“చెట్టునురా -చెలిమినిరా
తరువునురా – తల్లినిరా
నరికివేయబోకురా
కరువు కోరుకోకురా
అమ్మనురా అమ్మకురా
కొడుకువురా కొట్టకురా
—-
నేలతల్లి గుండెలో విత్తనాల గొంతులో పసిపెదవుల నా గీతం ప్రకృతికి సుప్రభాతం
మీకు నచ్చలేదటరా పచ్చనాకు సంగీతం
—–
చంటిపాప కాళ్లతో ఎదపై తన్నినా
దీవెనగా తల్లి ఆనందాశ్రులు రాల్చినట్లు
రాళ్లను విసరే మీకు పళ్ళను అందిస్తున్నా
—–
పనికిరాని గాలిని ప్రాణవాయువొనరించి
కాలుష్యం నుండి మిమ్ము కాపాడాలి
మా పుట్టుక నుండి మీపైనే కద జాలి
—–
Ads
సూర్యరశ్మి బువ్వగా లవణాలే పాలుగా
కలిపి ఉగ్గుపాలపిండి తిండి చేసినానురా
కడుపునింపు మాతకు కడుపుకోత పెట్టకు
—–
చనిపోయిన మనుషులకై మమ్ము నరికి చితి పేర్చి తగలేసే నాగరికత మీది
బతుకంటే త్యాగమనే బాధ్యత మాది
——
మా తనువులు తెంచినా వేళ్ళు భూమిలో మిగుల్చు
మళ్ళీ మీకోసం చిగురించు దారి ఉంచు
పెకలించాలంటే మొదట పది చెట్లను పెంచు”
—————-
సుద్దాల అశోక్ తేజ సినిమా పాటల రచయిత కాబట్టి పరిచయం అక్కర్లేదు . అయితే ఈ చెట్టు పాడే పాట సినిమా పాట కాదు . సినిమాల్లో వాడలేదు. అయినా, సినిమా ఇంత వాస్తవికతను, సందేశాన్ని సహించదు. సహించాలని కోరుకోకూడదు. దాని మర్యాదలు దానివి… కొట్టు కొట్టు చెట్టే కొట్టు చెట్టు చెట్టు పట్టే కొట్టు -లాంటి ప్రాసల ప్రయాసల ప్రయత్నాలకు సినిమా ఊగిపోతుంది. దాని బలం, బలహీనత అది. ఆ చర్చ మనకనవసరం.
ఇది సుద్దాల ప్రైవేట్ సాంగ్. అక్కడక్కడా ప్రకృతి ప్రేమికులయిన భాషా ప్రేమికుల నోళ్ళలో మాత్రమే నానుతున్న పాట. ఇంకా బాగా ప్రచారం కావాల్సిన పాట.
—————
సరళమయినభాషలో అందరికీ అర్థమయ్యేలా రాశారు కాబట్టి నిజానికి విశ్లేషణ అనవసరం .
చెట్టును, చెలిమిని, తల్లిని. మీరు నా పిల్లలు. నన్ను కొట్టకండి. కొట్టి కట్టెలుగా అమ్మకండి. నేలతల్లి గుండెలో నుండి విత్తనం గొంతుకతో ప్రకృతి సుప్రభాతగీతం పాడుతూ పసిపెదవులతో నేను మోసులెత్తుతాను. కొమ్మలు రెమ్మలు ఊపుతూ నేను పాడే పచ్చనాకు సంగీతం మీకు నచ్చలేదా ?రాళ్లతో నన్ను కొట్టినా నా పిల్లలే కదా అనుకుని పళ్ళను ఇస్తున్నాను. పనికి రాని గాలి పీల్చి మీకేమో ప్రాణవాయువునిస్తున్నాను. కాలుష్యాన్ని తగ్గిస్తూ మా పుట్టుకను మీకోసమే త్యాగం చేశాను. ఎండవేడి తిని, పత్రహరితాన్ని నాకు నేనే తయారు చేసుకుని, వేరు నీరు తాగి మీకు ఫలాలను ఇస్తున్నాను. నేనేమో మీ కడుపు నింపితే, మీరేమో నా కడుపు కోస్తారు. చనిపోయిన వారి చితికి, బతికి ఉన్న మమ్ము చంపే నాగరికత మీది. మీ చావు మా చావుకొచ్చినా భరించే త్యాగం మాది. ఒకవేళ మా శరీరాలను తుంచాలనుకుంటే కనీసం వేళ్లనయినా అలా వదిలెయ్. మళ్ళీ మీకోసమే చిగురిస్తాం. ఒక చెట్టును కొట్టాలంటే ముందు పది చెట్లను పెంచు.
—————–
రుద్రంలో వృక్షేభ్యో – హరికేశేభ్యో అని స్పష్టంగా ఒక మాట ఉంది. చెట్టు , చెట్టు కొమ్మల్లో ఆకుల పత్రహరితం – అంతా శివమయం. ఒక్కో చెట్టు ఒక్కో దేవుడికి స్థానం. ఒకే చెట్టులో శివ కేశవులు ఇద్దరూ కొలువయినవి ఉన్నాయి. చెట్టు లేక పొతే తిండి లేదు, గాలి లేనే లేదు. మనకేమో చెట్టూ పుట్ట లేకుండా ఫ్రెష్ కూరలు, పళ్లు, ఆకులు; ఫ్రెష్ గాలి కావాలి. ఎలా వస్తాయో ? ఎక్కడినుండి వస్తాయో ? నరికేసిన చెట్టు పాడే ఈ పాటను అడగండి – సమాధానం ఇస్తుందేమో ?
చెట్టునై పుట్టి ఉంటే ఏడాదికొక్క వసంతమయినా మిగిలేది- మనిషినై పుట్టి అన్ని వసంతాలు కోల్పోయానన్నాడు గుంటూరు శేషేంద్ర… రాముడు వనవాసానికి వెళుతుంటే అయోధ్యావాసులందరూ సరయూ నది దాకా వెళ్లి వీడ్కోలు ఇచ్చి వచ్చారు. వేళ్ళున్నందుకు కదల్లేక చెట్ల కొమ్మల చేతులు రాముడు వెళ్ళినవైపు తిప్పి విలపించాయన్నాడు వాల్మీకి.
———————————-
ప్రాణమున్న చెట్లకు మేకులు కొడితే దాని గొంతులో గునపం గుచ్చినట్లు. బతికి ఉండగా చిల్లులు పొడిచి రక్తం తాగినట్లు. నోరులేని చెట్టు నోట్లో మట్టి కొట్టినట్లు. నిండు ప్రాణానికి ఉరి వేసినట్లు. పచ్చటి చెట్టు ఆకుపచ్చ ప్రాణాన్ని హరించినట్లు. ప్రాణవాయువును ఇచ్చే ప్రాణప్రదమయిన చెట్టు ఊపిరి తీసేసినట్లు. చెట్లకు మేకులు కొట్టకుండా చైతన్యం కలిగించే ఉద్యమం అంకురించి తీగసాగుతోంది. మొదట మహారాష్ట్ర నాగపూర్ లో మొదలయిన “నెయిల్ ఫ్రీ ట్రీ” తరువాత బాంబే, బెంగళూరు ఇలా శాఖోపశాఖలుగా దేశమంతా విస్తరిస్తోంది. నెయిల్ ఫ్రీ ట్రీ ఉద్యమం మరింత ఏపుగా ఎదిగి మన స్వభావంలో ప్రకృతిగా ఒదగాలని కోరుకుందాం……. By… పమిడికాల్వ మధుసూదన్
Share this Article