అనారోగ్య ఛాయలేమీ కనిపించలేదు… నిశ్శబ్దంగా కన్నుమూసింది… చికిత్సలు, హాస్పిటళ్ల జాడలేదు, లేకపోతే మన చానెళ్లు, మన మీడియా ఇప్పటికి ఆమెను వందసార్లు చంపేసి ఉండేవి… ఇంకా చావదేమి అని పిట్టకుపెట్టినట్టు ఎదురుచూసేది… ఈ పెంట వాసనలేమీ లేకుండా గౌరవంగా, తలఎత్తుకుని, సగర్వంగానే, సంపూర్ణ జీవితాన్ని అనుభవించి 86 ఏళ్ల వయస్సులో కన్నుమూసింది తెలుగు వెండితెర సత్యభామ జమున…
ఆమె ఎక్కడ పుట్టింది, ఎలా పెరిగింది, సినిమాల్లోకి ఎలా వచ్చింది, సత్యభామ పాత్రకు ఫేమసే అయినా ఇంకా మరవలేని పాత్రల్ని ఆమె ఏమేం పోషించింది వంటి వివరాలు అందరూ చెబుతారు ఇప్పుడు… ఘనంగా నివాళ్లు అర్పిస్తారు… కానీ అన్నింటికీ మించి స్మరించాల్సింది ఆమె నటన, ఆమె అందం గురించే కాదు… ఆమె టెంపర్‌మెంట్… ధిక్కార పోకడ… తన ఆత్మాభిమానాన్ని ప్రదర్శించుకున్న తీరు… ప్రత్యేకించి ఇద్దరు అగ్రనటుల ఆగ్రహాన్ని తట్టుకుని ఆమె నిలబడిన తీరు తలుచుకోవాలి…
Ads
దాపరికం దేనికి..? ఒక దశలో టాలీవుడ్ అంటే ఎన్టీయార్, ఏఎన్నార్… బయటికి ఎన్ని నీతులు చెప్పినా సరే, వాళ్ల పోకడల్లో విపరీతమైన అహం… వాళ్లకు నచ్చకపోతే ఇండస్ట్రీలో మనుగడే కష్టమైన రోజులు… ఇండస్ట్రీలో ప్రతివాడూ వాళ్ల భజన చేయాల్సిందే, కాళ్లపై పడాల్సిందే… లేకపోతే పుట్టగతులు లేకుండా చేసేవాళ్లు… ఆ ఇద్దరూ ఒక భానుమతి, ఒక ఎస్వీఆర్ జోలికి వెళ్లేవాళ్లు మాత్రం కాదు… వాళ్లను ఒకటి అంటే పది అనగలరు కాబట్టి… భానుమతి అయితే మీద చేయి కూడా వేయనిచ్చేది కాదు…
తరువాత అలా వాళ్లను ధిక్కరించి నిలబడిన మూడో వ్యక్తి జమునే కావచ్చు బహుశా… ఆమె టెంపర్‌మెంట్ వాళ్లకు నచ్చేది కాదు… ఛస్, ఏం చూసుకుని ఆమెకు ఈ ధిక్కార పోకడ అని వాళ్లకు కోపం… ఇండస్ట్రీలో హీరోయిన్లు, ఇతర మహిళ నటులు, టెక్నిషియన్లను ఎలా చూసేవాళ్లో తెలిసిందే కదా… ఆమె స్వయంగా చెప్పుకున్న విషయమేమిటంటే… దివంగత నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావులు తనను మూడేళ్ల పాటు బాయ్‌కాట్ చేశారని..!
ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయమే… రీసెంటుగా కూడా ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది… తనను తొక్కిపారేయాలని ఆ ఇద్దరూ అనుకున్నా సరే ఆమె నిలబడింది… ఠారెత్తిపోయి కాళ్ల మీద పడిపోలేదు… అదీ ఆమెలోని అసలైన అందం… తనకు అత్యంత ఇష్టమైన సత్యభామ పాత్రలోని ఆ ఆత్మాభిమానమే అసలైన సౌందర్యం… ఆ పోకడకు గాను ఆమెకు నివాళి అర్పించాలి… అగ్రనట పెత్తందారీ, మగ దురహంకారాన్ని అప్పట్లోనే ఆమె ఎహెఫో అంటూ ఛీత్కరించి, మరింత పొగరుగా బతికిన తీరుకు జోహార్…
‘‘ఆడవాళ్లు బయటకొచ్చి ఉద్యోగాలు, కానీ మరేదైనా చేస్తే మగవాడు సహించలేడు వాళ్లకు బానిసల్లా ఉండాలనే కోరుకుంటారు. ఇప్పుడు కాస్త కాలం మారింది… కానీ బాబు అంటూ దణ్ణం పెట్టించుకోవాలనే తత్వం చాలా మందిలో చాలా ఎక్కువగా ఉంటుంది… ఇలాంటి పరిస్థితులని స్త్రీలు ఉద్యోగంలో కానీ, ఇతర రంగాల్లో కానీ ఎదుర్కోక తప్పదు, ఇవన్నీ ఎదుర్కోవడానికి స్త్రీలకు చాలా గుండె ధైర్యం ఉండాలి. తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం వల్లే ఎన్టీఆర్, ఏఎన్నార్ బాయ్‌కాట్ చేశారు’’ అంటూ పరోక్షంగా, ప్రత్యక్షంగా చెప్పుకొచ్చింది ఆమె… హేట్సాఫ్… పొగరుబోతు, టైంకు రాదు, కాలం విలువ తెలియదు అని ఆమె మీద అభియోగాలు… టైంకు వస్తానని లేఖ రాసిస్తే బ్యాన్ తీసేస్తామని మధ్యవర్తులకు చెప్పారు… నథింగ్ డూయింగ్ అని కొట్టిపారేసింది ఆమె… అదీ ఆమె టెంపర్ మెంట్…
ఆ ఇద్దరు హీరోలు లేకుండా దాదాపు 18 నుండి 20 సినిమాలు చేసింది ఆమె… వాటిల్లో 15 సినిమాలు హిట్… ఆ ఇద్దరు హీరోలు లేకపోయినా జమున మూడో హీరో అంటూ నిర్మాతలు తనతో సినిమాలు చేశారు… దటీజ్ జమున… ఒక వెటరన్ తెలుగు నటిగా, మరుపురాని పాత్రల్ని పోషించిన తారగా కాదు… తలెగరేసి నిలబడిన ఆమె బతుక్కి నివాళి… నివాళి…!!
Share this Article