శాకుంతలం సినిమాకు సంబంధించి మొదటి పాట విని మెచ్చుకున్నాం కదా… చప్పట్లు కొట్టాం కదా… సరళంగా హృద్యంగా ఉందనీ అభినందించాం కదా… రెండో పాట రిలీజ్ చేశారు, మొదటి పాట తాలూకు ఉత్సాహానికి పంక్చర్ కొట్టింది ఈ పాట… సినిమా జాప్యమయ్యేకొద్దీ, త్రీడీ సహా హై టెక్నికల్ స్టాండర్డ్స్ ఆశ్రయించడం, పాన్ ఇండియా మార్కెటింగ్ గట్రా బిజీలో మునిగిపోయి దర్శకుడు గుణశేఖర్ పాటలు ఎలా దెబ్బతిన్నాయో చూసుకోనట్టున్నాడు…
మణిశర్మ కంపోజ్ చేసిన ఈ పాట విడిచిపెట్టిపోయి, మళ్లీ పత్తాజాడ లేని దుష్యంతుడి కోసం శకుంతల పాడుకునే పాట… విరహాన్ని, ప్రియుడి సన్నిధిలో గడిపిన మధురక్షణాల్ని, మదినిండా అలుముకుంటున్న ఆందోళనను, వచ్చి త్వరగా తీసుకుపోరా అనే అభ్యర్థనను వ్యక్తీకరించాల్సిన పాట… అటూఇటూ గాకుండా నీరసరాగంలో సాగిన ఈ పాటకు పెద్ద మైనస్ సింగర్స్ సిధ్ శ్రీరాం, చిన్మయి…
నిజానికి చిన్మయి డబ్బింగులో గానీ, సింగింగులో గానీ జాగ్రత్తగా ఉంటుంది… కానీ ఈ పాటలో అనేక పదాల్ని పుల్లవిరుపుగా పాడేసింది… ఇక సిధ్ శ్రీరాం కర్ణకఠోరుడు… ఆ ఉచ్చరణ దారుణంగా ఉంది… ఇంతకుముందే ఓ వివాదం గురించి చెప్పుకున్నాం కదా… ఉంటే, కంటే, మంటి, పంటి,
ఒంటి… లాంటి సున్నా తరువాత ట, టి, టే అక్షరాలు వచ్చే పదాలొస్తే… వాటిని అతను… ఉల్టే, కల్టే, మల్టి, పల్టి, ఒల్టి… అని పాడుతున్నాడనీ… అలాగే… చేసుకుందాం, చూసుకుందాం, కొట్టుకుందాం, దాక్కుందాం… లాంటి కు సున్నా తరువాత దా వచ్చే మాటలను కూడా చేసుకుల్దాం,
చూసుకుల్దాం, కొట్టుకుల్దాం, దాక్కుల్దాం... అని పరవశించి పాడుతున్నాడనీ చెప్పుకున్నాం కదా…
Ads
సరే, హైపిచ్‌లో పాడుతున్నప్పుడు అనుస్వరానికి ఏదేని హల్లు అరువు తెచ్చుకోవడం పరిపాటేనని అర్థపండితుడు, ఏకనాముడు అనంత శ్రీరాముడు కూడా వెనకేసుకొచ్చి, నేనూ ఉత్త పోషిగాడినే అని నిరూపించుకున్నాడు… పమిడికాల్వ మధుసూదన్ అక్షరాల్లో ఆరబెడితే, సింగర్ గంగాధరశాస్త్రి ఏదో ఇంటర్వ్యూలో సిధ్ శ్రీరాం తప్పుల్ని తను పాడి మరీ ఎత్తిచూపాడు… ఇక ఈ పాట విషయానికొద్దాం… (మణిశర్మకు తెలుగు గాయకులే దొరకలేదా..?)
గొంతులో మాధుర్యం లేదు… 2. రుషివనంలోన అనే సింపుల్ పదాన్ని కూడా రుషివనంలానా అని పలుకుతున్నాడు… అదీ ఆ పాట మొదటి పదం కూడా… ఆ మొదటి పదంతోనే పాటపై సదభిప్రాయం పోయింది… హిమవనంలోన పదాన్ని కూడా అంతే… ప్రణయ బదులు ప్రిణయ, ప్రథమ బదులు ప్రదమ ఎట్సెట్రా…
ఇందులో ఓచోట రచయిత చెరుకు శరమే విసిరినాడే అని రాసినట్టు Priyadarshini Krishna గుర్తించి, విని, అర్థమేమిటో తెలియక హతాశురాలైంది… మన్మథుడి విల్లు చెరుకుగడ అని అందరికీ తెలుసు… బాణాలేమో పూలు… కానీ ఈ రచయిత శ్రీమణి వింటికీ, శరానికీ తేడా తెలియనట్టుగా చెరుకు శరం అని రాసిపారేశాడు… రాస్తుంటే ఉన్న మతి పోయిందని కొత్త సామెత…
మరోచోట వలుడు వేటాడినాడు అని రాస్తాడు… అంటే మన్మథుడు అనేనా..? ఎన్ని శబ్దరత్నాకరాలు తిరగేసినా ఆ పదం ఆ అర్థంలో ఒక్క పర్యాయపదం కూడా కనిపించదు… పువ్వులు తేనె కలిస్తే పువ్వుల్ దేనె అవుతుందేమో గానీ, రెండు వేర్వేరు పదాలుగా పాడినా, రాసినా తేనె దేనె ఎలా అవుతుంది శ్రీమణీ…? అలాగే చిక్కెంగాంత పదం కూడా… ఏమాటకామాట కొమ్మలు దాటి రావే కోకిలా, యవ్వనవలోకం పదాలు బాగున్నయ్… స్థూలంగా మణిశర్మ అశ్రద్ధ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది… కొంపదీసి డీఎస్పీ, థమన్ స్థాయికి దిగిపోతున్నావా మాస్టారూ..?! చూడబోతే వచ్చేసారి తమరికీ ఆస్కార్ నామినేషన్ తప్పేట్టు లేదు..!!
Share this Article