ఒడిశాలో మాజీ సీఎం గొమాంగో బీఆర్ఎస్‌లో చేరుతున్నాడు, ఇక ఒడిశా రాజకీయం కేసీయార్ చేతికి వచ్చినట్టే…. తోట చంద్రశేఖర్ చేరాడు, ఇక ఏపీ కేసీయార్ బాక్సులో పడిపోయినట్టే… మహారాష్ట్రలో ఛత్రపతి వారసుడు శంభాజీరాజే చేరుతున్నాడు, ఇంకేం మహారాష్ట్రం బీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చిేనట్టే… ఇలా పిలవగానే మొన్న ముగ్గురు ముఖ్యమంత్రులు వాలిపోయారు… రేపు మరో ఇద్దరు వస్తున్నారు… దేశ్‌కీనేతా కేసీయార్, కాబోయే ప్రధాని కేసీయార్……. ఇలాంటి ప్రచారం జోరుగా సాగుతోంది కదా తెలంగాణలో… కానీ అంత సీనేమీ లేదని ఇండియాటుడే బద్ధలు కొట్టేసింది…
ఇండియాటుడే తరచూ నిర్వహించే మూడ్ ఆఫ్ ది నేషన్ శాంపిల్ పరిమాణం గానీ, యాక్యురసీ గానీ పెద్ద సంతృప్తికరంగా ఉండవు… కానీ స్థూలంగా అది నేషన్ మూడ్ చెప్పగలుగుతోంది… సో, దాన్నే ప్రామాణికంగా తీసుకుని మాట్లాడుకుందాం… ఎమ్మెల్యేల కొనుగోలు ప్రహసనం తనను ఝామ్మని జాతీయ తెర మీదకు తీసుకొస్తుందనీ, మోడీకి ముచ్చెమటలు పడతాయని కేసీయార్ అనుకోవచ్చుగాక, నిజంగానే బీజేపీ హైకమాండ్ కేసీయార్‌ను ఉపేక్షిస్తున్నామనే ఆత్మసమీక్షకు లోనుగావచ్చుగాక… కానీ కేసీయార్ జాతీయ ఆశలు అడుగు కూడా పడలేదు, దేశంలో తనను ఎవరూ గుర్తించడం లేదు, లైట్ తీసుకుంటున్నారు అని ఇండియాటుడే సర్వే తేటతెల్లం చేస్తోంది…
పినరై విజయన్, కేజ్రీవాల్, పంజాబ్ సీఎం వచ్చారు కదా.., అఖిలేష్ వచ్చాడు కదా.., రేప్పొద్దున స్టాలిన్, సొరెన్ వస్తారు కదా అంటారా..? పిలిస్తే ఎందుకు రారు..? యాంటీ బీజేపీ వేదికల్ని ఆనందంగా పంచుకుంటారు… ఎవరి రాజకీయం వాళ్లకుంటుంది… వాళ్లు రేప్పొద్దున కేసీయార్ కూటమికి సపోర్టుగా నిలిచేది లేదు, ఒక్కటంటే ఒక్క చిన్న పార్టీ కూడా బీఆర్ఎస్‌లో విలీనం అయ్యేది లేదు… ఈ గొమాంగో పేరు వినక ఎన్నేళ్లయింది… అప్పట్లో సీఎంగా ఉండి, ఎంపీగా వోటు వేసి వాజపేయి ప్రభుత్వాన్ని పడగొట్టిన అనైతికుడు… ఈ శంభాజీరాజె పేరు మహారాష్ట్రలోనే ఎవరికీ తెలియదు పెద్దగా… తోట చంద్రశేఖరుడి సంగతి తెలిసిందే… వీళ్లా బీఆర్ఎస్ జాతీయ రథాన్ని పరుగులు పెట్టించేది..?
Ads
ఇండియాటుడే సర్వేలో అపోజిషన్‌ను ఎవరు లీడ్ చేయగలరు అనే ప్రశ్నకు… కేసీయార్ పేరును కూడా అర్హనేతల జాబితాలోకి తీసుకోలేదు… అదీ తన ఇంపాక్ట్‌లెస్ పొజిషన్… ఇప్పటికీ బెటర్ ప్రతిపక్ష నేత కేజ్రీవాల్ అనే భావన జాతీయ స్థాయిలో ఉంది… పైన చార్ట్ చూడండి… 24 శాతం మంది వోటు కేజ్రీవాల్‌దే… ఈమధ్య చల్లబడిపోయిన నిప్పు మమతా బెనర్జీది తరువాత స్థానం… మోడీని ఢీకొట్టడానికి ఆమే బెటర్ చాయిస్ అని చెబుతున్న వాళ్ల సంఖ్య 20 శాతం… వాళ్లిద్దరి తరువాతే రాహుల్… అదీ 13 శాతం… నితిశ్ ఊసు కూడా లేదు… సో, బాగా పాపులారిటీ ఉన్న ప్రతిపక్ష నేత లేకపోవడమే మోడీ బలం… అదీ ఆయన బలంలోని అసలు మర్మం… గత సర్వేతో పోలిస్తే అసలు మోడీని ప్రస్తుత ప్రతిపక్షం ఎదుర్కోలేదని మరో 10 శాతం మంది అదనంగా చెబుతున్నారు…
రాహుల్ కాంగ్రెస్ పార్టీని ఉద్దరించగలడా లేదానేది కీలక ప్రశ్నే… కానీ కాంగ్రెస్ మాత్రమే బీజేపీకి అంతోఇంతో పోటీ ఇవ్వగలదనేది సుస్పష్టం… కాంగ్రెస్ లేకుండా బీజేపీని ఢీకొట్టే కూటమి వృథా… ఆ ప్రయత్నాలు కూడా దండుగ అని ఇండియాటుడే సర్వే చెబుతోంది… ఈరోజు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 191 స్థానాలు గెలుచుకుంటుంది అనే ఫలితాన్ని అల్లాటప్పాగా తీసుకోలేం… అంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ కుదేలైన 52తో పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు… చిన్న విషయమేమీ కాదు… కాంగ్రెస్ పునాదుల్ని పెకిలించడం బీజేపీకి అంత తేలికైన వ్యవహారం కాదు…
రాహుల్ నాయకత్వం మీద సొంత పార్టీలోనే సదభిప్రాయం లేకపోవచ్చుగాక, తను ఓ సమర్థ ప్రతిపక్ష నేతగా రాణించగలడని ప్రజలు భావించడం లేదు కావచ్చుగాక… కానీ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ తన పాదయాత్రతో ఓ జోష్ తీసుకురావడంలో సక్సెసయ్యాడు… అది కుర్చీ దాకా తీసుకుపోకపోవచ్చు కానీ కాంగ్రెస్ శ్రేణులకు ఓ కదలిక… ఇండియాటుడే మూడ్ ఆఫ్ ది నేషన్ చెబుతున్నదీ అదే… మూడో కూటమిగా తెరపైకి వస్తున్న కేసీయార్ స్థానం ఎక్కడ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో.. ?! జాతీయ రాజకీయం అంటే పంజాబ్‌లో రైతు చెక్కులు, బీహార్‌లో సైనికుల చెక్కులు, పత్రికల్లో ఫస్ట్ పేజీ యాడ్స్ కావేమో కేసీయార్ సార్..?! ఇలాంటి రాజకీయ చిట్కాలు అమాయకులైన తెలంగాణ ప్రజల్ని బుట్టలో పడేస్తాయేమో గానీ, దేశప్రజలందరినీ కాదు..!!
Share this Article