అయ్యో అయ్యో, కథ ముందే తెలిస్తే ఇంకేమైనా ఉందా..? థ్రిల్ ఉండదు కదా, సస్పెన్స్ ఉండదు కదా… అని నిర్మాతలు, దర్శకులు, హీరోలు భలే కంగారుపడిపోతుంటారు….. కానీ దమ్మున్న దర్శకుడైతే ముందే కథ చెబుతాడు, లేదా సినిమాలోనే ముగింపుతోనే కథ ప్రారంభిస్తాడు… తను కథ చెప్పబోయే తీరు మీద కాన్ఫిడెన్స్ అన్నమాట… కాంతార దర్శకుడు రిషబ్ శెట్టికి కూడా ఆ నమ్మకం ఉంది… అందుకే తీయబోయే కాంతార-2 కథ ముందే చెప్పేశాడు…
అందరూ అనుకున్నట్టు ఇది కాంతార ఫస్ట్ పార్ట్‌కు సీక్వెల్ కాదు… ప్రిక్వెల్… అంటే కాంతార కథకు ముందు ఏం జరిగిందో చెప్పడం… మీకు తెలుసు కదా… కాంతారలో హీరో తండ్రి కూడా అడవుల్లో అర్థంతరంగా మాయమైపోతాడు… మరి ఆ కథేమిటి..? ఒక ప్రాంతంలోని పిచ్చి రాజుకు… తన భూములు, గ్రామాలు, ప్రజల రక్షణ కోసం అటవీ దేవతతో ఒప్పందం ఉంటుంది… కానీ తరువాత పరిస్థితులు ఉల్టా మారిపోతాయి… ఆ తరువాత సదరు పిచ్చి రాజుకూ ప్రకృతికీ నడుమ జరిగే పోరాటమే ఈ ప్రిక్వెల్… పరిస్థితులు ఎలా మారాయో, అసలు ఆ ఒప్పందం ఏమిటో, చివరకు ఏం జరుగుతుందో రిషబ్ శెట్టి సినిమాలో చెబుతాడు…
నిజానికి ఇదే కథ ఉండాలనేమీ లేదు… ఎందుకంటే, రఫ్‌గా ఇదీ నిర్మాత, దర్శకుడు అనుకున్న బేసిక్ లైన్ ఇది… ఇక కథకు తగిన ఇన్‌పుట్స్ కోసం, స్టడీ కోసం, పరిశీలన కోసం రిషబ్ శెట్టి అప్పుడే ఉత్తర కర్నాటకలోని అడవుల్లోకి వెళ్లిపోయాడు… ఆదివాసీలతో ఇంటరాక్ట్ అవుతూ, తన కథకు మరిన్ని బిగువైన ట్విస్టులు, కంటెంట్ కోసం ప్రయత్నిస్తాడు… బాగుంది… ఏదో దిక్కుమాలిన ప్లాట్ అనుకుని, లేదా హీరో ఇమేజీ బిల్డప్, ఎలివేషన్ సీన్లు ముందే ఊహించుకుని, వాటికి తగిన పిచ్చి కథను రాయడం కదా ఇప్పుడు మన పాపులర్, పెద్ద హీరోల ట్రెండ్… వాళ్లు రిషబ్ శెట్టిని చూసి ఏం నేర్చుకోవాలి..?!
Ads
కాంతార సినిమాతో ఇబ్బడిముబ్బడిగా డబ్బు వచ్చిపడింది హొంబలె ఫిలిమ్స్ నిర్మాతలకు… 16 కోట్లు పెడితే 400 కోట్లు వచ్చాయి… సో, ఈసారి ప్రిక్వెల్ బడ్జెట్‌కు నో లిమిటేషన్స్… అలాగని రిషబ్ ఇష్టారాజ్యంగా వృథా చేసేరకం కూడా కాదు… కాకపోతే ఈసారి కాస్త పేరున్న పెద్ద నటులను తీసుకోవాలని ప్లాన్… అయితే పెద్ద నటుల్ని తీసుకుంటే తను డిమ్ అయిపోతాడు కాబట్టి బహుశా తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చు… అలాగే ఆదివాసీలతో మాట్లాడాక, తన రెండు నెలల కసరత్తు పూర్తయ్యాక కథ కూడా మారిపోవచ్చు…
అడవుల్లో పచ్చదనం, వర్షాలు ఉన్నప్పుడు సీన్లు కూడా అద్భుతంగా కనిపిస్తాయి.,. అందుకని వచ్చే వర్షాకాలం ఆరంభమయ్య సమయానికి ఈ షూటింగ్ మొదలుపెడతారు… నిజానికి కాంతార సినిమా తీసినప్పుడు అదొక చిన్న సినిమా… కేవలం రిషబ్ పెట్టిన మొహమాటానికి హొంబలె ఫిలిమ్స్ వాళ్లు ఆ డబ్బు సమకూర్చారు… కానీ అనుకోని సక్సెస్‌తో దాన్ని ఇతర భాషల్లోకి కూడా డబ్ చేసి, డబ్బు ప్రింట్ చేసుకున్నారు… ఇప్పుడు కాంతార ప్రిక్వెల్‌ను నేరుగా పాన్ ఇండియా లైన్‌లో నిర్మించబోతున్నారు..!
కానీ ఇక్కడ ఓ చిన్న చిక్కు… కాంతార భారీ సక్సెస్‌తో రాబోయే ప్రిక్వెల్ మీద భారీ అంచనాలున్నాయి… కాంతార ఫస్ట్ పార్ట్ తీసినప్పుడు మీడియా కూడా పెద్దగా పట్టించుకోలేదు… హైప్ క్రియేట్ కాలేదు… కానీ ఇప్పుడు ముందు నుంచే హైప్ క్రియేటవుతుంది… ఆమేరకు సినిమా క్వాలిటీ బాగుంటే వోకే… కానీ కాంతార ఫస్ట్ పార్ట్‌కు ఏమాత్రం తగ్గినా అడ్డగోలు రివర్స్ దెబ్బ పడే ప్రమాదముంది… ఎందుకంటే, కాంతార ఫస్ట్ పార్ట్‌కు ప్రాణం క్లైమాక్స్, వరాహరూపం పాట… ప్రిక్వెల్‌లో కూడా అలా అన్నీ కుదరాలి కదా…!!
Share this Article