కురుక్షేత్రం ముగిసింది… అంత్యక్రియలన్నీ పూర్తయ్యాయి… కృష్ణుడు ఇక హస్తినాపురిని వదిలేసి తన ద్వారక వైపు బయల్దేరాడు… అక్కడ చక్కదిద్దుకోవాల్సిన పనులు బోలెడు… బలరాముడు వైరాగ్యంలో పడ్డాడు… లక్షల సైన్యం కౌరవుల వైపు పోరాడి హతమైపోయింది… ఆలోచిస్తూ వెళ్తుంటే ఓ బ్రాహ్మణుడు కనిపించాడు తనకు… తన పేరు ఉతంగుడు… తనకు పాత మిత్రుడే… రథం దిగి నమస్కరించాడు…
ఉతంగుడు ఒకింత చపలచిత్తుడు… కృష్ణుడికి ప్రత్యభివాదం చేసి, కుశలం అడిగాడు… ‘‘మీ కౌరవులు, మీ పాండవుల మధ్య విద్వేషాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయా..? కలిసి ఉంటున్నారా..?’’ అని ప్రశ్నించాడు… కృష్ణుడు మొదట నిర్ఘాంతపోయాడు… కానీ ఉతంగుడు చాన్నాళ్లుగా తపస్సు కోసం ఎక్కడికో దూరప్రాంతాలకు వెళ్లాడనీ, వర్తమాన వ్యవహారాలు ఏమీ తెలియవనీ గుర్తిస్తాడు… సంక్షిప్తంగా జరిగిందేమిటో వివరిస్తాడు…
అది వింటూనే ఉతంగుడి కళ్లు ఎర్రబడ్డాయి… ‘‘శాంతి కోసం, ధర్మపరిరక్షణ కోసం జన్మించిన అవతార పురుషుడివి అని అందరూ నిన్ను కీర్తిస్తారు… కానీ ఇదేమిటి..? జరిగిందేమిటి..? నువ్వు దగ్గరుండీ యుద్ధాన్ని నివారించలేకపోయావు… నీ జన్మ సంకల్పమే విఫలమైంది… నువ్వు చెబితే విననివాళ్లు ఎవరు..? నీ వైఫల్యానికి నువ్వు ఓ శాపానికి అర్హుడివి’’ అని ఆగ్రహిస్తాడు…
Ads
కృష్ణుడు వెంటనే ఆ బ్రాహ్మణుడి చేతులు పట్టుకుని ‘‘మిత్రమా, తొందరపడి శపించకు… నేను చెప్పేది సావధానుడివై విను, తరువాత నీ ఇష్టం’’ అంటాడు… ముందుగా నా అసలు రూపం చూడు అని తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు… ‘‘ధర్మపరిరక్షణ కోసం నేను ఏ జాతి దేహంలో పుడితే ఆ జాతి లక్షణ పరిమితుల్లోనే వ్యవహరిస్తాను… మనిషిగా పుట్టాను… మనిషిగానే కురుపాండవులకు చెప్పి చూశాను… యుద్ధ, అధికార కాంక్షలో పాండవులు… అధికార మైకంలో కౌరవులు… ఎవరూ వినలేదు…
నేను చెప్పేది భయానికో, భక్తికో వినాలని నిండు సభలో విశ్వరూపాన్ని ప్రదర్శించాను… ఐనా ఫలితం లేదు… నన్నేం చేయమంటావు..? వాళ్ల ఖర్మ వాళ్లు అనుభవించారు…’’ అని చెబుతూ పోయాడు… అప్పటికే ప్రసన్నచిత్తుడైన ఉతంగుడు కృష్ణుడికి సాగిలబడతాడు… తొందరపడ్డాను, క్షమించు అంటాడు… సరే, ఒక వరం కోరుకో మిత్రమా అంటాడు కృష్ణుడు… నీ విశ్వరూప సందర్శనతో జన్మ ధన్యమైంది, ఇంకేం కోరుకోవాలి నేను’’ అంటాడు ఉతంగుడు… కానీ కృష్ణుడి ఒత్తిడి మేరకు తప్పనిసరై… ‘‘సరే, కృష్ణా, నేను దప్పికగొన్న వేళ నాకు నీరు దొరికేలా చేయి, చాలు’’ అనడుగుతాడు…
కృష్ణుడు తథాస్తు అని చెప్పేసి, రథాన్ని ద్వారక వైపు నడిపించుకుని వెళ్లిపోతాడు… తరువాత ఓరోజు ఓ సుదీర్ఘ యాత్రలో ఉన్న ఉతంగుడు ఓ ఎడారిలో చిక్కుకుంటాడు… నోరు తడారిపోతోంది… దప్పిక… ఎటుచూసినా నీటి జాడలేదు… వరం గుర్తొచ్చింది, కళ్లు మూసుకుని ధ్యానించాడు… కృష్ణుడు రాలేదు, నీరూ కనిపించలేదు… కృష్ణుడు మోసగించాడు తనను అనే భావన పెరిగిపోతోంది… ఈలోపు ఓ ఎరుకల యువకుడు అటువైపు వచ్చాడు…
