ఇప్పుడంతా ఇంట్లోనే… ఇంటికే… థియేటర్ ఇంటికే వచ్చింది… హాస్పిటల్ ఇంటికే వస్తోంది… షాపింగ్ మాల్ ఇంటికే వచ్చేస్తోంది… పనిచేసే ఆఫీసు కూడా ఇంటికే వచ్చి పనిచేయించుకుంటోంది… కేసినోలు, మసాజ్ సెంటర్లు ఎట్సెట్రా ఎట్సెట్రా… ఏదైనా సరే, జస్ట్, మ్యాటర్ ఆఫ్ వన్ క్లిక్… వన్ కాల్… చిన్న కబురు పెడితే చాలు, ప్రపంచమే ఇంటికొస్తోంది… మనీ మ్యాటర్స్… దట్సాల్…
మరి మనిషి మరణిస్తే కాటిదాకా ఎందుకు వెళ్లడం…? కాల్ చేస్తే, వల్లకాడే తరలి రాదెందుకు..? ఇంటి దగ్గరే కాల్చేసి వెళ్లదెందుకు..? ఈ ప్రశ్న ఇక అనవసరం… అదీ వచ్చేసింది… జస్ట్, మీరు ఓ కాల్ చేయడమే… ఫలానా అడ్రెసులో ఓ పీనుగ ఎదురుచూస్తోంది… కాస్త కాల్చేసి వెళ్తే మీ ఫీజు చెల్లించుకుంటాం… జీపీఎస్ లొకేషన్ పెట్టాం, వచ్చేయండి… కాసేపటికి ఇంటి ముందుకే కాటికాపరి వస్తాడు… దహనవాటికే తరలివస్తుంది… దేహాన్ని లోపలకు తోస్తారు… ఒక స్విచ్ ఆన్… కాసేపటికి కాస్త బూడిదను చేతిలో పెట్టి, వెళ్లిపోతుంది… ఆల్‌రెడీ ఫీజు ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేసి ఉంటారు కదా… నోట్లు లెక్కపెట్టుకునే తంతు కూడా అక్కర్లేదు…
పొద్దున గుండెపోటుతో వెళ్లిపోతే… మధ్యాహ్నానికి ఓ మనిషి ఆనవాళ్లు అన్నీ ఖతం… గోడ మీదకు ఒక ఫోటో, దానికి ఓ దండ… ఇప్పుడదీ లేదు కదా… ఆయన ఫోటోలు, వీడియోలు గూగుల్ డ్రైవ్‌లోకి ఓ ఫైల్‌గా ఎక్కించడమే… అదలా పడి ఉంటుంది… ఆశ్చర్యంగా చూడకండి… రాబోయే రోజులు అవే… కాదు, వచ్చేశాయి… ఖననానికీ, సమాధికీ చోటు కావాలి, మనిషిని భౌతికంగా పాతేయాలి… స్మశానవాటికకు మనం వెళ్లాలి… కానీ కాలిపోయేందుకు ఏ కాటికీ పోనక్కర్లేదు…
Ads
కర్నాటకలో సంచార దహనవాటిక ఒకటి ప్రారంభమైంది… అంత్యక్రియలకూ పలుచోట్ల నానా తిప్పలు ఎదురవుతున్నాయి… ఈమధ్య ఒకాయన చనిపోతే, చివరకు ఇంటి పెరట్లోనే దహనసంస్కారం చేయాల్సి వచ్చింది… అదేదో ఇంటి ముందే, ఆవరణలోనే చేస్తే సరిపోదా..? అంత్యక్రియల టెన్షన్లు దేనికి అనుకున్నారు కొందరు… సో, ఈ దహనవాటిక ఆలోచన పుట్టుకొచ్చింది…
బైందూరు నియోజకవర్గం, ముడూరు వ్యవసాయ సహకార సమితే దీనికి ముందుకొచ్చింది… అయిదారు లక్షల ఖర్చు… ఈ సంచార స్మశానానికి కాల్ చేస్తే చాలు, రవాణాతోపాటు కాలేసే ఖర్చులూ వాళ్లే భరిస్తారు… సమయానికి కరెంటు లేకపోతే ఎలా అనే చింత కూడా అక్కర్లేదు, గ్యాస్‌తో కూడా నడుస్తుంది… 10 కిలోల గ్యాస్, సౌ గ్రామ్ కర్పూరం చాలు… కేరళలోని స్టార్ చెయిర్ సంస్థ దీన్ని తయారు చేసిందట… పది మందీ చేరడం, దింపుడు కళ్లం పిలుపులు, కట్టెలు, చితిమంటలు గట్రా ఏమీ ఉండవ్… జస్ట్, ఓ ఫోన్ కాల్… డెడ్ బాడీ చూపించండి, నిమిషాల్లో అస్థికలు తీసేసుకొండి… ఇంతే… అవును మరి… మనమే వెళ్లిపోయాక మనల్ని ఎలా కాలేస్తే మనకేల..?!
హల్లో.., స్వర్గ జర్నీ ఆపరేటర్స్..? నేను అమెరికా నుంచి కాల్ చేస్తున్నాను, ఫలానా అడ్రసులో మా నాన్న శవం ఉంటుంది, దహనం చేసేస్తారా, మీ చార్జెస్ ఆన్లైన్ లో పే చేస్తాను… మేం వచ్చే పరిస్థితి లేదు… ఓహో, అస్థికల నిమజ్జనం ప్యాకేజ్ కూడా ఉందా… సరే, రెండూ ఆర్డర్ తీసుకోండి… వీడియో ఫైల్స్ షేర్ చేయండి… ఖేల్ ఖతం, ఒక మనిషి సైలెంట్ గా డిలీట్ అయిపోయాడు…!!
Share this Article