ఆమాత్రం ఉచ్చంనీచం తెలియదా..? ఎక్కడ ఎలా మాట్లాడాలో కూడా తెలియదా..? నాన్సెన్స్, బాలయ్యకు సంస్కారం లేదా..? అని ఒకటే విమర్శలు చేస్తున్నారు సైట్లలో, మీడియాలో…! అదేమయ్యా అంటే వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్‌లో ‘అక్కినేని తొక్కినేని’ అని చిల్లర వ్యాఖ్యానాలు చేశాడట… నాగార్జున అంటే పడదు కాబట్టి తనను ఉద్దేశించే ఆ తలతిక్క వ్యాఖ్య చేశాడు అంటున్నారు… ఇంకా చాలా దూరం వెళ్లి, రంగారావుకన్నా ఎన్టీయార్ గొప్ప నటుడా..? అక్కినేని ఎన్టీయార్‌కన్నా ఏం తక్కువ..? వరకూ విమర్శలు పెంచేశారు…
నిజమే… బాలయ్యను తప్పుపట్టడమే తప్పు… బాలయ్య అలాగే మాట్లాడతాడు… మెంటల్ కేస్… నిజంగానే ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో, ఎంత పరిపక్వంగా మాట్లాడాలో తెలిస్తే తను బాలయ్య ఎందుకవుతాడు..? తను సరిగ్గా ఉంటే ఏపీకి సీఎం కావల్సినోడు… ఎన్టీయార్ వారసుడు… ఆయనే ఉంటే… అన్న సామెతలాగా… బాలయ్య సక్కనోడయితే బాబు సీఎం అవుతాడు..? అదంతే… అసలు ఆ సినిమాకు సక్సెస్ మీటే శుద్ధదండుగ… ఐనా సక్సెస్ మీట్స్ అంటే వాడు అద్భుతం, వీడు అద్భుతం అని ఒకరినొకరు పొగుడుకోవడమే… అక్కడికి వచ్చేవాళ్లకూ తెలుసు బాలయ్య మాట్లాడే తీరు…
ఐతేనేం, పబ్లిక్కులో ఉన్నప్పుడు కూడా ఎలా, ఏం మాట్లాడాలో తెలియకపోతే ఎలా..? అంతటి ప్రొఫైల్ ఉన్న వ్యక్తి ఇలాగేనా ఉండటం అంటున్నారు కొందరు… తను అలాగే ఉన్నా చూసే ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారుగా… వోట్లేసే జనం వేస్తూనే ఉన్నారుగా… బ్లడ్డు, బ్రీడు, గాడిదగుడ్డు అని పిచ్చి ప్రేలాపనలు ఏంచేసినా చెల్లుబాటు అవుతూనే ఉందిగా… ప్రసంగిస్తే ‘‘మా నాన్నగారు, అప్పట్లో’’ అంటూ సగంసేపు అదే సుత్తి… ఏం జనం వినడం లేదా..? చూడటం లేదా..? అది బాలయ్య మార్క్… అంతే…
Ads
తొక్కినేని దగ్గరకు వద్దాం… అది బాలయ్య తన మార్క్ పిచ్చి మాటల ఫ్లోలో అలా అన్నాడు తప్ప పర్టిక్యులర్‌గా అక్కినేని నాగేశ్వరరావునో, నాగార్జుననో ఉద్దేశించి చేసిన విమర్శల ఏమీలేదు అక్కడ… ఆ వీడియో సరిగ్గా చూస్తే అర్థమవుతుంది… ఎవరో వ్యక్తి షూటింగ్ సెట్‌లో ఉంటే ఏవేవో ముచ్చట్లు వస్తాయి, రంగారావు, అక్కినేని, తొక్కినేని గట్రా అన్నీ మాట్లాడతాడు అని ఆ వ్యక్తిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు… అంతేతప్ప అక్కడ తొక్కినేనిని, సారీ, అక్కినేనిని కించపరిచే సంకల్పం ఏదీ కనిపించలేదు… ఆ ఉద్దేశమే ఉంటే స్ట్రెయిట్‌గానే కామెంట్స్ చేస్తాడు… అదొక ఎడ్డిమాలోకం… ఎన్టీయార్, ఏఎన్నార్, ఎస్వీఆర్ నటనల గురించి కూడా కాదు తను మాట్లాడింది…
ఎస్, బాలయ్యకు నాగార్జునకు టరమ్స్ బాగాలేవు… ఏవో స్పర్థలు ఉండవచ్చు… లోకంలో ఒకరంటే ఒకరు గిట్టని వాళ్లు కోట్లలో ఉంటారు, సో వాట్… వాళ్లూవాళ్లూ ఒకటే, రేప్పొద్దున అవసరమైతే ప్లాస్టిక్ ఆప్యాయతలు కురిపించుకుంటూ కౌగిలించుకుంటారు… మధ్యలో మనం ఎందుకు గోక్కోవడం… పబ్లిక్ డొమైన్ తొక్కాతోలు అని మాట్లాడకండి… అక్కినేని, తొక్కినేని అనే పదాల ఫ్లో వచ్చేది కూడా ఇలాగే… బాలయ్య తరహా తెలుసు కాబట్టి ఆచితూచి మాట్లాడే నాగార్జున కూడా లైట్‌గా నవ్వుకుని వదిలేసి ఉంటాడు… జరిగేది అదే, జరగాల్సిందీ అదే… నాగ చైతన్యకు, అఖిల్ కు పరిణతి తక్కువ… ఇలా తొందర పడ్డారు…
Share this Article