హీరో ఎంత తోపు అయినా సరే… డాన్సులు ఇరగదీసినా సరే… మ్యూజిక్ కంపోజర్ దునియా ట్యూన్ ఇచ్చినా సరే… సినిమాలో మంచి సందర్భంలో ఆ పాట ఫిట్టయినా సరే… ఆ పాట విస్తృతంగా జనంలోకి వెళ్లాలంటే మంచి కొరియోగ్రఫీ కావాలి… మంచి సింగర్ కావాలి… మంచి రైటర్ కావాలి… పోనీ, ఆ పాటకు అలా బాగా కుదరాలి… ఇది కామన్ సెన్స్…
గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న నాటు నాటు పాట ఆస్కార్ పోటీలో ఉంది… ఏం సాధిస్తుందనేది పక్కన పెడితే… ఆ సినిమా దర్శకుడికి దక్కే ఖ్యాతి మాటెలా ఉన్నా… డాన్సు చేసిన రాంచరణ్, జూనియర్లకు వచ్చే పేరు ఎలా ఉన్నా… కీరవాణి ఒక్కడే ఆ అవార్డు అందుకున్నాడు… మీడియా మొత్తం తననే ఫోకస్ చేసింది… నిజంగా తనొక్కడి మెరిటేనా..?
Ads
కాదు… నిజం చెబితే కొందరికి నచ్చకపోవచ్చుగాక… ఆ పాట రాసింది చంద్రబోస్… నిజానికి ఆ పాట మీద నాకూ అభ్యంతరాలున్నయ్, కానీ గోల్డెన్ గ్లోబ్ దాకా వెళ్లినప్పుడు, పోనీ, వెళ్లేలా నిర్మాతలు చేసుకున్నప్పుడు… ఆ క్రెడిట్‌లో కొంతైనా చంద్రబోస్‌కు దక్కడం న్యాయం… తను బయట ఏవో యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇస్తూ ఓన్ చేసుకునే ప్రయత్నం చేశాడు, చిరంజీవి సన్మానించాడు గానీ సినిమా టీం ముఖ్యుల నుంచి ఆ గుర్తింపు ఏది..?
అంతేకాదు, ఆ పాట పాడిన సింగర్స్ కూడా ప్రధానమే… ఒకరు కాలభైరవ… ఎలాగూ కీరవాణి కొడుకే… తండ్రి ఘనత చూసి ఆనందిస్తున్నాడు… తనకు సరైన ప్రశంస దక్కినా దక్కకపోయినా పెద్దగా పట్టించుకోడు… కానీ మరో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మాటేమిటి..? ఈ అవార్డు విషయంలో తనకు మంచి కవరేజీ వచ్చి ఉంటే, తనకు లైఫ్ లాంగ్ మెమరీలాగా ఉండిపోయేది… కేవలం ట్రాక్ పాడించారట తనతో… తరువాత దాన్నే కంటిన్యూ చేశారు…
ముఖ్యమైన శ్రమ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌ది… తన ప్రయాసే పెద్దది… ఈ పాట షూటింగ్ ఏకంగా 65 రోజులు సాగింది… రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభానికి కొన్నేళ్ల ముందే ఉక్రెయిన్‌లోనే ఈ షూటింగ్ జరిగింది… 2021లో మారిన్ స్కై ప్యాలెస్‌లో షూటింగుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పర్మిషన్ ఇచ్చాడు… తను కూడా స్వతహాగా ఆర్టిస్టు కాబట్టి…
అప్పటికే తమిళం, తెలుగుల్లో 70 సినిమాలు చేసిన అనుభవం ఉన్నా సరే… ఈ పాట కోసం 80 రకాల వేరియెషన్స్ క్రియేట్ చేశాడు రక్షిత్… 18 రీటేకులు తీసుకున్నారు యాక్టర్స్… ఒక నెలలో 97 డాన్స్ మూవ్‌మెంట్స్ రూపొందించడం అంటే మాటలు కాదు… ఇంత కష్టపడిన రక్షిత్‌ది ఓ ట్రాజెడీ స్టోరీ… తండ్రి ఓ వజ్రాల వ్యాపారి… ప్రేమ్ రక్షిత్ ఫ్యామిలీతో విడిపోయి బతుకుతున్నా 1993 ప్రాంతంలో ఆర్థిక కష్టాలు చుట్టుముట్టి ఓ టైలర్ షాపు పెట్టుకున్నాడు…
తండ్రి కూడా డాన్స్ అసిస్టెంటుగా మారాడు… ఒక దశలో రక్షిత్ ఈ డబ్బు సమస్యలు తట్టుకోలేక ఆత్మహత్యకూ సిద్ధపడ్డాడు… ‘ఒరేయ్, ఓ సినిమాలో నీకు ఫుల్ మూవీ కొరియోగ్రఫీ చాన్స్ వచ్చింది, వచ్చెయ్’ అని తండ్రి ఫోన్ చేస్తే, అక్కడి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు… ఇదే రాజమౌళి ఛత్రపతితో గుర్తింపు వచ్చింది, రాజమౌళితో ఆ అనుబంధం అలా కొనసాగింది కూడా…
ఒక్క రాజమౌళి… ఒక్క కీరవాణి… తోడుగా రాంచరణ్, జూనియర్… మరి నిజంగా ఈ పాటకు హీరోలైన చంద్రబోస్, రక్షిత్, రాహుల్‌లకు మీడియా నుంచి సరైన కవరేజీ, సరైన గుర్తింపు వచ్చిందా..? రాలేదు… వీరిలో ఎవరి కులమేంటో తెలియదు గానీ… రాహుల్ మాత్రం నాయీబ్రాహ్మణుడు… బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు తనే చెప్పుకున్నాడు… డౌన్ టు ఎర్త్… ప్యూర్ హైదరాబాదీ… రక్షిత్, చంద్రబోస్ ఏ సామాజికవర్గమో తెలియదు గానీ… చంద్రబోస్ వరంగల్ ప్రాంతీయుడు… కులమో, ప్రాంతమో… ఈ ముగ్గురికీ అన్యాయం మాత్రం జరిగిందనేది నిజం… అంత భారీ టీం శాన్‌ఫ్రాన్సిస్‌కో వెళ్లింది కదా… ఈ ముగ్గురికీ ఆ టీంకు వీళ్లే బరువయ్యారా..? ఆ గ్లోబ్ వేదిక మీద జస్ట్, ఓన్లీ కీరవాణి..? వై..?! కేక్ మొత్తం మీరే తింటారురా భయ్..?!
Share this Article