేజీల్ని నెట్లో పెట్టేస్తే సరి అనుకుంటే అది పక్కా అన్ ప్రొఫెషనల్… ఇంకా రాబోయే రోజుల్లో చూడండి… 6 లేదా 8 పేజీల్లోనే అవసరమున్న వార్తల్ని పబ్లిష్ చేసుకోవాల్సిన రోజులు వస్తాయి… ఇప్పటికే ప్రజాశక్తి వంటివి కేవలం ఆరు పేజలతోనే నెట్టుకొస్తున్నాయి… తప్పదు… తక్కువ స్పేసులో ఎక్కువ వార్తల్ని ఎలా ప్రజెంట్ చేయాలో శిక్షణ ఇవ్వండి సార్… ఈ డిజిటల్ ప్లస్సులూ గట్రా దేనికి..? ఆంధ్రజ్యోతికి చేతనైన విద్య సాక్షికి, ఈనాడుకు ఎందుకు చేతకాదు..?!
Share this Article