వెంట అయిదు ఎడారి వేటకుక్కలు… భుజంపై ఏవో జంతువుల తోళ్లు… ‘‘ఏం స్వామీ, దాహమేస్తోందా..? సమీపంలో ఎక్కడా నీళ్లు దొరకవు నీకు, ఇదుగో ఈ నీరు తాగి కాస్త తేటపడు’’ అని తన దగ్గరున్న తోలు తిత్తిని ఇవ్వబోతాడు… కానీ ఉతంగుడు తిరస్కరిస్తాడు… సదరు ఎరుకల యువకుడు నాలుగుసార్లు అడిగీ అడిగీ, ఇక జాలిగా చూస్తూ తన దారిన తను వెళ్లిపోతాడు… కాసేపటికి కృష్ణుడు ప్రత్యక్షమవుతాడు… ఉతంగుడు కోపంగా ‘‘వరమిచ్చాను అన్నావు, దాహమైనవేళ నీ జాడలేదు, నీటిజాడలేదు’’ అని నిష్ఠురమాడతాడు…
‘‘ఉతుంగా, దీన్నే కర్మ అంటారు… నీ దగ్గరకొచ్చింది ఎరుకుల యువకుడు కాదు, ఆ వేషంలో ఇంద్రుడు వచ్చాడు, ఆ తోలు తిత్తిలో ఉన్నది అమృతం… కానీ ప్రాణాపాయవేళ సైతం నువ్వు కులాహంకారంతో గుడ్డివాడివైనావు… ఒక అస్పృశ్యుడిచ్చే నీటిని తాగడానికి తిరస్కరించావు… ప్రాణాపయవేళ ఏం చేసినా తప్పులేదనే కనీసజ్ఞానాన్ని కూడా నీ తపస్సు నీకు ప్రసాదించలేకపోయింది…’’ అంటాడు కృష్ణుడు… ప్రశ్నార్థకంగా మొహం పెట్టిన ఉతంగుడికి కృష్ణుడు ఇలా వివరిస్తాడు…
‘‘నీ వరం గుర్తుంది… నువ్వు తలుచుకోగానే ఇంద్రుడిని అడిగాను, నా మిత్రుడికి కాస్త అమృతం పోసి ఆదుకోవయ్యా అని కోరాను… ఇంద్రుడు నిరాకరించాడు… మనుషులకు అమృతం పోస్తే అమరులవుతారు, అమృతం కేవలం అమరులకే, అన్యులకు కాదు అన్నాడు… కానీ నన్ను కాదనలేక… ‘‘ఓ చిన్న పరీక్ష పెడతాను, అందులో నీ మిత్రుడు నెగ్గితే అమృతం పోస్తాను’’ అంటూ ఎరుకల యువకుడి వేషంలో నీ దగ్గరకు వచ్చాడు… కానీ నువ్వు ఓడిపోయావు… అంతేకాదు, ఇంద్రుడి వద్ద నేనూ ఓడిపోయేలా చేశావు…
నిజానికి నువ్వున్న స్థితిలో నీరే అమృతం… కానీ అమృతమే నీటిలా నీదగ్గరకొచ్చింది… కానీ నీ కులం ఎరుకలో పడి, నువ్వు ఆ ఎరుకల యువకుడిచ్చిన నీటిని కాదన్నావు… ఇది అహంకారమే కాదు, అజ్ఙానం కూడా… అందుకే అమృతపానానికీ అనర్హుడివయ్యావు… దీన్నే కర్మ అంటారు… కురుపాండవులు నువ్వు చెప్పినా ఎందుకు వినలేదు అని ఆనాడు నన్నడిగావు కదా, ఇదుగో ఇలాగే… ఒకటి జరగాలని రాసిపెట్టి ఉన్నాక, దేవుడు చెప్పినా వినరు, వినిపించుకోరు, ఇంద్రుడే వచ్చి ఎదుట నిలబడినా గుర్తించరు’’ అని ఆక్షేపించాడు… మాయమైపోయాడు…
.
(కథలో నీతి ఏమిటంటే… విధి దేవుడికన్నా బలమైంది… కులాహంకారం మనిషిని జ్ఞానశూన్యుడిని చేస్తుంది… ఇది సి.రాజగోపాలాచారి రాసిన మహాభారతంలోని ఓ ఖండిక… బాష్యం ఇక మీ ఇష్టం… భారతం ఓ ఊట… తవ్వుతూ పోతే ఇలాంటి పాత్రలెన్నో పలకరిస్తాయి… కొత్త సంగతులెన్నో పరిచయం చేస్తాయి…)
Share this Article