ముందుగా ఒక వార్త చదవండి… ఐటి శాఖ అధికారులపై దాడి… పెద్దపల్లి జిల్లా నందిమేడారంలో దారుణం… క్వారీలో తనిఖీకి వెళ్ళిన ఇద్దరు ఐటి అధికారులను చితకబాదిన సిబ్బంది… గాయాలతో కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిక… దాడికి పాల్పడ్డ ఇద్దరిని అరెస్ట్ చేసిన ధర్మారం పోలీసులు… పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం శివారులోని కంకర క్వారీలో దారుణం జరిగింది… క్వారీ నిర్వాహకులు ఆదాయపు పన్ను శాఖ అధికారులపై దాడి చేశారు… దాడిలో ఇద్దరు ఐటి శాఖ అధికారులు గాయపడ్డారు… వారిని కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు… దాడికి పాల్పడిన క్వారీ ఉద్యోగులు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు… దాడికి గల కారణాలు ఐటి అధికారులు, పోలీసులు స్పష్టంగా తెలుపకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి…
Ads
నందిమేడారం శివారులోని సి5 ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నడుస్తున్న కంకర క్వారీలో బడా నేత బాగస్వామ్యం ఉంది… ఆయన ఆస్థులపై ఇటీవల ఐటి దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఐటి శాఖ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు కంకర క్వారీలో స్థానిక ఐటి శాఖకు చెందిన ఇన్ స్పెక్టర్ లింగం, వేణుగోపాల్ రావు గురువారం రాత్రి తనిఖీలు చేపట్టారు… రాత్రిపూట ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, ఇద్దరు గాయపడి ఆసుపత్రిలో చేరడం కలకలం సృష్టిస్తుంది. దాడిపై అటు అదాయపుపన్ను శాఖ అధికారులు, ఇటు క్వారీ నిర్వాహకులుగానీ, పోలీసులు గానీ నోరుమెదపడం లేదు.
కంకర క్వారీ సీఎం కేసిఆర్ దగ్గరి వ్యక్తిది కావడంతోనే అసలు విషయం బయటకు పొక్కడం లేదని తెలుస్తుంది… తనిఖీకి వెళ్ళిన ఇద్దరు ఐటి అధికారులకు అకౌంటెంట్ కొమ్ము హరీష్ రికార్డులు చూపిస్తుండగా క్వారీలో పనిచేసే ఉద్యోగులు ఇద్దరు మద్యం మత్తులో అక్కడికి చేరుకుని ఐటి అధికారులతో వాగ్వివాదానికి దిగినట్లు తెలిసింది… వాగ్వాదంతో క్వారీ ఉద్యోగులు ఇద్దరు, ఐటి శాఖకు చెందిన వేణుగోపాల్ రావు, లింగంపై కర్రలు, రాళ్ళతో దాడి పాల్పడ్డారు… దాడిలో లింగంకు స్వల్పగాయాలు కాగా, వేణుగోపాల్ తలకు బలమైన గాయాలు కావడంతో కరీంనగర్ లోని గ్లోబల్ మాక్స్ మల్టీ స్పెషాలిటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు… వేణుగోపాల్ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు…
దాడిలో గాయపడ్డవారు రాత్రే ధర్మారం పోలీస్ స్టేషన్ కు వెళ్ళి పిర్యాదు చేశారు. దాడిలో గాయపడ్డ లింగం పిర్యాదు మేరకు దాడికి పాల్పడ్డ సూపర్ వైజర్ సామంతుల రాజేశం, వంటమనిషి దాడి శ్రీనివాస్ పై హత్యాయత్నంతోపాటు పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడ్డ ఇద్దరు రాజేశం, శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి చేసినట్లు రామగుండం సిపి కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. పోలీసులు మీడియాకు ముఖం చాటేయగా, ఐటి శాఖ అధికారులు నోరువిప్పకుండా మౌనంగా ఉండడంతో పలురకాల చర్చ జరుగుతుంది. బడా నేత భాగస్వామ్యం ఉన్న క్వారీలో దాడి జరగడంతోనే ఎవ్వరు నోరువిప్పడం లేదనే ప్రచారం జరుగుతుంది. దాడిని ఐటి శాఖ అధికారులు తీవ్రంగా పరిగణిస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్దమైనట్లు ఉదయం ప్రచారం జరిగినా, సాయంత్రం వరకు అంతా చల్లబడ్డారు…’’
……….. ఇదీ వార్త… మొత్తం చదివాక జుత్తు పీక్కునేలా ఉన్నట్టు అనిపిస్తోంది కదా… అసలు ఐటీ శాఖ అధికారులు ఇద్దరే రహస్యంగా, అంత దొంగ రాత్రి, గుట్టుచప్పుడు గాకుండా, జేమ్స్ బాండ్ల తరహాలో తనిఖీలకు వెళ్లడం ఏమిటి అనేదే ప్రధాన సందేహం… పోనీ, వెళ్లారు, అంత రాత్రి కూడా పాపం, అంత శ్రద్ధగా, నిజాయితీగా, అణకువగా, ఒద్దికగా అక్కడి సిబ్బంది అకౌంట్ పుస్తకాలు చూపించడం మరీ అరుదైన వింత… అక్కడ వీళ్లేం అడిగారో, వాళ్లేం చెప్పారో… మొత్తానికి ‘సత్సంబంధాలు వర్కవుట్ కాలేదు’… దాంతో అక్కడ ఇద్దరు వ్యక్తులు మీదపడి చావబాదేశారు… ఈ ఐటీ శాఖ ఉద్యోగుల డెడికేషన్ చివరకు అక్కడ వంటమనిషికి కూడా నచ్చలేదు… గెస్టులు అని కూడా చూడకుండా కుమ్మేశాడు… మరి అంత రాత్రి వెళ్లినవాళ్లు… ఎక్కడో ఏదో ఓ పాయింట్ దగ్గర మర్యాదగా సెటిల్ చేసుకోవాలి కదా… చేసుకోకపోతే, అసలే పెద్ద పెద్దోళ్లతో సంబంధం ఉన్న క్వారీవాళ్లు ఊరుకుంటారా మరి..? ఇరగదీశారు… అంత రాత్రి కూడా పోలీసులు అర్జెంటుగా కేసు నమోదు చేసుకోవడం ఓ విశేషం… అంత రాత్రి తనిఖీలకు ఐటీ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించడం మరో వింత… హేమిటో, ఈమధ్య వింతలన్నీ తెలంగాణలో జరుగుతున్నయ్…!!
Share this Article